
Rahul Dravid- Team India: టీమిండియా ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీమిండియా ఫిజియో నితిన్ పటేల్‌ను జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)కి అటాచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ప్రమోషన్ ఇచ్చి హెడ్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ పదవి ఇవ్వనున్నట్లు వార్తలు వెలువడనున్నాయి.
కాగా టీమిండియా స్టార్ ఆటగాళ్లు దీపక్ చహర్, సూర్యకుమార్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి తదితరులు గాయాల బారిన పడి ఎన్‌సీఏలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. వీరితో పాటు మరికొందరు ప్లేయర్లు కూడా అక్కడే శిక్షణ పొందుతున్నారు. హార్దిక్ పాండ్యా సైతం ఫిట్‌నెస్ సాధించేందుకు శ్రమిస్తున్నాడు.
ఇక ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్, ఆ తదుపరి సంవత్సరం వన్డే ప్రపంచకప్ జరుగనుంది. ఇలా వరుస ఐసీసీ ఈవెంట్ల నేపథ్యంలో ఆటగాళ్లు గాయాలపాలవడం టీమిండియాలో ఆందోళనకు కారణమైంది. ఈ విషయంపై దృష్టి సారించిన హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్.. నితిన్ పటేల్‌ను ఎన్‌సీఏకు పంపాలన్న ఆలోచనను బీసీసీఐతో చర్చించినట్లు క్రిక్‌బజ్ తన కథనంలో పేర్కొంది.
అనువజ్ఞుడైన నితిన్ ఎన్‌సీఏలో ఉంటే జట్టుకు మేలు చేకూరుతుందన్న వాదనతో ఏకీభవించిన బోర్డు.. ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. శ్రీలంకతో బెంగళూరు వేదికగా జరుగనున్న రెండో టెస్టు తర్వాత ఇందుకు సంబంధించి ప్రకటన వెలువరించే అవకాశం ఉందని పేర్కొంది. అంతేగాక ఇటీవల ఫిజియోథెరపిస్ట్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానించిన బోర్డు.. సీనియర్ వుమెన్ టీమ్ కోసం సీనియర్ ఫిజియోథెరపిస్ట్ కోసం అన్వేషణలో పడినట్లు పేర్కొంది.
చదవండి: IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్.. మరో స్టార్ ఆటగాడు దూరం!
Comments
Please login to add a commentAdd a comment