క్రీడాభిమానులకు శుభవార్త! కరోనా విరామం తర్వాత భారత గడ్డపై తొలి అంతర్జాతీయ మ్యాచ్‌కు ఎట్టకేలకు నేడు టాస్ పడుతోంది. ఐపీఎల్‌లో మనోళ్లు మెరిపించినా... టెస్టుల్లో చరిత్ర సృష్టించినా... అవన్నీ విదేశాల్లోనే జరిగాయి. అంతర్జాతీయ క్రికెట్ అంతటా మొదలైనా... మన దేశంలోనే చాలా ఆలస్యంగా షురూ అవుతోంది. అయితే సంప్రదాయ క్రికెట్లో దూసుకెళుతోన్న భారత్ ఆటను ఇప్పటికైతే టీవీల్లోనే చూడాలి. ఎందుకంటే ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించడం లేదు. రెండో టెస్టునైతే మైదానంలో చూడొచ్చు.
చెన్నై: టెస్టు క్రికెట్లోనే చిరస్మరణీయ విజయంతో 2021ను ప్రారంభించిన భారత జట్టు ఇప్పుడు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌పై కన్నేసింది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగే ఈ సిరీస్‌ను గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా కోహ్లి సేన డబ్ల్యూటీసీ ఫైనల్లోకి చేరుతుంది. ఇక పర్యాటక ఇంగ్లండ్‌కూ కివీస్‌తో తలపడే అవకాశమున్నా... అది ఎంతో దూరంలో, మరెంతో కష్టంతో ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ రేసుకు ఇరు జట్ల మధ్య జరిగే నాలుగు టెస్టుల సిరీస్ రసవత్తరంగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో భాగంగా తొలి టెస్టు చెపాక్ మైదానంలో నేటినుంచి (శుక్రవారం) జరగనుంది. భారత్‌లో... బయో బబుల్‌లో జరగనున్న తొలి మ్యాచ్ ఇదే కావడం మరో విశేషం.
కోహ్లి రాకతో...
కోహ్లి లేని కుర్రాళ్ల జట్టు ఆసీస్‌ను ఓ టెస్టులో వణికించింది. మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడించింది. ఇప్పుడు స్టార్ బ్యాట్స్‌మన్, రెగ్యులర్ సారథి విరాట్ కోహ్లి పుత్రికోత్సాహంతో అందుబాటులోకి వచ్చాడు. దీంతో మిడిలార్డర్ అనుభవంతో కూడి, మరింత పటిష్టంగా తయారైంది. ఆసీస్ పర్యటనలో హిట్టయిన శుబ్‌మన్ గిల్... రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. ఎప్పట్లాగే చతేశ్వర్ పుజారా వన్‌డౌన్‌లో ప్రత్యర్థి బౌలింగ్‌ను అడ్డగిస్తాడు. మిడిలార్డర్‌లో రహానే, కోహ్లిలకు ఇప్పుడు మెరుపువీరుడు రిషభ్ పంత్ జతయ్యాడు. ఒకరోజు ముందే వికెట్‌కీపర్‌గా పంత్ తుది జట్టులో ఉంటాడని కోహ్లి స్పష్టం చేయడంతో సాహా బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఇక బౌలింగ్‌లో అనుభవజ్ఞులైన ఇషాంత్ శర్మ, బుమ్రాలు రావడంతో పేస్ దళం రెట్టించిన బలంతో ఉంది. మూడో పేసర్‌కు అవకాశం ఉంటే సిరాజ్ ఆడతాడు. లేదంటే కుల్దీప్ యాదవ్ జట్టులోకి వస్తాడు. రవిచంద్రన్ అశ్విన్‌కు జతగా అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయం.
మ్యాచ్‌తోనే రూట్ శతకం
ఇంగ్లండ్ సారథి జో రూట్ బ్యాట్ పట్టకముందే సెంచరీ కొట్టేయనున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో వందో టెస్టు ఆడేందుకు ఫామ్‌లో ఉన్న రూట్ సిద్ధంగా ఉన్నాడు. లంక గడ్డపై లంకేయుల్ని ఓడించిన రూట్ సేన అక్కడ్నుంచి నేరుగా భారత్‌కు చేరుకుంది. ఆ సిరీస్‌కు గైర్హాజరైన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ జట్టులో చేరడం జట్టు బలాన్ని పెంచింది. మ్యాచ్‌కు ముందు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ క్రాలీ గాయపడటం జట్టుకు ఇబ్బందికరమైనప్పటికీ జట్టు బ్యాటింగ్ భారం మోసే ఆటగాళ్లు చాలామందే అందుబాటులో ఉన్నారు. తుది 11 మందిలో ఏకంగా తొమ్మిదో వరుసదాకా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్నవాళ్లే! స్టోక్స్‌తోపాటు క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్ జట్టుకు నాణ్యమైన ఆల్‌రౌండర్లు. అనుభవజ్ఞుౖడైన పేసర్ బ్రాడ్‌తో జట్టు బౌలింగ్ విభాగం కూడా మెరుగ్గానే ఉంది.
జట్లు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, శుబ్‌మన్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, అక్షర్, కుల్దీప్/సిరాజ్, ఇషాంత్, బుమ్రా.
ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), సిబ్లీ, బర్న్స్, స్టోక్స్, ఓలీ పోప్, బట్లర్, మొయిన్ అలీ, వోక్స్, ఆర్చర్, లీచ్, స్టువర్డ్ బ్రాడ్
పిచ్, వాతావరణం
వాతావరణంతో ఏ సమస్యా లేదు. వర్షం బెడద లేదు. మ్యాచ్ పైనే దృష్టి సారించొచ్చు. కొంత బౌన్స్ ఉన్న పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు కాకుండా పేస్‌కు కూడా అనుకూలిస్తుందని అంచనా. వికెట్‌పై స్వల్పంగా పచ్చిక కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment