దక్కన్ చార్జర్స్‌కు ఆడిన రోహిత్ (PC: BCCI)
IPL - Rohit Sharma: ‘‘2009లో.. తొలిసారి తన బ్యాటింగ్ పవరేంటో చూశాను. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిచే సత్తా కలవాడు. తనతో కలిసి బ్యాటింగ్ చేస్తున్నపుడు నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. తన నిలకడైన ఆటకు గల కారణం గురించి వివరిస్తూ.. మనం బరిలోకి దిగిన ప్రతిసారీ ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌లా ఆలోచించాలని చెప్పేవాడు.
2010 తర్వాత తను దక్కన్ చార్జర్స్ కెప్టెన్ కావాలని భావించాడు. నిజానికి 2010 తర్వాత వేలం జరగాల్సి ఉన్న సమయంలో ఫ్రాంఛైజీ అతడిని కెప్టెన్ చేస్తామని మాట కూడా ఇచ్చింది. కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు.
ఆ ఏడాది ఫ్రాంఛైజీ అందరు ఆటగాళ్లను వదిలేసింది. అప్పుడే మాకు ఫ్రాంఛైజీకి సంబంధించిన అన్ని విషయాలు తెలిశాయి. తర్వాత రోహిత్, నేను, సైమండ్స్.. మేమంతా ముంబై ఇండియన్స్‌కు వచ్చేశాం’’ అని హైదరాబాద్ మాజీ బ్యాటర్ తిరుమలశెట్టి సుమన్ అన్నాడు.
చార్జర్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర
రోహిత్ శర్మ దక్కన్ చార్జర్స్ కెప్టెన్ కావాలని బలంగా కోరుకున్నాడని.. కానీ అలా జరుగలేదని పేర్కొన్నాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభ సీజన్(2008) నుంచి 2010 వరకు రోహిత్ వర్మ దక్కన్ చార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఆడం గిల్‌క్రిస్ట్ సారథ్యంలో 2009లో ట్రోఫీ గెలిచిన చార్జర్స్ జట్టులో రోహిత్ సభ్యుడు కూడా!
2009లో చివరగా చార్జర్స్‌కు ఆడిన రోహిత్.. ఆ సీజన్‌లో 362 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలో జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన రోహిత్‌కు కెప్టెన్ కావాలన్న కోరిక ఉండేదట. అయితే, ఆ కల తీరకుండానే హిట్‌మ్యాన్ జట్టును వీడటం.. ఆ ఫ్రాంఛైజీ కనుమరుగైపోవడం జరిగింది.
ముంబై సారథిగా సూపర్‌హిట్
ఈ క్రమంలో 2011లో ముంబై ఇండియన్స్ రోహిత్‌ను కొనుగోలు చేసింది. అతడిలోని నాయకత్వ లక్షణాలను గుర్తించి 2013లో జట్టు పగ్గాలు అప్పజెప్పింది. ఇక తర్వాత జరిగిన పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన సీజన్‌లోనే ముంబైని చాంపియన్‌గా నిలిపిన రోహిత్.. ఏకంగా ఐదుసార్లు టైటిల్ గెలిచిన కెప్టెన్‌గా నిలిచాడు. ఆదివారం(ఏప్రిల్ 30) పుట్టినరోజు జరుపుకొంటున్న రోహిత్..ఈ ఏడాదితో ముంబై కెప్టెన్‌గా పది వసంతాలు పూర్తి చేసుకున్నాడు కూడా!
గిల్లీకి సలహాలు ఇచ్చేవాడు
ఈ నేపథ్యంలో దక్కన్ చార్జర్స్ మాజీ ప్లేయర్, గతంలో రోహిత్‌తో కలిసి ఆడిన తిరుమలశెట్టి సుమన్ ఇండియా టుడేతో ముచ్చటిస్తూ.. ఈ మేరకు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. రోహిత్ తనను తాను సారథిగా భావించే వాడని, గిల్లీ(గిల్‌క్రిస్ట్)కి కూడా సలహాలు ఇచ్చేవాడని పేర్కొన్నాడు. మొదటి నుంచే తను కెప్టెన్ మెటీరియల్ అని.. సారథిగా తనను తాను ఇప్పటికే నిరూపించుకున్నాడని రోహిత్‌ను ప్రశంసించాడు.
వందకు వంద మార్కులు వేస్తా
‘‘ఈ ఏడాది రోహిత్‌కు మరింత ప్రత్యేకం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్ కూడా ఆడాల్సి ఉంది. సారథిగా తన కెరీర్‌లో ఇవి అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నీలు. కెప్టెన్‌గా రోహిత్ స్టామినా ఏంటో అందరికీ తెలుసు.
ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. నేనేతే కెప్టెన్‌గా రోహిత్‌కు వందకు వంద మార్కులు వేస్తాను’’ అని తిరుమలశెట్టి సుమన్.. హిట్‌మ్యాన్‌ను ఆకాశానికెత్తాడు. కాగా రోహిత్ ప్రస్తుతం ఐపీఎల్-2023 సీజన్‌తో బిజీగా ఉన్నాడు.
చదవండి: ముంబై ఇండియన్స్‌లోకి ఇంగ్లండ్ స్టార్ బౌలర్.. ఎవరంటే?
IPL 2023: కోహ్లిలానే శుభ్‌మన్ గిల్.. గణాంకాలు అదే చెబుతున్నాయి..!
Comments
Please login to add a commentAdd a comment