అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య సమరం చివరి ఘట్టానికి చేరింది. టెస్టు సిరీస్‌ను గెలుచుకొని భారత్ ఆధిక్యం ప్రదర్శించగా, ఒక విజయంతో ఆసీస్ కూడా సంతృప్తిగా ముగించింది. ఇప్పుడు వన్డేల్లో ఇరు జట్లు సమంగా నిలిచిన స్థితిలో సిరీస్ విజేతను తేల్చే ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. విశాఖలో ఎదురైన ఘోర పరాజయానికి బదులు తీర్చుకుంటూ ఘనంగా ముగించాలని టీమిండియా భావిస్తుండగా... భారత్‌లో సిరీస్ సాధించే అరుదైన అవకాశాన్ని వదులుకోరాదని కంగారూలు పట్టుదలగా ఉన్నారు. ఇరు జట్లుసమ ఉజ్జీలుగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆసక్తికర పోరుకు చెన్నై వేదిక కానుంది.
చెన్నై: ఆ్రస్టేలియాతో తొలి వన్డేలో ఎంతో శ్రమించి నెగ్గిన భారత రెండో వన్డేలో పూర్తిగా చేతులెత్తేసింది. టెస్టు సిరీస్ ఫలితం ఎలా ఉన్నా మన వన్డే టీమ్ బలహీనతలను గత మ్యాచ్ చూపించింది. వరల్డ్ కప్ ఏడాదిలో ఆస్ట్రేలియాలాంటి పటిష్టమైన జట్టు ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుందనేది మనకు తాజా ఫలితం చూపించింది.
ఈ నేపథ్యంలో ఆసీస్‌ను ఓడించి సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవడం భారత జట్టు తక్షణ లక్ష్యం. అయితే గత మ్యాచ్ ఇచ్చి న ఉత్సాహంతో స్మిత్ సేన కూడా సిరీస్ గెలుపుపై దృష్టి పెట్టింది. ఇలాంటి స్థితిలో భారత్, ఆసీస్ నేడు జరిగే చివరి వన్డేలో తలపడబోతున్నాయి.
సుందర్‌కు చాన్స్!
‘సూర్యకుమార్‌కు మేం కనీసం 7–10 వన్డేల్లో అవకాశం కల్పిస్తాం’ వరుసగా రెండు మ్యాచ్‌లలో తొలి బంతికే అవుటైన తర్వాత కూడా కెప్టెన్ రోహిత్ చేసిన వ్యాఖ్య ఇది. దీనిని బట్టి చూస్తే భారత బ్యాటింగ్‌కు సంబంధించి టీమ్‌లో మార్పులు ఉండకపోవచ్చు. ఈ బ్యాటింగ్ బలగంతోనే విజయాన్ని అందుకోవాలని రోహిత్ పట్టుదలగా ఉన్నాడు.
అయితే వైజాగ్‌లో స్టార్క్ బౌలింగ్‌ను చూస్తే టాప్–5 బ్యాటర్లు చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. స్వయంగా రోహిత్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉండగా, గిల్ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. కోహ్లి కూడా సత్తా చాటితేనే భారత్ విజయవంపై ఆశలు పెంచుకోవచ్చు. బౌలింగ్ విషయంలో భారత్ ముందు ఇతర ప్రత్యామ్నాయాలేవీ లేవు కాబట్టి పేసర్లుగా షమీ, సిరాజ్ ఖాయం.
పాండ్యా ఆల్‌రౌండర్‌గా తన పాత్ర నెరవేర్చగలడు. అక్షర్, జడేజాలాంటి స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లుకు తోడు గా మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు ఈ మ్యాచ్‌లో చోటు దక్కవచ్చు. పెద్దగా ఆకట్టుకోని కుల్దీప్ యాదవ్ స్థానంలో సుందర్ తన సొంతగడ్డపై తొలి మ్యాచ్ ఆడే అవకాశాలున్నాయి.
వార్నర్ సిద్ధం...
మరోవైపు సిరీస్ గెలిచే అవకాశాన్ని కోల్పోరాదని భావిస్తున్న ఆ్రస్టేలియా దానికి తగిన వ్యూహరచన చేస్తోంది. స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో ఒక పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అబాట్‌ను తప్పించి అతని స్థానంలో మ్యాక్స్‌వెల్‌ను ఆడించనుంది.
దూకుడైన బ్యాటర్ వార్నర్ గాయం నుంచి కోలుకోవడం జట్టు బలం పెంచింది. టెస్టుల్లో వార్నర్ విఫలమైనా... పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతను ఇప్పటికీ స్టార్ బ్యాటరే. మార్ష్ , హెడ్ విజయవంతమైన ఓపెనింగ్ జోడీనే అయినా వార్మర్ ఆడితే మార్ష్ మిడిలార్డర్‌కు మారతాడు.
స్టొయినిస్, గ్రీన్‌లాంటి ఆల్‌రౌండర్లతో ఆసీస్ పటిష్టంగా ఉంది. అన్నింటికి మించి స్టార్క్ సూపర్ ఫామ్ జట్టును ముందంజలో నిలుపుతోంది. రెండు మ్యాచ్‌ల లోనూ అతను భారత బ్యా టర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. ఇదే ఒత్తిడిని స్టార్క్ కొనసాగించాలని ఆసీస్ కోరుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment