ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఆట కట్టించేశాం... ఆపై చిన్న జట్టయిన నెదర్లాండ్స్‌ను ఓడించేశాం... లీగ్ దశలో చివరి రెండు మ్యాచ్‌లు బంగ్లాదేశ్, జింబాబ్వేలతోనే కాబట్టి బెంగ పడాల్సిందేమీ లేదు... అటు రెండు మ్యాచ్‌లు, ఇటు రెండు మ్యాచ్‌ల మధ్య మరో కీలక సమరానికి భారత్ సన్నద్ధమైంది. పటిష్ట జట్టయిన దక్షిణాఫ్రికా మనకు సవాల్ విసురుతోంది.
టి20 ప్రపంచకప్‌లో రికార్డు, ఇరు జట్ల మధ్య ఇటీవలి సిరీస్, తాజా ఫామ్... ఎలా చూసినా భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా, అనుకూల పిచ్‌పై సఫారీ పేస్ బౌలింగ్ బలగం చెలరేగితే గెలుపు అంత సులువు కాబోదు. గత మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన దక్షిణాఫ్రికా కూడా పాకిస్తాన్‌తో ‘నాకౌట్’ సమస్య రాకుండా ఇక్కడ గెలిచి తమ సెమీఫైనల్ అవకాశాలు మెరుగుపర్చుకోవాలని పట్టుదలగా ఉంది.
పెర్త్: టి20 ప్రపంచకప్‌లో గత ఆదివారం భారత అభిమానులకు ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకాన్ని అందిస్తే... ఇప్పుడు మరో ఆదివారం సాయంత్రం అందరికీ అదే స్థాయి వినోదం అందించేందుకు వచ్చేసింది. గ్రూప్–2లో భాగంగా నేడు జరిగే మూడో ‘సూపర్ 12’ మ్యాచ్‌లో భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. భారత్ గెలిస్తే సెమీఫైనల్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకోవడంతోపాటు గ్రూప్‌లో టాపర్‌గా నిలిచే అవకాశం కూడా ఉంది.
అదే జట్టుతో...
భారత జట్టు ప్రదర్శన చూస్తే తుది జట్టులో మార్పులకు ఎలాంటి అవకాశం కనిపించడం లేదు. కేఎల్ రాహుల్ మినహా ప్రతీ ఆటగాడు తమదైన రీతిలో గత రెండు విజయాల్లో తగిన పాత్ర పోషించారు. దాంతో రాహుల్ స్థానంలో ఓపెనర్‌గా పంత్ ఆడవచ్చని వినిపించింది. అయితే బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అలాంటిదేమీ లేదని స్పష్టం చేసేశాడు. పంత్ ఎడంచేతి వాటం అదనపు ప్రయోజనమే అయినా, రాహుల్‌కు మేనేజ్‌మెంట్ మరో అవకాశం ఇస్తోంది. ఈ మ్యాచ్‌లో అసలు సవాల్ భారత టాపార్డర్‌కు ఎదురు కానుంది.
140–150 కిలోమీటర్ల వేగంతో పాటు బంతిని స్వింగ్ చేస్తున్న రబడ, నోర్జేలను సమర్థంగా ఎదుర్కోవడంపైనే గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయంటే తప్పు లేదు. బౌన్సీ పిచ్‌పై ఆరంభంలోనే కోహ్లి, రోహిత్, సూర్యకుమార్ ఎదురు దాడి చేస్తారా లేక సగం ఇన్నింగ్స్ వరకు జాగ్రత్తగా నిలబడి ఆపై దూకుడు ప్రదర్శిస్తారా అనేది ఆసక్తికరం. మన బౌలర్లలో షమీ మంచి వేగంతో పాటు బౌన్స్ రాబట్టగలడు. భువనేశ్వర్, అర్‡్షదీప్‌ల వేగం ఎంత వరకు ఇక్కడ పనికొస్తుందో చూడాలి. ప్రత్యర్థి జట్టులోని ముగ్గురు ప్రధాన బ్యాటర్లు ఎడంచేతి వాటం కావడంతో అక్షర్ పటేల్‌కు బదులు చహల్‌ను ఆడించే అవకాశం ఉన్నా... అక్షర్ ఎడంచేతి వాటం బ్యాటింగ్ జట్టుకు కీలకమే.
బవుమా మినహా...
దక్షిణాఫ్రికా ప్రధాన బ్యాటర్లంతా దూకుడుగా ఆడగల సమర్థులే. అంతర్జాతీయ టి20ల్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన రెండో ఆటగాడైన రిలీ రోసో సమరోత్సాహంతో ఉన్నాడు. భారత్‌తో ఇండోర్‌లో జరిగిన చివరి టి20లోనే అతను శతకం బాదాడు. డికాక్, మిల్లర్ రూపంలో ఇద్దరు మెరుపు బ్యాటర్లు ఉండగా, మార్క్‌రమ్ మిడిలార్డర్‌లో జట్టుకు వెన్నెముక. యువ ఆటగాడు స్టబ్స్ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. అయితే వరుసగా విఫలమవుతున్నా, కెప్టెన్ బవుమా విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. పిచ్‌ను బట్టి చూస్తే స్పిన్నర్ షమ్సీని తప్పించి రబడ, నోర్జేకు తోడుగా మూడో పేసర్‌గా ఇన్‌గిడి లేదా జాన్సెన్‌లలో ఒకరు జట్టులోకి రావడం ఖాయం.
పిచ్, వాతావరణం
పేస్, బౌన్స్, ఆరంభంలో స్వింగ్... ఇలా పేసర్లకు అన్ని రకాలుగా అనుకూలమైన పిచ్. ఇరు జట్ల బౌలర్లు దీనిని ఎలా వాడుకుంటారనేది కీలకం. శనివారం పెర్త్‌లో వర్షం కురిసినా, మ్యాచ్ రోజు ఇబ్బంది ఉండకపోవచ్చు.
టి20 ప్రపంచకప్‌లో నేడు
బంగ్లాదేశ్ vs జింబాబ్వే (ఉ.గం. 8:30 నుంచి)
పాకిస్తాన్ vs నెదర్లాండ్స్ (మ.గం. 12:30 నుంచి)
భారత్ vs దక్షిణాఫ్రికా (సా.గం. 4:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment