T20 World Cup 2022- Gautam Gambhir Comments: టీ20 ప్రపంచకప్-2022కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఆక్టోబర్ 16న జిలాంగ్ వేదికగా జరగనున్న శ్రీలంక-నమీబియా మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. తొలుత రౌండ్ 1 మ్యాచ్‌లు జరగనుండగా.. ఆక్టోబర్ 22 నుంచి సూపర్-12 మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. ఇది ఉండగా.. ఈ పొట్టి ప్రపంచకప్ ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు.
టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక నుంచి ఇతర జట్లకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది అని గంభీర్ సూచించాడు. కాగా గత నెలలో జరిగిన ఆసియాకప్-2022లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన శీలంక ఏకంగా టైటిల్‌నే ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే.
ఆసియాకప్-2022 సూపర్ 4లో భాగంగా కీలక మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో భారత్ ఓటమిపాలైంది. ఇక ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక తొలుత క్వాలిఫియర్ మ్యాచ్‌ల్లో ఆడనుంది. ఆక్టోబర్ 16న నమీబియాతో జరగనున్న మ్యాచ్‌తో శ్రీలంక తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ఆరంభించనుంది.
ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ 'గేమ్ ప్లాన్'లో గంభీర్ మాట్లాడుతూ.." శ్రీలంక జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ముఖ్యంగా ఆసియాకప్‌లో వారు ఆడిన విధానం అద్భుతమైనది. టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక రెట్టింపు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.
అదే విధంగా వారి స్టార్ బౌలర్లు దుష్మంత చమీర, లహిరు కుమార తిరిగి రావడంతో జట్టుకు మరింత బలం చేకూరుతుంది. ఈ మెగా ఈవెంట్‌లో శ్రీలంక నుంచి ఇతర జట్లకు గట్టి పోటీ ఖచ్చితంగా ఎదురు కానుంది. అదే విధంగా ఈ పొట్టి ప్రపంచకప్‌లో ఏ జట్టును కూడా తేలికగా తీసుకోకూడదు" అని పేర్కొన్నాడు.
చదవండి: Women Asia Cup Final: ఫైనల్లో శ్రీలంక చిత్తు.. ఆసియాకప్ విజేతగా భారత్
Comments
Please login to add a commentAdd a comment