వాళ్లకు రిషభ్‌ పంత్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. ఇకపై | 'I Think It Is Time For': Pant's Blunt Warning To DC Stars After Humiliation Against KKR | Sakshi
Sakshi News home page

IPL 2024: వాళ్లకు రిషభ్‌ పంత్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. ఇకపై

Published Thu, Apr 4 2024 10:26 AM | Last Updated on Thu, Apr 4 2024 4:10 PM

Think It Is Time For: Pant Blunt Warning To DC Stars After Humiliation Against KKR - Sakshi

రిషభ్‌ పంత్‌ (PC: BCCI)

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చేతిలో ఘోర పరాజయంపై ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ స్పందించాడు. సమిష్టి వైఫల్యం కారణంగా భారీ మూల్యం చెల్లించామని పేర్కొన్నాడు. ఒక్కోసారి బౌలర్లకు ఏదీ కలిసిరాదని.. తమ జట్టు విషయంలో ఈరోజు(బుధవారం) ఇలా జరిగిందని పంత్‌ విచారం వ్యక్తం చేశాడు.

ఇక కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నామని.. అయితే, ప్రణాళికలను పక్కాగా అమలు చేయలేకపోయామని రిషభ్‌ పంత్‌ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ నాలుగో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడింది.

కేకేఆర్‌ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా
విశాఖపట్నంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేసిన ఢిల్లీకి కేకేఆర్‌ బ్యాటర్లు చుక్కలు చూపించారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సునిల్‌ నరైన్‌(39 బంతుల్లో 85), అంగ్‌క్రిష్‌ రఘువంశీ(27 బంతుల్లో 54), ఆండ్రీ రసెల్‌(19 బంతుల్లో 41) పరుగుల వరద పారించారు. 

ధారాళంగా పరుగులు ఇచ్చుకున్న ఢిల్లీ బౌలర్లు
వీరి అద్భుత ఇన్నింగ్స్‌ కారణంగా కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో రెండో భారీ స్కోరు నమోదు చేసింది. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్‌ నోర్జే 3 వికెట్లు తీసినా.. ఏకంగా 59 పరుగులు సమర్పించుకున్నాడు. ఇషాంత్‌ శర్మ మూడు ఓవర్ల బౌలింగ్‌లో 43 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీయగలిగాడు.

చేతులెత్తేసిన టాపార్డర్‌
మిగతా వాళ్లలో ఖలీల్‌ అహ్మద్‌(1/43), మిచెల్‌ మార్ష్‌(1/37) ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. ఇక భారీ లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే ఢిల్లీ తడబడింది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌(18), పృథ్వీ షా(10) పూర్తిగా నిరాశపరిచారు.

మిచెల్‌ మార్ష్‌, అభిషేక్‌ పోరెల్‌ కనీసం పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించారు. ఈ క్రమంలో పంత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌(25 బంతుల్లో 55)తో చెలరేగగా.. ట్రిస్టన్‌ స్టబ్స్‌(32 బంతుల్లో 54) మెరుపులు మెరిపించాడు.

అయితే, మిగతా బ్యాటర్ల నుంచి వీరికి సహకారం అందకపోవడంతో 17.2వ ఓవర్లోనే ఢిల్లీ క్యాపిటల్స్‌ కథ ముగిసింది.  166 పరుగుల వద్ద ఆలౌట్‌ అయి పంత్‌ సేన ఏకంగా 106 పరుగుల భారీ తేడాతో పరాజయం చవిచూసింది. సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడో ఓటమి నమోదు చేసింది.

ఆటగాళ్లకు పంత్‌ వార్నింగ్‌
ఈ నేపథ్యంలో రిషభ్‌ పంత్‌ మాట్లాడుతూ.. కేకేఆర్‌తో మ్యాచ్లో స్పిన్నర్లతో బౌలింగ్‌ చేయొద్దని భావించామని.. అయితే, పేసర్లు భారీగా పరుగులు ఇవ్వడం ప్రతికూల ప్రభావం చూపిందన్నాడు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నాడు. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి ఇది వర్తిస్తుందంటూ గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చాడు కెప్టెన్‌ సాబ్‌. 

ఇక తాను ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా ఉన్నానన్న రిషభ్‌ పంత్‌.. ఆటను ఆస్వాదిస్తున్నానని చెప్పుకొచ్చాడు. సవాళ్లు తనకేమీ కొత్త కాదని.. విజయవంతంగా వాటిని దాటుకుని ముందుకు వెళ్తానని ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ తదుపరి ఆదివారం ముంబై ఇండియన్స్‌తో వాంఖడేలో తలపడనుంది.

చదవండి: IPL 2024: పంత్‌కు రూ. 24 లక్షల జరిమానా.. ఈసారి జట్టుకు కూడా
తొలి ఇన్నింగ్స్‌లోనే పరుగుల విధ్వంసం.. ఎవరీ అంగ్‌క్రిష్‌ రఘువంశీ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement