
రోహిత్ మెరుపు ప్రదర్శనలు... కోహ్లి అద్భుత బ్యాటింగ్ విన్యాసాలు... శ్రేయస్, రాహుల్ దూకుడు... షమీ వికెట్ల వరద... జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శన... గత పది మ్యాచ్‌లలో ఇవన్నీ అభిమానుల మనసుల్లో ముద్రించుకుపోయాయి... ఇప్పుడు మరొక్కసారి ఇలాంటి ఆట కావాలి... టోర్నీ ఆసాంతం చూపించిన ఎదురులేని ప్రదర్శనను ఇంకోసారి చూపించి మరెప్పటికీ మరచిపోలేని చిరస్మరణీయ జ్ఞాపకంగా మిగల్చాలి.
ఏకంగా పది విజయాలు... ప్రపంచకప్ లీగ్ దశలో తొమ్మిది మంది ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యం... సెమీఫైనల్లోనూ అదే జోరు... ఇంత అసాధారణ ఆటతో టీమిండియా ఫైనల్ చేరుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ రోహిత్ శర్మ బృందం దానిని చేసి చూపించింది. ఒక్క ఓటమి లేకపోవడమే కాదు...అసలు లోపమే లేని దుర్బేధ్యమైన ఈ జట్టు విశ్వ విజేతగా నిలవాలి.
ఒకరు, ఇద్దరో కాదు... భారత జట్టులో ఒకరికి తీసిపోని విధంగా మరొకరి ప్రదర్శన కొనసాగింది. ఏ ఒక్క ఆటగాడిపైనో ఆధార పడకుండా సమష్టితత్వంతో జట్టు విజయాలు అందుకుంది... అదే ఇప్పుడు జట్టు బలం... ఎవరూ విఫలమైనా నేనున్నానంటూ జట్టు కోసం తర్వాతి ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఇదే ఆట ఇప్పుడు ప్రపంచకప్ గెలిపించాలి... కోట్లాది అభిమానుల ఆశలను నిజం చేయాలి.
అయితే ఎదురుగా ఉన్నది మామూలు జట్టు కాదు... ఐదుసార్లు విశ్వవిజేతగా నిలవడం మాత్రమే కాదు... అంగుళం అవకాశం లేని చోట నుంచి కూడా అవకాశాలు సృష్టించుకొని ప్రత్యర్థిని పడగొట్టగల నైపుణ్యం ఉన్న ఆస్ట్రేలియా... ఈ టోర్నీలోనూ ఆరంభంలో తడబడిన ఆ జట్టు తర్వాత తనేంటో చూపించింది... ఒత్తిడి అనే పదానికి అర్థం తెలియని కంగారూలను భారత్ అడ్డుకోవాలి.
చివరగా... ప్రతీకారం అనే మాటకు క్రికెట్ భాషలో అర్థం తీసుకుంటే అదే ప్రత్యర్థిని అదే తరహా వేదికపై అదే స్థాయిలో ఓడించాలి... అలా చూస్తే 2003లో ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్లో ఓడిన భారత్‌కు 20 ఏళ్ల తర్వాత దక్కిన అవకాశమిది... ఆసీస్‌ను పడగొట్టి మూడోసారి భారత్ విశ్వవిజేతగా నిలవాలని, మైదానంలో లక్ష మంది అభిమానుల సమక్షంలో రోహిత్ శర్మ జట్టు ప్రపంచకప్‌ను సగర్వంగా ఎత్తుకోవాలని యావత్ భారతం ఆశిస్తోంది.
అహ్మదాబాద్: వన్డే వరల్డ్ కప్–2023 ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. 45 రోజుల్లో 48 మ్యాచ్‌ల తర్వాత ఇప్పుడు జగజ్జేతను తేల్చే తుది పోరుకు సమయం వచ్చేసింది. సొంతగడ్డపై అసంఖ్యాక అభిమానుల ఆశల పల్లకిని మోస్తూ మూడో టైటిల్‌పై దృష్టి పెట్టిన భారత జట్టు ఫైనల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది.
నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌లలో ఒకటిగా భావించిన మరో టాప్ జట్టు ఆ్రస్టేలియాతో భారత్ తలపడనుంది.బలాబలాలు, ఫామ్ దృష్ట్యా సహజంగానే భారత్ వైపే మొగ్గు కనిపిస్తుండగా... నాకౌట్ మ్యాచ్‌లలో తమ ఆటను రెట్టింపు స్థాయికి తీసుకెళ్లే ఆసీస్ కూడా సర్వసన్నద్దమైంది.
ఇరు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ విజయంతో పైచేయి సాధించినా... ఆరంభ దశలో ఆసీస్ కూడా పదునైన బౌలింగ్‌తో ఆధిపత్యం చూపించగలిగిందనేది వాస్తవం. అన్ని రకాలుగా హోరాహోరీగా సాగే అవకాశం ఉన్న ఈ పోరును గెలిచే వరల్డ్ చాంపియన్ ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.