T20 World Cup 2022: India vs Zimbabwe Last League Match on 06 Nov 2022 - Sakshi
Sakshi News home page

T20 WC 2022: జింబాబ్వేతో టీమిండియా ‘ఢీ’.. గెలిస్తే గ్రూప్‌ టాపర్‌గా రోహిత్‌ సేన

Published Sun, Nov 6 2022 5:12 AM | Last Updated on Sun, Nov 6 2022 9:44 AM

T20 World Cup 2022: India vs Zimbabwe Last League match on 06 nov 2022 - Sakshi

రోహిత్ శర్మ, శనివారం మెల్‌బోర్న్‌ మైదానంలో తన బర్త్‌డే కేక్‌ కట్‌ చేస్తున్న కోహ్లి

సరిగ్గా రెండు వారాల క్రితం మెల్‌బోర్న్‌ మైదానంలో భారత క్రికెట్‌ జట్టు ఒక అద్భుత విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్‌పై సాధించిన ఈ గెలుపు అభిమానులందరికీ చిరస్మరణీయ జ్ఞాపకాన్ని అందించింది. ఇప్పుడు అదే వేదికపై లీగ్‌ దశను ముగించేందుకు టీమిండియా మళ్లీ మైదానంలోకి అడుగు పెడుతోంది. బలహీన ప్రత్యర్థిని ఓడించి గ్రూప్‌–1లో మొదటి స్థానంలో నిలవాలని రోహిత్‌ బృందం పట్టుదలతో ఉంది. అయితే స్టార్లు లేకపోయినా జింబాబ్వేను తక్కువగా అంచనా వేస్తే ప్రమాదమే! అలసత్వంతో అనూహ్య ఓటమిని ఎదుర్కొన్న పాకిస్తాన్‌ ఇప్పటికీ టోర్నీలో సెమీస్‌ స్థానం కోసం పోరాడుతోంది. ఈ నేపథ్యంలో మరో ఆదివారం మధ్యాహ్నం అభిమానులకు వినోదం ఖాయం.   

మెల్‌బోర్న్‌: పాకిస్తాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌లపై విజయాలు, దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత భారత జట్టు టి20 వరల్డ్‌కప్‌ లీగ్‌ దశలో తమ చివరి పోరుకు సిద్ధమైంది. నేడు జరిగే పోరులో జింబాబ్వేతో భారత్‌ తలపడుతుంది. అధికారికంగా భారత్‌కు ఇంకా సెమీస్‌ స్థానం ఖరారు కాలేదు కానీ ఈ మ్యాచ్‌లో గెలిస్తే గ్రూప్‌ టాపర్‌గా భారత్‌ సెమీస్‌ చేరుతుంది. అదే జరిగితే ఈ నెల 10న అడిలైడ్‌లో ఇంగ్లండ్‌తో రెండో సెమీఫైనల్లో టీమిండియా తలపడుతుంది. టోర్నీ ఆసాంతం స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన జింబాబ్వే మరో సంచలనాన్ని ఆశిస్తోంది. పాక్‌తో మ్యాచ్‌ తరహాలోనే 90 వేలకు పైగా సామర్థ్యం ఉన్న ఎంసీజీలో ఈ పోరు కు కూడా అన్ని టికెట్లూ అమ్ముడవడం విశేషం.  

చహల్‌కు అవకాశం దక్కేనా...
గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై చివర్లో గట్టెక్కినా... తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చు. టాపార్డర్‌ బ్యాటర్ల నుంచి బౌలర్ల వరకు అందరూ సమష్టిగా రాణిస్తున్నారు. ఒక్క వికెట్‌ కీపర్‌ విషయంలోనే కాస్త సందేహాలు అనిపించాయి. బంగ్లాతో పోరులోనే కార్తీక్‌ బదులుగా పంత్‌ ఆడతాడని అనిపించినా, చివరకు అది జరగలేదు. అంటే ఫినిషర్‌గా కార్తీక్‌పైనే జట్టు మేనేజ్‌మెంట్‌ ఎక్కువగా నమ్మకముంచుతోంది. పేసర్లు షమీ, భువనేశ్వర్, అర్‌‡్షదీప్‌ ప్రతీ మ్యాచ్‌లో అంచనాలకు అనుగుణంగా రాణించారు. జింబాబ్వేపై కూడా ఈ ముగ్గురు ప్రభావం చూపగలరు.   

సమష్టిగా రాణిస్తే...
పాకిస్తాన్‌పై విజయంతో ఒకదశలో జింబాబ్వే జట్టులో కూడా సెమీస్‌ ఆశలు రేగాయి. అయితే బంగ్లా, నెదర్లాండ్స్‌ చేతుల్లో పరాజయాలు ఆ జట్టును దెబ్బకొట్టాయి. ఈ రెండుసార్లు బ్యాటింగ్‌ వైఫల్యంతోనే జింబాబ్వే ఓడింది. సికందర్‌ రజా, విలియమ్స్‌పైనే జట్టు బ్యాటింగ్‌ ప్రధానంగా ఆధారపడి ఉంది. మరోవైపు జింబాబ్వే బౌలింగ్‌ కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. పేసర్లు చటారా, ఎన్‌గరవ, ముజరబానిలను జట్టు నమ్ముకుంటోంది. ఈ ముగ్గురూ టోర్నీలో వేర్వేరు దశల్లో చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. పట్టుదలగా బౌలింగ్‌ చేస్తే వీరు భారత బ్యాటింగ్‌ను కొంత వరకు ఇబ్బంది పెట్టగలరేమో చూడాలి.  

పిచ్, వాతావరణం
ఎంసీజీలో ఈ ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లు షెడ్యూల్‌ కాగా, మూడు రద్దయ్యాయి. ఒక మ్యాచ్‌ను కుదించగా, భారత్‌–పాక్‌ మ్యాచ్‌ మాత్రమే పూర్తిగా సాగింది. ఆదివారం వర్ష సూచన లేకపోవడం సానుకూలాంశం. కొత్త పిచ్‌పై పేసర్లు కొంత ప్రభావం చూపగలరు కానీ ఓవరాల్‌గా బ్యాటింగ్‌కే అనుకూలం. 
1: టి20 ప్రపంచకప్‌ చరిత్రలో భారత్, జింబాబ్వే మధ్య ఇదే తొలి మ్యాచ్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement