Tokyo Olympics India Song: ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందాన్ని ఉత్సాహపరిచే పాటను కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం విడుదల చేశాడు. ‘చీర్4ఇండియా’ పేరుతో ఈ పాట భారతీయ శ్రోతలను అలరించనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఈ ప్రత్యేక పాటకు సంగీతం అందించగా... యువ గాయని అనన్య బిర్లా ఆలపించారు. అధికారిక పాట విడుదల సందర్భంగా మంత్రి ఠాకూర్ మాట్లాడుతూ అందరూ ఈ పాటను వినాలని, తమ వారికి షేర్ చేయాలని అలా యావత్ భారత్ ఈ పాట ద్వారా తమ వాణి వినిపించాలని, భారత బృందానికి మద్దతుగా నిలవాలని కోరారు.
కరోనా నేపథ్యంలో భారత క్రీడాకారుల సన్నాహాలకు ఎదురైన ఇబ్బందులు, అధిగమించిన తీరు ప్రతిబింబించే విధంగా ఈ పాట ఉందని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) చీఫ్ నరీందర్ బాత్రా చెప్పారు. ఈ పాటను రూపొందించిన రెహ్మాన్, సింగర్ అనన్యకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా, టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి మొత్తం 228 మంది బృందం వెళ్లనుంది. ఇందులో 119 మంది అథ్లెట్లు 85 విభాగాల్లో పోటీపడనున్నారు. 119 మంది అథ్లెట్లలో 67 మంది పురుషులు, 52 మంది మహిళలు ఉన్నారు.
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత మంగళవారం సమావేశమైన విషయం తెలిసిందే. అథ్లెట్లలో స్ఫూర్తి నింపడం కోసం మోదీ వారితో మాట్లాడారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లు అంచనాలను అందుకుంటూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని పిలుపునిచ్చారు. మీ వెనక దేశం మొత్తం అండగా ఉందని, క్రీడా వేదికపై భారత పతాకం రెపరెపలాడించాలని కోరారు. జులై 23 నుంచి విశ్వక్రీడలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment