రెండో వన్డేలో 32పరుగులతో ఓడిన టీమిండియా
6 వికెట్లతో మెరిసిన శ్రీలంక స్పిన్నర్ వాండెర్సే
రోహిత్ శర్మ మెరుపులు వృథా
కొలంబో: భారత్ ముందున్న లక్ష్యం 241. రోహిత్ శర్మ మెరుపులతో 13.2 ఓవర్లలోనే భారత్ (97/0) వందకు చేరువైంది. ఈ స్కోరు చూసిన వారెవరికైనా భారత్ గెలుపు సులువే అనిపిస్తుంది. కానీ ‘హిట్‌మ్యాన్’ అవుటవడంతోనే భారత్ మెడకు లంక స్పిన్ ఉచ్చు బిగించింది. అంతే 208 పరుగులకే భారత్ కుప్పకూలింది. దీంతో తొలి వన్డేను ‘టై’ చేసుకున్న ఆతిథ్య శ్రీలంక రెండో వన్డేలో 32 పరుగులతో విజయం సాధించింది.
టి20ల్లో క్లీన్‌స్వీప్ అయిన లంక వన్డేల్లో 1–0తో ఇక సిరీస్ కోల్పోలేని స్థితిలో నిలిచింది. మొదట శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో (62 బంతుల్లో 40; 5 ఫోర్లు), కమిండు మెండిస్ (44 బంతుల్లో 40; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. వాషింగ్టన్ సుందర్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం టీమిండియా 42.2 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ (44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (44 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లెగ్ స్పిన్నర్ జెఫ్రే వాండెర్సే (6/33) ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అసలంక 3 వికెట్లు తీశాడు. సిరీస్‌లోని చివరిదైన మూడో వన్డే బుధవారం జరుగుతుంది.
తొలి బంతికే వికెట్...
ఫామ్‌లో ఉన్న ఓపెనర్ నిసాంక (0)ను ఇన్నింగ్స్ తొలి బంతికే భారత బౌలర్ సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. మరో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్ (42 బంతుల్లో 30; 3 ఫోర్లు) కుదురుగా ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే సుందర్ తన వరుస ఓవర్లలో ఫెర్నాండో, కుశాల్‌లను అవుట్ చేయడంతో 74 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. దీంతోపాటు 79 పరుగుల వద్ద మూడు వికెట్లను కోల్పోయింది. తర్వాత కెప్టెన్ చరిత్ అసలంక (42 బంతుల్లో 25; 3 ఫోర్లు), సమరవిక్రమ (14) జట్టు స్కోరును వంద పరుగులు దాటించారు.
అక్షర్ ఈ జోడీని ఎక్కువసేపు నిలువనీయలేదు. సమరవిక్రమను అవుట్ చేయడంతో 111 పరుగుల వద్ద నాలుగో వికెట్ పడింది. కొద్దిసేపటి తర్వాత జనిత్ లియనగే (12)ను కుల్దీప్, అసలంకను సుందర్ అవుట్ చేయడంతో లంక ఒక దశలో 136 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. ఇలాంటి పరిస్థితిలో భారత బౌలర్లు పట్టుబిగించకుండా కమిండు మెండిస్ (44 బంతుల్లో 40; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు.
దునిత్ వెలలగే (35 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో కలిసి కమిండు ఏడో వికెట్‌కు చకచకా 72 పరుగులు జోడించడం లంకను నిలబెట్టింది. దునిత్ అవుటయ్యాక కూడా స్కోరులో వేగం తగ్గకుండా కమిండు, అకిల ధనంజయ (15; 2 ఫోర్లు) పరుగులు సాధించడంతో ఆఖరి 5 ఓవర్లలో శ్రీలంక 44 పరుగులు చేసింది. సిరాజ్, అక్షర్ పటేల్‌లకు చెరో వికెట్ దక్కింది.
రోహిత్ ఉన్నంత వరకే...
ఓపెనర్లు రోహిత్, శుబ్‌మన్ గిల్ (44 బంతుల్లో 35; 3 ఫోర్లు) తొలి వన్డే కంటే మరింత పటిష్టమైన పునాది వేశారు. నాలుగో ఓవర్ నుంచి కెప్టెన్ రోహిత్ దూకుడు పెంచాడు. వెలలగే వేసిన ఆ ఓవర్లో మూడు బౌండరీలు బాదాడు. అసిత ఏడో ఓవర్లో ఫోర్, సిక్సర్ కొట్టాడు. దీంతో జట్టు స్కోరు 50కి చేరింది. తర్వాత ధనంజయ, కమిండు మెండిస్ ఓవర్లలో భారీ సిక్సర్లతో రోహిత్ 29 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు.
10 ఓవర్లలో భారత్ స్కోరు 76/0. వెలలగే వేసిన 13వ ఓవర్లో సిక్స్ కొట్టిన రోహిత్... తర్వాతి వాండెర్సే బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడి నిసాంక చేతికి చిక్కాడు. దీంతో 97 పరుగుల ఓపెనింగ్ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కోహ్లి బౌండరీతో ఆ ఓవర్లోనే జట్టు స్కోరు వంద దాటింది. కానీ కాసేపటికే వాండెర్సే ఒకే ఓవర్లో గిల్, దూబే (0)లను అవుట్ చేశాడు. తన తదుపరి ఓవర్లలో కోహ్లి (14), శ్రేయస్ అయ్యర్ (7) వికెట్లు తీశాడు. దీంతో 133 పరుగులకే భారత్ సగం వికెట్లను కోల్పోయింది.
అక్షర్ ధాటిగా ఆడుతుంటే... ఇంకోవైపు కేఎల్ రాహుల్ (0)ను వాండెర్సే డకౌట్ చేశాడు. అక్షర్, సుందర్ (15) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నప్పటికీ జట్టును ఒడ్డున పడేయలేకపోయారు. వీళ్లిద్దరితో పాటు సిరాజ్‌ను అసలంక పెవిలియన్ చేర్చడంతో 201 పరుగుల వద్దే భారత్ 9వ వికెట్ కోల్పోయింది. అర్‡్షదీప్ (3) రనౌట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) రాహుల్ (బి) సిరాజ్ 0; అవిష్క (సి అండ్ బి) సుందర్ 40; కుశాల్ మెండిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సుందర్ 30; సమరవిక్రమ (సి) కోహ్లి (బి) అక్షర్ 14; అసలంక (సి) అక్షర్ (బి) సుందర్ 25; జనిత్ (సి అండ్ బి) కుల్దీప్ 12; వెలలగే (సి) దూబే (బి) కుల్దీప్ 39; కమిండు (రనౌట్) 40; ధనంజయ (రనౌట్) 15; వాండెర్సే (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 240. వికెట్ల పతనం: 1–0, 2–74, 3–79, 4–111, 5–136, 6–136, 7–208, 8–239, 9–240. బౌలింగ్: సిరాజ్ 8–1–43–1, అర్‡్ష దీప్ 9–0–58–0, అక్షర్ 9–0–38–1, శివమ్ దూబే 2–0–10–0, సుందర్ 10–1–30–3, కుల్దీప్ 10–1–33–2, రోహిత్ 2–0–11–0.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) నిసాంక (బి) వాండెర్సే 64; గిల్ (సి) కమిండు (బి) వాండెర్సే 35; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) వాండెర్సే 14; దూబే (ఎల్బీడబ్ల్యూ) (బి) వాండెర్సే 0; అక్షర్ (సి అండ్ బి) అసలంక 44; అయ్యర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వాండెర్సే 7; రాహుల్ (బి) వాండెర్సే 0; సుందర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అసలంక 15; కుల్దీప్ (నాటౌట్) 7; సిరాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అసలంక 4; అర్‡్షదీప్ (రనౌట్) 3; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (42.2 ఓవర్లలో ఆలౌట్) 208. వికెట్ల పతనం: 1–97, 2–116, 3–116, 4–123, 5–133, 6–147, 7–185, 8–190, 9–201, 10–208. బౌలింగ్: అసిత ఫెర్నాండో 7–0–31–0, వెలలగే 6–0–41–0, ధనంజయ 10–1–54–0, కమిండు మెండిస్ 3–0–19–0, వాండెర్సే 10–0–33–6, అసలంక 6.2–2–20–3.
Comments
Please login to add a commentAdd a comment