T20 WC: కోహ్లి, రోహిత్‌లను తప్పక ఆడించాలి: టీమిండియా దిగ్గజం | 'Terrific Fielders': Gavaskar Backs Virat Rohit To Play T20 WC 2024 | Sakshi
Sakshi News home page

T20 WC 2024: అద్భుతమైన ఫీల్డర్లు.. కోహ్లి, రోహిత్‌లను ఆడించాలి: టీమిండియా దిగ్గజం

Published Sat, Jan 6 2024 3:06 PM | Last Updated on Sat, Jan 6 2024 3:49 PM

Terrific Fielders: Gavaskar Backs Virat Rohit To Play T20 WC 2024 - Sakshi

టీమిండియా స్టార్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి  అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేయాలని భారత క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ ఆకాంక్షించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వీరిద్దరు సూపర్‌ ఫామ్‌లో ఉన్నారని.. టీ20 ప్రపంచకప్‌ నాటికి జట్టుతో చేరితే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు.

ముఖ్యంగా విరాట్‌ కోహ్లి గత ఏడాదిన్నర కాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడన్న గావస్కర్‌.. వన్డే వరల్డ్‌ప్‌-2023లో అద్భుత ప్రదర్శనతో వింటేజ్‌ కోహ్లిని గుర్తుకుతెచ్చాడన్నాడు. టీ20 ప్రపంచకప్‌లోనూ ఈవిధంగానే రాణించగల సత్తా అతడికి ఉందని అభిప్రాయపడ్డాడు.

కాగా జూన్‌ 4 నుంచి అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా వరల్డ్‌కప్‌-2024 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీమిండియా జూన్‌ 5న తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. మరోవైపు.. ఈ మెగా టోర్నీకి ముందు భారత్‌కు ఇంకా కేవలం మూడు టీ20లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 

స్వదేశంలో జనవరి 11 నుంచి అఫ్గనిస్తాన్‌తో ఇందుకు సంబంధించిన సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి ఈ సిరీస్‌తో తిరిగి టీమిండియా తరఫున టీ20లలో ఎంట్రీ ఇస్తేనే.. వరల్డ్‌కప్‌ ఆడే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు.. గాయాల కారణంగా హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టుకు దూరంగా ఉన్నారు కాబట్టి విరాహిత్‌ ద్వయం పునరాగమనం పక్కా అని విశ్లేషుకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సునిల్‌ గావస్కర్‌ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. కోహ్లి, రోహిత్‌లకు అంతర్జాతీయ టీ20లలో ఇంకా భవిష్యత్తు మిగిలే ఉందన్నాడు.

ఈ మేరకు.. ‘‘గత ఏడాదిన్నర కాలంగా విరాట్‌ కోహ్లి సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. వన్డే వరల్డ్‌కప్‌లో అద్భుతంగా ఆడిన తీరును అందరం చూశాం. కాబట్టి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడికి భవిష్యత్తు ఉందా? లేదా అన్న అంశం మీద చర్చ అనవసరం. 

కోహ్లితో పాటు రోహిత్‌ శర్మ కూడా ఫామ్‌లోనే ఉన్నాడు. ఇప్పటికీ వీరిద్దరు అత్యద్భుతమైన ఫీల్డర్లుగా కొనసాగుతున్నారు. చాలా మంది 35-36 ఏళ్లు వచ్చేసరికి స్లో అయిపోతారు. వీళ్లిద్దరు మాత్రం ఇందుకు మినహాయింపు. ఫీల్డ్‌లో పాదరసంలా కదులుతూ క్యాచ్‌లు అందుకోవడం చూస్తూనే ఉన్నాం’’ అంటూ స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో రోహిత్‌, కోహ్లిల ఆట తీరును ప్రశంసించాడు.

అయితే, కేవలం ఫీల్డింగ్‌లో చురుగ్గా ఉన్నారన్న ఒకే ఒక్క కారణం వల్ల కాకుండా సీనియారిటి, బ్యాటింగ్‌ నైపుణ్యాల ఆధారంగా వారిని ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేస్తే బాగుంటుందని గావస్కర్‌ ఈ సందర్భంగా మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. కాగా వరల్డ్‌కప్‌ కంటే ముందు టీమిండియాతో పాటు పలువురు విదేశీ ఆటగాళ్లకు ఐపీఎల్‌-2024 ద్వారా కావాల్సినంత ప్రాక్టీస్‌ దొరకనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement