
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆసియాకప్ టీ20 టోర్నీకి మరో 22 రోజుల్లో తెరలేవనుంది. సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్ తొలి మ్యాచ్‌లో అబుదాబి వేదికగా అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.
ఈ ఆసియా జెయింట్స్ పోరు కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆగస్టు 19న ప్రకటించే అవకాశముంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ అనంతరం భారత జట్టుకు ఒక నెల పాటు విరామం లభించింది. వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో టీమిండియా తలపడాల్సిండేది.
కానీ ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో ఈ సిరీస్ తాత్కాలికంగా వాయిదా పడింది. దీంతో భారత ఆటగాళ్లకు లాంగ్ బ్రేక్ దొరికింది. ఈ క్రమంలో టీమిండియా మెనెజ్‌మెంట్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆసియాకప్‌నకు ముందు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు యూఏఈలో ఒక ప్రత్యేక శిబిరాన్ని చేయనుంది. ఇందుకోసం టీమిండియా నాలుగు రోజుల ముందే యూఏఈ గడ్డపై అడుగుపెట్టనుంది. అయితే తొలుత ఆసియాకప్‌కు సిద్దం కావడానికి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఒక క్యాంప్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ సూచించినట్లు సమాచారం.
కానీ టీమ్ మెనెజ్‌మెంట్ మాత్రం యూఏఈ పరిస్థితులు అలవాటు పడేందుకు అక్కడకి వెళ్లి తమ శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అయితే ఈ స్పెషల్ క్యాంపు చాలా మంది భారత ఆటగాళ్లకు ఉపయోగపడనుంది.
ఐపీఎల్-2025 తర్వాత సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లకు మ్యాచ్ ప్రాక్టీస్ లోపించింది. అటువంటి వారు ఈ క్యాంపును సన్నాహాకంగా ఉపయోగించుకోవచ్చు. ఇక దాయాది పాకిస్తాన్ కూడా ఈ మెగా టోర్నీకి తమ సన్నాహాకాలను ప్రారంభించనుంది. అయితే భారత్‌కు భిన్నంగా పాక్ జట్టు అఫ్గాన్-యూఏఈలతో ట్రై సిరీస్ ఆడనుంది.
అంతేకాకుండా మెన్ ఇన్ గ్రీన్ ఐసీసీ ఆకాడమీలో నాలుగు రోజుల పాటు ఒక ప్రత్యేక క్యాంపును నిర్వహించనుంది. ఈ టోర్నీ కోసం పీసీబీ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో స్టార్ ప్లేయర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజంలకు చోటు దక్కలేదు. ఈ ఆసియా జెయింట్స్ పోరులో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా వ్యవహరించనున్నాడు.
చదవండి: వాళ్ళేమి తోపు ఆటగాళ్లు కాదు.. సెలక్టర్లు మంచి పనిచేశారు: పాక్ మాజీ కెప్టెన్