భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టులో అద్భుత శతకంతో టీమిండియాను పటిష్ఠ స్థితిలో నిలిపాడు కింగ్ విరాట్ కోహ్లీ. 186 పరుగులు చేసి కెరీర్‌లో 75 శతకం నమోదు చేశాడు. అయితే కోహ్లీ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, మైదానంలో కాస్త ఇబ్బందిపడుతున్నాడని వార్తలొచ్చాయి.
నాలుగో రోజు కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అక్షర్ పటేల్ ఈ విషయంపై స్పందించాడు. కోహ్లీ అనారోగ్యం విషయం గురించి తనకు తెలియదని చెప్పాడు. అయితే అతను ఇబ్బంది పడుతున్నట్లు తనకు అన్పించలేదని, వికెట్ల మధ్య పరుగెడుతున్నప్పుడు ఎలాంటి అసౌకర్యంగా కూడా కన్పించలేదని చెప్పుకొచ్చాడు. ఎండను కూడా తట్టుకుని గంటలపాటు క్రీజులో ఉండి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడని చెప్పుకొచ్చాడు. తనకైతే కోహ్లీ అనారోగ్యంగా ఉన్నట్లు అస్సలు అన్పించలేదని పేర్కొన్నాడు.
ఈ టెస్టు మ్యాచ్ చివరి రోజు కోహ్లీ రోజంతా ఫీల్డింగ్ చేశాడు. దీంతో అతను ఆరోగ్యంగానే ఉన్నట్లు అర్థమైంది. కానీ మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీ ఆరోగ్యం ఎలా ఉందనే ప్రశ్న ఎదురైంది.
దీనికి సమాధానమిస్తూ.. కోహ్లీ కాస్త దగ్గుతున్నాడని రోహిత్ వెల్లడించాడు. కానీ అంతమాత్రానికే అనారోగ్యంగా ఉన్నట్లు కాదు కదా అని బదులిచ్చాడు. కోహ్లీ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు తనకు అన్పించిందని చెప్పుకొచ్చాడు. నాలుగో టెస్టులో టీమిండియా పటిష్ఠ స్థితిలో ఉండటానికి కోహ్లీనే ప్రధాన కారణమని కొనియాడాడు. ఈ మ్యాచ్ డ్రా కావడం వల్లే సిరీస్ మనం కైవసం చేసుకున్నట్లు గుర్తు చేశాడు.
చదవండి: Rahul Dravid: అటొక కన్ను.. ఇటొక కన్ను
Comments
Please login to add a commentAdd a comment