టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఇంకా బోణీ కొట్టలేదు. తాను ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. ఇప్పటికే ఐదుసార్లు విజేతగా నిలిపిన రోహిత్ శర్మ ఈసారి ముంబై ఇండియన్స్‌ను మరోసారి విజేతగా నిలుపుతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయం పక్కనబెడితే.. రోహిత్ శర్మను టీమిండియా మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ ఇంటర్య్వూ చేసింది. కాగా ఇటీవలే ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్ 2022కు జెమిమా రోడ్రిగ్స్ టీమిండియా జట్టుకు ఎంపిక కాలేదు. తాను కచ్చితంగా జట్టులో ఉంటానని భావించిన రోడ్రిగ్స్‌కు భంగపాటే ఎదురైంది.
''నేను మహిళల వన్డే వరల్డ్‌కప్‌కు ఎంపిక కాలేదు. అది నన్ను బాధించింది. కానీ ఆ బాధ నాకంటే ముందు మీరు అనుభవించారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి?'' అని రోడ్రిగ్స్ ప్రశ్నించింది. దీనిపై రోహిత్ స్పందిస్తూ.. ''సరిగ్గా 11 ఏళ్ల క్రితం నాకు ఇలాగే జరిగింది. 2011 వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక కాలేదు. ఆ సమయంలో నేను దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నా. విషయం తెలియగానే నిరాశలో కూరుకుపోయాను. డ్రెస్సింగ్‌రూమ్‌లో ఒంటరిగా ఉన్న నేను ఎవరితో ఈ విషయాన్ని షేర్ చేసుకోలేకపోయాను. కానీ అప్పుడు నా వయసు 23.. 24 ఏళ్లే అనుకుంటా. మంచి భవిష్యత్తు ముందున్న తరుణంలో ఇలా బాధపడితే ప్రయోజనం లేదని అనుకున్నా. వెంటనే 2015 వన్డే వరల్డ్‌కప్ సన్నాహకాలకు సిద్దమయ్యా.'' అంటూ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment