Tribute to Brazil Football Legend Pele: Life History, Interesting Facts - Sakshi
Sakshi News home page

Pele: అటకెక్కిన అంతర్యుద్దం.. అట్లుంటది పీలేతోని! కానీ.. ఎంత ఎదిగినా... ఆయనకూ తప్పలేదు!

Published Sat, Dec 31 2022 9:19 AM | Last Updated on Sat, Dec 31 2022 10:26 AM

Tribute To Brazil Legend Pele Life History Interesting Facts In Telugu - Sakshi

ఆటే అతని లోకం... ఆటే అతని ప్రాణం... చురుకుదనంలో అతనో పాదరసం... గోల్‌ చేస్తే లోకమే దాసోహం... అతను డ్రిబ్లింగ్‌ చేస్తే బిత్తరపోవాల్సిందే... అటాకింగ్‌కు దిగితే చేతులెత్తేయాల్సిందే... ఫార్వర్డ్‌గా అతని విన్యాసాలకు సలాం కొట్టాల్సిందే...

ఇంత గొప్ప ఆటగాడు ఫుట్‌బాల్‌లో ఉన్నందుకు ఆ క్రీడే మురిసింది. తమ జట్టులో ఆటగాడైనందుకు బ్రెజిల్‌ అదృష్టం చేసుకుంది. దీంతో ఈపాటికే అందరికి అర్థమై ఉంటుంది... అతనేవరో కాదు సాకర్‌ సమున్నత శిఖరం పీలే అని! నిజం... అతని ఆట అద్భుతం. అతని గోల్స్‌ అసాధారణం. అతని అంకితభావం నిరుపమానం. 

వరం పొందిన బ్రెజిల్‌కు... అంకితమైపోయిన ఫుట్‌బాల్‌కు... మెప్పించిన గోల్స్‌కు... అతనితో ఆడి అలసిన ప్రత్యర్థులకు... తమకిది భాగ్యమనుకున్న  ప్రేక్షకులకు... కురిపించిన ఆదరాభిమానాలకు సెలవు చెప్పాడు పీలే! గతేడాది పెద్దపేగు క్యాన్సర్‌ బారిన పడిన పీలే.. మహమ్మారి ముందు ఓడి.. 82 ఏళ్ల వయసులో కన్నుమూశాడు.

పది దేశాలు (శాశ్వత) ఆడే క్రికెట్‌లో విశిష్ట క్రికెటర్లు (ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌) ఎంతో మంది ఉన్నారు. కానీ రెండొందల దేశాలు ఆడే ఫుట్‌బాల్‌ లో మాత్రం అత్యుత్తమ ఆటగాళ్లు అతికొద్ది మందే! అదికూడా వేళ్లమీద లెక్కపెట్టేంత మందే సాకర్‌ సూపర్‌స్టార్లు ఉన్నారు. వారిలో పీలే మాత్రం కచ్చితంగా అగ్రగణ్యుడు అంటే ఆశ్చర్యం, అతిశయోక్తి లేనేలేదు. అందుకే అతన్ని ‘ద కింగ్‌’ అంటారు. 

బంతి మైదానంలో పారాడితే కాళ్లతో డ్రిబ్లింగ్‌... గాల్లో ఉంటే ఛాతీతో కంట్రోల్‌... గోల్‌పోస్ట్‌ వద్ద ఎగిరొస్తే హెడర్‌... కింది నుంచి పాస్‌ అయితే చక్కని కిక్‌ షాట్‌... ఇలా బంతి ఎటునుంచి వచ్చినా... తన చుట్టు అడుగడుగునా ప్రత్యర్థులు మాటువేసినా... డిఫెండర్లు గోడ కట్టినా... గోల్‌ కీపర్‌ కంచెలా నిలుచున్నా... పీలే కచ్చితమైన లక్షిత షాట్‌ను ఎవరూ అడ్డుకోలేదు. అంతటి మంత్రముగ్ధమైన ప్రదర్శనతో, ప్రత్యర్థి శిబిరాన్ని నిశ్చేష్టుల్ని చేసే ఆటతీరుతో గోల్స్‌ కొట్టే నైపుణ్యం పీలేకు మాత్రమే సాధ్యం. 

అచ్చుతప్పు పిలుపుతో... 
మినాస్‌ గెరయిస్‌ రాష్ట్రంలోని  చిన్న గ్రామం ట్రెస్‌ కొరకోస్‌లో 1940 అక్టోబర్‌ 23న జన్మించిన పీలే అసలు పేరు అది కాదు. నిజానికి అది పేరులోంచి తెచ్చుకున్న పదం కూడా కాదు. పీలే పేరు... ఎడ్సన్‌ అరాంట్స్‌ డో నాసిమియాంటో! ఇతనికి ఫుట్‌బాల్‌ అంటే పిచ్చి. తండ్రి ఫుట్‌బాలర్‌ కావడంతో ఆ పిచ్చి కాస్త వయసుతో పాటే పెరిగింది.

11 ఏళ్ల ప్రాయంలో అతని నైపుణ్యాన్ని గుర్తించిన స్థానిక ప్రొఫెషనల్‌ ప్లేయర్‌ ఒకరు సాంటోస్‌ యూత్‌ క్లబ్‌లో చేర్పించాడు. అచిరకాలంలోనే సీనియర్‌ జట్టులోకి వచ్చేశాడు. స్కూల్‌లో చదివే రోజుల్లో వాస్కోడి సావో లౌరెంకో క్లబ్‌ గోల్‌ కీపర్‌ ‘బిలే’ పీలే ఫేవరెట్‌ ఆటగాడు.

అతడిని ‘బీలే’గా కాకుండా పీలేగా తప్పుగా పిలిచేవారు. ఆ తర్వాత సహచర విద్యార్థులు ఈ పేరును పీలేకు పెట్టేశారు. ఆ పేరు ఇప్పుడు ఫుట్‌బాల్‌ చరిత్రలో చెరగని సంతకం చేసింది.  

అటకెక్కిన అంతర్యుద్దం.. అట్లుంటది పీలేతోని! 
ఆతని ఆటన్న... అతనికి ఉన్న క్రేజన్న ఎంటో ఈ ఒక్క ఉదంతంతో తెలుస్తుంది. 1969లో నైజీరియా అంతటా అంతర్యుద్దంతో అట్టుడుకుతోంది. పీలే అప్పటికే విశ్వవ్యాప్త ఆదరాభిమానాలు సంపాదించుకున్నాడు.

కానీ ఏమూలో అనుమానం... ఈ అగ్గితో సాంటోస్‌ క్లబ్, స్టేషనరీ స్పోర్ట్స్‌ క్లబ్‌ మధ్య ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ జరుగుతుందా? అని... అయితే ఈ అనుమానాలు పటాపంచలు చేస్తూ నైజీరియాలోని రెండు వర్గాలు పీలే ఆట కోసం విరామం ప్రకటించాయి. దీంతో కాసేపు అంతర్యుద్దం   అటకెక్కగా ... ఆట మైదానంలో ఉరకలెత్తించింది. అట్లుంటది పీలేతోని! 

ఖాళీగా కూర్చోలేదు 
రిటైర్మెంట్‌ తర్వాత... ఇన్ని పేరు ప్రఖ్యాతలు, అవార్డులు, రివార్డులు సాధించాక ఇక ఆటపాట నాకెందుకని ప్రశాంతంగా కూర్చోలేదు. ఆటగాడిగా బిజీగా గడిపిన తర్వాత డాక్యుమెంటరీ నటుడిగాను మెప్పించాడు. ఆల్బమ్‌లను రూపొందించాడు. పలు ఆటోబయోగ్రఫీలను కూడా ప్రచురించాడు. వ్యాపారవేత్తగాను విజయవంతమయ్యాడు.

అనంతరం ఈ విశిష్ట ఫుట్‌బాలర్‌ను 1994లో యునెస్కో గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా నియమించింది. మరుసటి ఏడాది బ్రెజిల్‌ అధ్యక్షుడు... తమ దేశ క్రీడల మంత్రిగాను నియమించారు. 1997లో క్వీన్‌ ఎలిజబెత్‌ –2 చేతుల మీదుగా ‘నైట్‌హుడ్‌’ను కూడా   అందుకున్నాడు.  

ఇంత చేసినా... ఇతనికి తప్పలేదు 
ఫుట్‌బాల్‌ ఆట ప్రభను పెంచి... బ్రెజిల్‌ సాకర్‌ సత్తాను చాటి... క్రీడకే నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన పీలేకు ‘నల్లజాతి’ అవమానాలు తప్పలేదు. అభిమానులు, సాకర్‌ లోకం అతన్ని వేనోళ్ల స్తుతిస్తే మతిలేని మంద, గిట్టని ప్రబుద్ధులు కొందరు అతని వర్ణం సాకుతో గేలిచేశారు.

నల్ల కోతిలాంటి వెకిలి చేష్టలతో ఇబ్బంది పెట్టేవారు. కానీ దీపం మండే కొద్దీ వెలుగును ప్రభవించినట్లే... ఆడే కొద్దీ తన ఆటతీరుతో పీలే ఫుట్‌బాల్‌ క్రీడకే వన్నె తెచ్చాడు తప్ప తలొగ్గే పని, తలదించుకునే పని ఏనాడూ చేయలేదు.   

మూడు వరల్డ్‌కప్‌ విజయాల్లో... 
బ్రెజిల్‌ జట్టులోకి రాగానే తనకు మాత్రమే సాధ్యమైన ఆటతీరుతో పీలే కీలక ఆటగాడిగా మారాడు. దీంతో 16 ఏళ్లకే 1956లో బ్రెజిల్‌ జాతీయ జట్టుకి ఎంపికయ్యాడు. మైదానంలో మెరికలాంటి ఆటతో అందరికంటా పడ్డాడు. 1958 ప్రపంచకప్‌ కోసం స్వీడన్‌కు రిజర్వ్‌ ఆటగాడిగా వెళ్లిన పీలే కీలక ఆటగాడిగా స్వదేశానికి తిరిగొచ్చాడు.

17 ఏళ్ల టీనేజ్‌లో ప్రపంచకప్‌ లో అరంగేట్రం చేసిన పీలే బ్రెజిల్‌ చాంపియన్‌షిప్‌లో కీలకభూమిక పోషించాడు. మరో ప్రపంచకప్‌ (1962) నాటికి స్టార్‌ హోదాతో బరిలోకి దిగాడు. తన జట్టు టైటిల్‌ నిలబెట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డిన పీలే తన కొచ్చిన ‘స్టార్‌ డమ్‌’కు న్యాయం చేశాడు. రెండో ప్రపంచకప్‌ విజయంలో భాగమయ్యాడు.

1966 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ విజేతగా నిలిచింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ అయిన బ్రెజిల్‌ గ్రూప్‌ దశలోనే వెనుదిరగడం, తదనంతర పరిస్థితులతో అదే తన చివరి ప్రపంచకప్‌ అని పీలే ప్రకటించాడు.

తర్వాత మనసు మార్చుకున్న ఈ దిగ్గజం 1970 ప్రపంచకప్‌ ఆడి బ్రెజిల్‌ విజయానికి బాట వేశాడు. అలా 14 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో 12 గోల్స్‌ చేశాడు. మూడు ప్రపంచకప్‌ విజేత జట్లలో భాగమైన ఏకైక ఫుట్‌బాలర్‌గా నిలిచాడు. 

3: పీలే గెలిచిన ప్రపంచకప్‌ల సంఖ్య. 1958, 1962, 1970లలో బ్రెజిల్‌ ప్రపంచకప్‌ టైటిల్స్‌ నెగ్గడంలో పీలే కీలకపాత్ర పోషించాడు. మూడు ప్రపంచకప్‌లు సాధించిన ఒకే ఒక్క ఫుట్‌బాలర్‌గా పీలే రికార్డు నెలకొల్పాడు. 

17: బ్రెజిల్‌ తొలిసారి 1958లో విశ్వవిజేతగా నిలిచినపుడు జట్టులో సభ్యుడిగా ఉన్న పీలే వయస్సు. ప్రపంచకప్‌లో పాల్గొన్న, ప్రపంచకప్‌ను సాధించిన పిన్న వయస్సు ప్లేయర్‌గా పీలే పేరిట ఉన్న రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. 

కెరీర్‌ విశేషాలు
92: అధికారిక, అనధికారిక మ్యాచ్‌ల్లో కలిపి పీలే సాధించిన ‘హ్యాట్రిక్‌’ల సంఖ్య. 
30: మ్యాచ్‌లో పీలే నాలుగు గోల్స్‌ చొప్పున 30 సార్లు సాధించాడు.  
1283: పీలే 1954 నుంచి 1977 మధ్య కాలంలో అధికారిక, అనధికారిక, ఫ్రెండ్లీ మ్యాచ్‌లు కలిపి మొత్తం 1363 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగి 1283 గోల్స్‌ సాధించాడు.  
6: మ్యాచ్‌లో పీలే కనీసం ఐదు గోల్స్‌ చొప్పున ఆరుసార్లు నమోదు చేశాడు. 
77: బ్రెజిల్‌ జాతీయ జట్టు తరఫున 92 మ్యాచ్‌లు ఆడి పీలే చేసిన గోల్స్‌. 
12: ప్రపంచకప్‌ టోర్నీలలో పీలే సాధించిన గోల్స్‌.  

వ్యక్తిగత వివరాలు
జన్మదినం: అక్టోబర్‌ 23, 1940 
ఎక్కడ: ట్రెస్‌ కొరకోస్, బ్రెజిల్‌. 
అసలు పేరు: ఎడ్సన్‌ అరాంట్స్‌ డో నాసిమియాంటో. 
తల్లిదండ్రులు: సెలెస్టె అరాంట్స్, జొవో రామోస్‌ నాసిమియాంటో. 
పెళ్లిళ్లు 3: రోజ్‌మెరి (1966–78), అసిరియా (1994–2010), మార్సియా (2016 నుంచి) 
సంతానం: కెలీ, ఎడ్సన్, జెన్నిఫర్, సాండ్రా (మృతి), ఫ్లావియా, జోషువా, సెలెస్టె. 

పీలేకు ప్రముఖుల నివాళులు
►ఆటను అందంగా తీర్చిదిద్దిన యోధుడు. ఫుట్‌బాల్‌ను కళాత్మకంగా మార్చిన లెజెండ్‌ పీలే.  –నెమార్‌ జూనియర్‌ (బ్రెజిల్‌) 
►ఆల్‌టైమ్‌ సాకర్‌ సూపర్‌ స్టార్‌ పీలే. మీరే  మా అందరికీ స్ఫూర్తి.  –మెస్సీ (అర్జెంటీనా
►సాకర్‌ స్టార్, ఫుట్‌బాల్‌ కింగ్‌ పీలే ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత. నాపై మీరు కురిపించిన ప్రేమానురాగాలు నేనెప్పటికీ మరచిపోలేను.  –క్రిస్టియానో రొనాల్డో ►(పోర్చుగల్‌) అతడిక లేడన్నది చేదు నిజం... కానీ అతని ఆట చిరస్మరణీయం. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి కింగ్‌ పీలే.  –ఎంబాపే (ఫ్రాన్స్‌

►స్పోర్టింగ్‌ లెజెండ్‌ పీలే. ఫుట్‌బాల్‌ కింగ్‌కు ఘనమైన నివాళి.   – బోల్ట్‌ (దిగ్గజ స్ప్రింటర్‌) 
►పీలే లేని లోటు పూడ్చలేనిది. తన ఆటతో, అద్భుత విన్యాసాలతో ఎల్లలెరుగని అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అతని స్ఫూర్తిమంతమైన జీవితం భావి తరాలకు ప్రేరణగా నిలుస్తుంది. –భారత ప్రధాని మోదీ  

చదవండి: Pak Vs NZ 1st Test: ఫలితం రాబట్టాలనుకున్నాం.. కానీ! పాక్‌ అలా బతికిపోయింది!
Pele Old Goals Video: పీలే టాప్‌-10 స్టన్నింగ్‌ గోల్స్‌పై లుక్కేయాల్సిందే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement