‘అప్పుడు నాన్న కూడా నాతోనే ఉన్నారు.. ఇది పునర్జన్మ’ | 'Thank God, My Father Was': Musheer Khan 1st Public Statement After Accident | Sakshi
Sakshi News home page

అప్పుడు నాన్న కూడా నాతోనే ఉన్నారు.. ఇది పునర్జన్మ: ముషీర్‌ ఖాన్‌

Published Mon, Sep 30 2024 12:09 PM | Last Updated on Mon, Sep 30 2024 12:30 PM

'Thank God, My Father Was': Musheer Khan 1st Public Statement After Accident

తన ఆరోగ్యం బాగానే ఉందని భారత యువ క్రికెటర్‌ ముషీర్‌ ఖాన్‌ తెలిపాడు. ఆ దేవుడి ఆశీసుల వల్లే తాను ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడని.. ఆపత్కాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా ఇరానీ కప్-2024లో పాల్గొనేందుకు ఈ ముంబై ఆటగాడు... తండ్రి నౌషాద్‌ ఖాన్‌తో కలిసి కారులో ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 19 ఏళ్ల ముషీర్‌ ఖాన్‌ మెడ భాగంలో గాయాలయ్యాయి.

మా నాన్న కూడా నాతోనే ఉన్నారు
అయితే, వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా వేగంగా కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ముషీర్‌ మాట్లాడుతూ.. ఇది తనకు పునర్జన్మ వంటిదని పేర్కొన్నాడు. ‘నా ఆరోగ్యం మెరుగవ్వాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో మా నాన్న కూడా నాతోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన కూడా బాగానే ఉన్నారు.

ఇది కొత్త జీవితంలాగా భావిస్తున్నా. కష్టకాలంలో అండగా నిలిచిన ముంబై క్రికెట్‌ సంఘం (ఎమ్‌సీఏ), భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని ముషీర్‌  పేర్కొన్నాడు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో వీడియో షేర్‌ చేశాడు. కాగా టీమిండియా క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ్ముడైన ముషీర్‌ ఖాన్‌ దేశవాళీల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇటీవల జరిగిన దులీప్‌ ట్రోఫీ-2024లో ముషీర్‌ భారీ శతకం సాధించాడు.  

రంజీ ట్రోఫీలోని ఆరంభ మ్యాచ్‌లకూ దూరం
ఈ క్రమంలో రంజీ చాంపియన్‌ ముంబైతో రెస్టాఫ్‌ ఇండియా ఆడే ఇరానీ కప్‌-2024 మ్యాచ్‌కు ఎంపికయ్యాడు. అయితే, ఈ రెడ్‌బాల్‌ టోర్నీ మ్యాచ్‌ ఆడేందుకు లక్నోకు వెళ్తుంగా ప్రమాదం జరిగింది. ఈ ఘటన కారణంగా అతడు అక్టోబర్‌ 1 నుంచి లక్నోలో ప్రారంభం కానున్న ఇరానీ కప్‌ మ్యాచ్‌తో పాటు... ఆ తర్వాత జరగనున్న ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలోని ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకొని ముషీర్‌ తిరిగి మైదానంలో అడుగు పెట్టేందుకు సుమారు మూడు నెలల సమయం పట్టే అవకాశాలున్నాయి. 

చదవండి: పూరన్‌ సుడిగాలి శతకం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement