సత్తా చాటిన శుభ్‌మన్‌, సుందర్‌.. మూడో టీ20లో టీమిండియా గెలుపు | Team India Beat Zimbabwe By 23 Runs In 3rd T20 Of Five Match Series | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన శుభ్‌మన్‌, సుందర్‌.. మూడో టీ20లో టీమిండియా గెలుపు

Published Wed, Jul 10 2024 8:09 PM | Last Updated on Thu, Jul 11 2024 2:53 PM

Team India Beat Zimbabwe By 23 Runs In 3rd T20 Of Five Match Series

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (జులై 10) జరిగిన మూడో టీ20 టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. శుభ్‌మన్‌ గిల్‌ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్‌(27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రెండో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అభిషేక్‌ శర్మ ఈ మ్యాచ్‌లో 10 పరుగులకే ఔటయ్యాడు. 

సంజూ శాంసన్‌ (12), రింకూ సింగ్‌ (1) అజేయంగా నిలిచారు. శుభ్‌మన్‌ గిల్‌ ఆరు ఇన్నింగ్స్‌ల తర్వాత టీ20ల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్‌ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. 39 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఘోర ఓటమి దిశగా సాగింది. అయితే డియాన్‌ మైర్స్‌ (65 నాటౌట్‌), మదండే (37) జింబాబ్వేను దారుణ పరాభవం బారిన పడకుండా తప్పించారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. ఓ దశలో (మైర్స్‌, మదండే క్రీజ్‌లో ఉండగా) జింబాబ్వే టీమిండియాకు షాకిచ్చేలా కనిపించింది. 

అయితే ఇన్నింగ్స్‌ ఆఖర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ (4-0-15-3), ఆవేశ్‌ ఖాన్‌ (4-0-39-2), ఖలీల్‌ అహ్మద్‌ (4-0-15-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టీ20 జులై 13న జరుగనుంది. కాగా, తొలి మ్యాచ్‌లో జింబాబ్వే, రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement