ఎంతో మంది హేమాహేమీలున్న భారత్ క్రికెట్ జట్టులో చోటు సంపాదించడం చాలా కష్టం. అదీ మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి అగ్రశ్రేణి బ్యాటర్లతో విపరీతమైన పోటీ ఉంటుంది. ఇలాంటి మిడిలార్డర్‌లో నిలదొక్కుకొని రాణించాలంటే ఎంతో నైపుణ్యంతో పాటు పరిణితి ఉండాలి.
పరిస్థితుల తగిన విధంగా తన ఆటతీరు ను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ జట్టుని ఆదుకోవాలి. ఇలాంటి లక్షణాలు పుష్కలంగా ఉన్న బ్యాటన్ హైదరాబాద్ కి చెందిన 22 ఏళ్ళ తిలక్ వర్మ. అనతి కాలంలోనే జట్టులో నిలకడ గల బ్యాటర్ గా తిలక్ వర్మ పేరు గడిస్తున్నాడు.
తిలక్ వర్మకు కేవలం 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ అతని ఆటని పరిశీలించి త్వరలోనే భారత్ జట్టులో అన్ని ఫార్మాట్లలో రాణించగల సత్తా ఉన్న బ్యాటర్ అని అంచనా వేసాడు. అదే ఇప్పుడు నిజమవుతోంది. తిలక్ టెక్నిక్, ఆటతీరు, అతని షాట్ మేకింగ్ సామర్థ్యం గురుంచి రోహిత్ ముందే ఊహించి చెప్పడం గమనార్హం.
బయాష్ ముందుచూపు
తిలక్ వర్మ చిన్నప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తండ్రి వద్ద ప్రైవేట్ కోచింగ్ కి పంపేందుకు సరైన వనరులు లేనప్పుడు వర్మని అతని కోచ్ సలాం బయాష్ ఆదుకున్నాడు. అతనికి ఫీజులు, క్రీడా సామాగ్రి అందించి వర్మ క్రికెట్‌కు దూరమవ్వకుండా చూసుకున్నాడు.
బయాష్ ముందుచూపు ఇప్పుడు సత్ఫలితాలిస్తోంది. వర్మ 2018-19లో హైదరాబాద్ తరపున ఫస్ట్ క్లాస్ లో అరంగేట్రం చేశాడు. ఒక సంవత్సరం తర్వాత దక్షిణాఫ్రికాలో జరిగే 2020 అండర్-19 ప్రపంచ కప్‌కు ఎంపికయ్యాడు. ఆ టోర్నీలో అతను ఆరు మ్యాచ్‌లు ఆడి మూడు ఇన్నింగ్స్‌లలో 86 పరుగులు చే సి, భారత్ ఫైనల్‌కు చేరుకునేందుకు దోహదపడ్డాడు.
ఐపీఎల్ అనుభవం
ఆలా తన నైపుణ్యాన్ని నిరూపించుకున్న వర్మ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ వంటి ప్రముఖ జట్టుకి ఎంపిక కావడం బాగా కలిసి వచ్చింది. శనివారం చెన్నైలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ తన మ్యాచ్ విన్నింగ్ స్కోర్ తో చరిత్ర సృష్టించాడు. తిలక్ కేవలం 55 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచి తన జట్టును విజయపథంలో నడిపించాడు.
ఈ ఇన్నింగ్స్‌తో, తిలక్ టీ20ల్లో అవుట్ కాకుండా 300 పైగా పరుగులు చేసి రికార్డ్ సృష్టించాడు. భారత్ తరుఫున గత నాలుగు ఇన్నింగ్స్‌లలో తిలక్ దక్షిణాఫ్రికాపై 107 (56 బంతుల్లో), దక్షిణాఫ్రికాపై 47 బంతుల్లో 120, ఇంగ్లాండ్‌పై 19, నాటౌట్‌గా 72 పరుగులు చేశాడు. అంతకుముందు, ఈ రికార్డు న్యూజిలాండ్‌కు చెందిన మార్క్ చాప్‌మన్ పేరిట ఉండేది. చాప్‌మన్ టీ20 క్రికెట్‌లో అజేయంగా నిల్చి 271 పరుగులు చేశాడు.
తిలక్ వర్మ బాధ్యతాయుత బ్యాటింగ్ పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. భారత్ జట్టు ఒక వైపు వికెట్లు కోల్పోతున్నా తిలక్ ఒత్తిడికి గురికాకుండా రాణించడం విశేషం. "తిలక్ బ్యాటింగ్ చేసిన విధానం చాలా సంతోషం కలిగించింది. అతనిలాంటి వ్యక్తి బాధ్యతాయుతంగా ఆడుతుంటే ఇతర బ్యాటర్ల పై ఒత్తిడి తగ్గుతుందనడంలో సందేహం లేదని సూర్యకుమార్ మ్యాచ్ తర్వాత జరిగిన ప్రజెంటేషన్‌లో వ్యాఖ్యానించాడు.
పాక్ మాజీ ఆటగాడి ప్రశంసలు
తిలక్ ని పాకిస్తాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ కూడా ప్రశంసించడం విశేషం. గతంలో ఒకసారి భారత్ భవిష్యత్ బ్యాటర్ గురుంచి అడిగినప్పుడు భారత్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ తిలక్ వర్మ పేరు చెప్పాడని బాసిత్ గుర్తుచేసుకున్నాడు.
"నేను మొహమ్మద్ అజారుద్దీన్‌ను ఇంటర్వ్యూ చేసినప్పుడు, 'తిలక్ వర్మ ఆటతీరు చూసారా అని అడిగాడు. అతను అప్పటికి చాలా చిన్నవాడు. ఐపిఎల్‌లో మాత్రమే ఆడుతునున్నాడు. నాడు అజారుద్దీన్ చెప్పింది నేడు నిజమైంది, అని బాసిత్ గుర్తు చేసుకున్నాడు. చిన్న తనంలోనే ఎంతో పరిణతిని కనబరుస్తున్న తిలక్ వర్మ భవిష్యత్ లో భారత్ జట్టు తరుఫున అన్ని ఫార్మాట్లలో రాణిస్తాడని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment