టి20 ప్రపంచకప్ ఫేవరెట్‌లలో ఒక జట్టు భారత్... బలాబలాలు, అనుభవం ప్రకారం టోర్నీలో ఆడుతున్న ఏ టీమ్‌కంటే తక్కువ కాదు... కానీ మూడో మ్యాచ్‌లో బరిలోకి దిగే సమయానికి భారత్ పరిస్థితి అందరికంటే భిన్నంగా ఉంది. వరల్డ్‌కప్ గెలుచుకోవడం సంగతి తర్వాత... గ్రూప్ దశలోనే నిష్క్రమించకుండా పోరాడాల్సి వస్తోంది. తొలి రెండు మ్యాచ్‌లలో చిత్తుగా ఓడిన ఫలితమిది! అయితే ఇంకా ఏమూలో కాస్త ఆశ మిగిలి ఉంది. మన చేతుల్లో ఉన్న మూడు మ్యాచ్‌లలోనూ గెలిచి ఆపై ఇతర మ్యాచ్‌ల ఫలితాలు, సమీకరణాలపై ఆధార పడాల్సిందే. ఈ క్రమంలో మొదటి గండం అఫ్గానిస్తాన్ రూపంలో పొంచి ఉంది. మామూలుగానైతే ఇది మనకు ఏకపక్ష విజయం కావాలి. కానీ మన పేలవ ప్రదర్శన, టోర్నీలో అఫ్గాన్ పోరాటపటిమ చూస్తే ఈ మ్యాచ్ అంత సులువు కాబోదు. అన్నింటికి మించి పొరపాటున ఇక్కడా తేడా వచ్చిందంటే ఇక చెప్పేదేమీ ఉండదు!
అబుదాబి: వరుసగా రెండు పరాజయాలతో అభిమానుల ఆగ్రహావేశాలను రుచి చూసిన టీమిండియా వాటిని దాటి ఇప్పుడు మరో కీలక సమరానికి సన్నద్ధమైంది. గ్రూప్–2లో భాగంగా నేడు జరిగే మ్యాచ్‌లో భారత జట్టు అఫ్గానిస్తాన్‌తో తలపడుతుంది. భారత్ టోర్నీలో ఇంకా బోణీ చేయకపోగా... అఫ్గాన్ టీమ్ తమకంటే బలహీనమైన నమీబియా, స్కాట్లాండ్‌లపై ఘన విజయాలు సాధించి గ్రూప్ టాపర్ పాకిస్తాన్‌ను దాదాపు ఓడించినంత పని చేసింది. ఈ నేపథ్యంలో ఆసక్తికర సమరం జరగవచ్చు.
చదవండి: Rohit Sharma: వన్డే, టి20 కెప్టెన్‌గా రోహిత్.. కోహ్లి టెస్టులకే పరిమితం..?!
మార్పు ఉంటుందా!
గత మ్యాచ్‌లో ఆడని సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రాలేదు. అతను కోలుకోకపోతే దాదాపు అదే జట్టును టీమిండియా కొనసాగించవచ్చు. కాకపోతే బ్యాటింగ్ ఆర్డర్‌లో స్వల్ప మార్పు ఖాయం. రోహిత్ శర్మ ఎప్పటిలాగే ఓపెనర్‌గా వస్తే ఇషాన్ కిషన్ అతనికి జోడీగా బరిలోకి దిగుతాడు. అప్పుడు రాహుల్‌ను నాలుగో స్థానంలో పంపించే అవకాశం ఉంది. అయితే ఆర్డర్ మారినా బ్యాట్స్‌మెన్ ఆటతీరు మారితేనే జట్టుకు విజయావకాశాలు ఉంటాయి. తొలి రెండు మ్యాచ్‌లను బట్టి టీమ్‌లో ఏ ఒక్కరూ తమ స్థాయికి తగినట్లుగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదనేది వాస్తవం. ఆల్‌రౌండర్లు హార్దిక్, జడేజాల పరిస్థితి కూడా అంతే. పేసర్లుగా బుమ్రా, షమీలు ఖాయం. అయితే సీనియర్ అశ్విన్‌ను ఆడిస్తారా లేదా అనేది మరోసారి ప్రశ్నార్ధకంగా మారింది. మొత్తంగా రెండు మ్యాచ్‌లలో కలిపి మన బౌలర్లు రెండు వికెట్లు మాత్రమే తీయగలగడం పరిస్థితి సూచిస్తోంది. కాబట్టి గెలుపు కావాలంటే ప్రతీ ఒక్కరి నుంచి అద్భుత ప్రదర్శన రావాల్సిందే.
చదవండి: ధోని, రవిశాస్త్రి మధ్య ఏం జరిగింది.. కోహ్లినే కారణమా!
స్పిన్ బలంతోనే...
అఫ్గానిస్తాన్‌పై టి20 ప్రపంచకప్‌లో రెండు సార్లు తలపడిన భారత్ రెండుసార్లూ నెగ్గింది. అయితే గత కొన్నేళ్లుగా ఈ ఫార్మాట్‌లో ఆ జట్టు ఎంతో మెరుగు పడింది. ఒక ఓవర్ ఫలితాన్ని మార్చేసే అవకాశం ఉన్న టి20ల్లో అఫ్గాన్ ఎన్నో సార్లు సంచలనాలకు చేరువగా వచ్చింది. ఈ టోర్నీలో కూడా ఆసిఫ్ అలీ అనూహ్యంగా చెలరేగి ఉండకపోతే పాక్‌పై కూడా అఫ్గాన్ గెలిచేదేమో! కాబట్టి టీమ్‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఒకవైపు వికెట్లు పడినా, మరోవైపు ఆత్మరక్షణలో పడకుండా ధాటిగా ఆడుతూ చకచకా పరుగులు సాధించగల బ్యాట్స్‌మెన్ జట్టులో ఉన్నారు. ఓపెనర్లు హజ్రతుల్లా, షహజాద్ ప్రతీసారి శుభారంభాలు అందించారు. కెప్టెన్ నబీకి భారీ షాట్లు ఆడగల నైపుణ్యం ఉంది. అఫ్గాన్ టీమ్‌కు కూడా యూఏఈ వేదికలపై మంచి అనుభవం ఉంది. అన్నింటికి మించి టీమ్‌లో స్పిన్నర్ల ‘12 ఓవర్లు’ మ్యాచ్‌ను శాసిస్తాయి. రషీద్ ఖాన్, నబీ, ముజీబ్‌లు సత్తా చాటితే భారత బ్యాట్స్‌మెన్‌కు అంత సులువు కాదు. మొత్తంగా ఈ టీమ్ అంటే తేలికభావం చూపించకుండా భారత్ ఆడాల్సి ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, ఇషాన్/సూర్యకుమార్,పంత్, హార్దిక్, జడేజా, శార్దుల్, షమీ, బుమ్రా, వరుణ్.
అఫ్గానిస్తాన్: నబీ (కెప్టెన్), హజ్రతుల్లా, షహజాద్, రహ్మానుల్లా, హష్మతుల్లా/ఉస్మాన్, నజీబుల్లా, గుల్బదిన్, రషీద్, ముజీబ్, నవీన్, హసన్.
పిచ్, వాతావరణం సాధారణ బ్యాటింగ్ పిచ్. మంచు ప్రభావం కూడా ఉంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు లక్ష్య ఛేదనకే మొగ్గు చూపవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment