టీమిండియా సీనియర్ క్రికెటర్ల గురించి మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టును ఐకమత్యంగా ఉంచడంలో వారు పెద్దన్న పాత్ర పోషిస్తారని కొనియాడాడు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మకు కలుపుగోలుతనం ఎక్కువని.. డ్రెస్సింగ్ రూం వాతావరణం ప్రశాంతంగా ఉండటానికి తనే ప్రధాన కారణం అని పేర్కొన్నాడు.
ఇక రోహిత్ శర్మ మాదిరే మిగతా టీమిండియా సూపర్ స్టార్లు సైతం ఎంతో నిరాడంబరంగా ఉంటారని ద్రవిడ్ తెలిపాడు. టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్, కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. వీరిద్దరి హయాంలో భారత జట్టు టీ20 ప్రపంచకప్-2022(సెమీస్), ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్, వన్డే వరల్డ్‌కప్-2023(ఫైనల్) ఆడింది.
అయితే, ఈ ఐసీసీ టోర్నీల్లో విజేతగా నిలవలేకపోయింది. టీ20 ప్రపంచకప్-2024 ద్వారా ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలన్న ద్రవిడ్-రోహిత్ కల నెరవేరింది. అమెరికా- వెస్టిండీస్ వేదికగా సాగిన ఈ టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది. ఫలితంగా కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిశాయి.
ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోచ్‌గా తన పని సులువు కావడానికి జట్టులోని సీనియర్లే కారణమని పేర్కొన్నాడు. ‘‘ఈ విజయానికి క్రెడిట్ నేనొక్కడినే తీసుకోలేను. ఈ జట్టును తీర్చిదిద్దిన కోచ్‌లు, సీనియర్లు, కెప్టెన్లు అందరికీ చెందుతుంది. రోహిత్‌తో కలిసి పని చేయడం నాకు దక్కిన గౌరవం.
ఈ రెండున్నరేళ్లకాలంలో అతడిని దగ్గరిగా గమనించారు. అద్భుతమైన నాయకుడు. జట్టులోని ఆటగాళ్లంతా ఎల్లప్పుడూ అతడి వైపే ఉంటారు. అంతలా వారి అభిమానం చూరగొన్నాడు. చాలా మంది.. భారత క్రికెట్ సూపర్‌స్టార్లు ఇగో కలిగి ఉంటారని అనుకుంటారు. వారిని మేనేజ్ చేయడం కోచ్‌లకు కష్టం అనుకుంటారు.
అయితే, ఇక్కడ అంతా రివర్స్ ఉంటుంది. సూపర్‌స్టార్లు అయినప్పటికీ వాళ్లెంతో నిరాడంబరంగా ఉంటారు. పూర్తిస్థాయిలో మ్యాచ్‌లకు సన్నద్ధమవుతారు. అందుకే వాళ్లు ఈరోజు సూపర్‌స్టార్లుగా క్రేజ్ సంపాదించారు. జట్టును ఒక్కటిగా ఉంచడంలో వారిదే కీలక పాత్ర. విరాట్ కోహ్లి, బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్.. వీళ్లంతా డ్రెసింగ్ రూంలో సానుకూల వాతావరణం ఉండేలా చూస్తారు’’ అని రాహుల్ ద్రవిడ్ స్టార్ స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment