టోక్యో: ఒలింపిక్స్ మహిళల స్విమ్మింగ్ 4*200 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే ఈవెంట్‌లో చైనా స్విమ్మర్లు బోణీ కొట్టారు. ప్రపంచ రికార్డుతో పసిడి పతకం గెలుపొందారు. జున్‌జువాన్, ముహన్ టంగ్, యుఫె జంగ్, లి బింగ్జీలతో కూడిన చైనా బృందం విజేతగా నిలిచింది. చైనా స్విమ్మర్లు 7ని:40.33 సెకన్లలో పోటీని పూర్తి చేశారు. ఈ క్రమంలో చైనా బృందం 2019లో ఆస్ట్రేలియా జట్టు 7ని:41.50 సెకన్లతో నెలకొల్పిన ప్రపంచ రికార్డును... 2012 లండన్ ఒలింపిక్స్‌లో అమెరికా జట్టు 7ని:42.92 సెకన్లతో సాధించిన ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టింది.
ఈ విభాగంలో చైనా 2004, 2008 విశ్వ క్రీడల్లో రజతాలే గెలిచింది. అమెరికాకు చెందిన అలీసన్ స్మిత్, పేజ్ మాడిన్, క్యాథరిన్, లెడెకీల బృందం (7ని: 40.73 సెకన్లు) రజతం గెలుపొందగా... టిట్మస్, ఎమా, మాడిసన్, లీ నియల్ లతో కూడిన ఆస్ట్రేలియా జట్టు (7ని: 41.29 సెకన్లు) కాంస్య పతకం నెగ్గింది. అమెరికా, ఆస్ట్రేలియా జట్లు కూడా కొత్త ఒలింపిక్ రికార్డులు నమోదు చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment