WTC: ఆస్ట్రేలియా కంటే ముందుగా ఫైనల్‌ చేరాలంటే?! | Updated WTC Points Table After India Sweep Bangladesh 2 0 In Final Race | Sakshi
Sakshi News home page

WTC: ఫైనల్‌ చేరాలంటే టీమిండియా చేయాల్సిందిదే!

Published Tue, Oct 1 2024 4:26 PM | Last Updated on Tue, Oct 1 2024 5:14 PM

Updated WTC Points Table After India Sweep Bangladesh 2 0 In Final Race

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్‌కు టీమిండియా మరింత చేరువైంది. బంగ్లాదేశ్‌తో కాన్పూర్‌ టెస్టులో దూకుడైన బ్యాటింగ్‌తో ఫలితాన్ని తేల్చి డ్రా గండం నుంచి గట్టెక్కింది. తద్వారా ఈ సీజన్‌లో ఎనిమిదో విజయాన్ని నమోదు చేసి.. పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకుంది.

కాగా డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో టీమిండియా ఇప్పటి వరకు 11 టెస్టులు ఆడింది. ఇందులో ఎనిమిది గెలిచి.. రెండు ఓడిపోగా.. ఒకటి డ్రాగా ముగిసిపోయింది. ఈ క్రమంలో రోహిత్‌ సేన విజయాల శాతాన్ని 74.24గా నమోదు చేసి.. 98 పాయింట్లు సాధించింది. తద్వారా టాప్‌లో కొనసాగుతోంది. ఇక పన్నెండింట 8 విజయాలు, మూడు ఓటములు, ఒక డ్రాతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది.

ఫైనల్‌ చేరాలంటే టీమిండియా చేయాల్సిందిదే!
కాబట్టి ఫైనల్‌ పోరులో ఈ రెండు జట్లే పోటీపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఆస్ట్రేలియా కంటే ముందు టీమిండియానే తుదిపోరుకు అర్హత సాధించే ఛాన్స్‌ ఉంది. ఎందుకంటే.. రోహిత్‌ సేన ఇంకో మూడు మ్యాచ్‌లలో గెలిస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా తుదిపోటీకి అర్హత సాధిస్తుంది.

కాగా భారత జట్టు తదుపరి స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు ఆడనుంది. సొంతగడ్డపై భారత జట్టుకు తిరుగులేదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అలా అయితే ముందుగానే బెర్తు ఖరారు
ప్రస్తుత ఫామ్‌ను బట్టి కివీస్‌ను వైట్‌వాష్‌ చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలంక చేతిలో తాజా టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్‌ ఓడిపోయి చతికిలపడటమే ఇందుకు కారణం. ఒకవేళ అంచనాలు నిజమై టీమిండియా కివీస్‌ జట్టును 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిందంటే ఫైనల్‌ బెర్తు ఖరారైనట్లే!

ఇక తదుపరి ఆస్ట్రేలియా పర్యటనలో ఆడనున్న ఐదు టెస్టుల్లో ఫలితం ఎలా ఉన్నా పెద్దగా తేడా ఉండదు. ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో శ్రీలంక మూడో స్థానం(9 మ్యాచ్‌లలో ఐదు గెలుపు, నాలుగు ఓటమి)లో ఉండగా.. ఇంగ్లండ్‌(పదహారు మ్యాచ్‌లో 8 గెలుపు, ఏడు ఓటమి, ఒక డ్రా)నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. మరోవైపు.. టీమిండియా చేతిలో పరాజయంతో బంగ్లాదేశ్‌ ఐదు నుంచి ఏడో స్థానానికి పడిపోయింది.

ఈసారైనా టైటిల్‌ గెలవాలని
కాగా 2019 నుంచి ప్రతి రెండేళ్లకొకసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ నిర్వహిస్తున్నారు. ఆరంభ ఎడిషన్‌లో టీమిండియా- న్యూజిలాండ్‌ ఫైనల్‌ చేరగా.. కేన్‌ విలియమ్సన్‌ ట్రోఫీని ముద్దాడింది. ఇక 2021-23 సీజన్‌లో ఆస్ట్రేలియాతో పాటు టైటిల్‌ పోరుకు అర్హత సాధించిన భారత్‌ మరోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మరి ఈసారి ఫైనల్‌ ఆ గండాన్ని అధిగమిస్తుందో.. లేదంటే హ్యాట్రిక్ ఫైనలిస్టుగా మాత్రమే మిగిలిపోతుందో చూడాలి.

టీమిండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ రెండో టెస్టు
సెప్టెంబరు 27- అక్టోబరు 1: గ్రీన్‌ పార్క్‌  స్టేడియం, కాన్పూర్‌
టాస్‌: టీమిండియా.. బౌలింగ్‌
బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ : 233 పరుగులు ఆలౌట్‌
టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ : 285/9 డిక్లేర్డ్‌
బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌ : 146 పరుగులకు ఆలౌట్‌
టీమిండియా రెండో ఇన్నింగ్స్‌: 98/3
ఫలితం: ఏడు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు

చదవండి: Ind vs Aus: టీ20 తరహా ఇన్నింగ్స్‌.. వైభవ్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement