టి20 ప్రపంచకప్‌లో టీమిండియా వైఫల్యం అనంతరం యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిన బీసీసీఐ కన్ను మొదట సెలెక్షన్ కమిటీ మీదనే పడింది. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీని శుక్రవారం తొలగించిన బీసీసీఐ కొత్త సెలెక్టర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. టి20 ప్రపంచకప్‌లో జట్టును ఎంపిక చేసిన చేతన్ శర్మ బృందాన్ని తప్పించడం బాగానే ఉన్నప్పటికి.. కెప్టెన్‌గా విఫలమైన రోహిత్ శర్మను ఎప్పుడు తొలగిస్తారంటూ టీమిండియా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
సెలెక్టర్లు జట్టును ఎంపిక చేసి ఉండొచ్చు.. కానీ తుది జట్టు నిర్ణయం మాత్రం కెప్టెన్, హెడ్‌కోచ్‌లపైనే ఆధారపడి ఉంటుంది. మరి అప్పుడు రోహిత్ శర్మను కూడా కెప్టెన్సీ నుంచి తప్పించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఇక ప్రస్తుత కమిటీలో ఛైర్మన్‌గా చేతన్ శర్మ ఉండగా.. సునీల్ జోషి(సౌత్ జోన్), హర్విందర్ సింగ్(సెంట్రల్ జోన్), దెబాషిశ్ మొహంతి(ఈస్ట్ జోన్) లు ఉన్నారు. గత నెలలోనే కొత్త సెలక్షన్ కమిటీని నియమించనున్నట్లు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా వెల్లడించారు.
టి20 ప్రపంచకప్‌లో మొదటి నుంచి టీమిండియా ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. ఏదో కోహ్లి, సూర్యకుమార్‌లు మంచి ఫామ్‌తో ఆడారు కాబట్టి టీమిండియా కనీసం సెమీఫైనల్ వరకు రాగలిగింది. ఇక జట్టులో బౌలర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. ఇక కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. కోహ్లి అనంతరం మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ అంతగా రాణించలేకపోతున్నాడు. ఆసియా కప్‌లో ఓటమి.. తాజాగా టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోనే వెనుదిరగడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.
అయితే రోహిత్ బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా కాలేదని.. మరి కొంతకాలం అతన్ని కెప్టెన్‌గా ఉంచితే టీమిండియాకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కొంతమంది పేర్కొన్నారు. ఇక న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియాలో సీనియర్ ఆటగాళ్లు ఎవరు లేరు. రోహిత్, కోహ్లి సహా చాలా మంది ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. ఈ విషయంలోనూ అభిమానులు గుర్రుగా ఉన్నారు.
టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోనే వెనుదిరిగిన న్యూజిలాండ్ జట్టు పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగుతుంటే.. టీమిండియా మాత్రం సీనియర్లకు రెస్ట్ పేరుతో పక్కనబెట్టి యువజట్టును పంపించింది. పొట్టి ప్రపంచకప్‌లో నాసిరకం ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు రెస్ట్ ఎందుకంటూ ఏకిపారేశారు. కివీస్ పూర్తి జట్టుతో ఆడుతుంటే.. మనోళ్లు కూడా అలాగే ఆడాలి. రెస్ట్ పేరుతో ఆటగాళ్లను మరింత బద్దకంగా తయారు చేస్తున్నారు. ఇప్పటికే కివీస్‌తో టి20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేశారు. చూస్తుంటే అన్ని ఫార్మాట్లలోనూ అతనే కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయని అభిమానులు పేర్కొన్నారు.
చదవండి: సెలక్షన్ కమిటీ రద్దు.. కొత్త సెలక్టర్ల కోసం బీసీసీఐ ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment