కోహ్లి మాట చెవికెక్కించుకోని వైభ‌వ్‌! | Vaibhav Sooryavanshi-Fight-Ignored-Kohli Advice India-A-Vs-Sri-lanka-a | Sakshi
Sakshi News home page

కోహ్లి మాట చెవికెక్కించుకోని వైభ‌వ్‌!

Jun 16 2026 12:25 PM | Updated on Jun 16 2026 12:48 PM

Vaibhav Sooryavanshi-Fight-Ignored-Kohli Advice India-A-Vs-Sri-lanka-a

ట్రై సిరీస్‌లో శ్రీలంక-ఏతో మ్యాచ్ ముగిసిన అనంతరం ఆ జట్టు ఆటగాళ్లతో వైభవ్ సూర్యవంశీ గొడవ హైలైట్‌గా నిలిచింది. తప్పు ఎవరిదైనా వైభవ్ సూర్యవంశీ ప్రవర్తనపై విమర్శలు వచ్చాయి. 15 ఏళ్ల వయసులో ఇంత అగ్రెసివ్ పనికి రాదని, ఓర్పు వహిస్తేనే జట్టులో ఎక్కువకాలం చోటు ఉంటుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఈ నేపథ్యంలో రెండు వారాల క్రితం ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీకి కోహ్లి అడ్వైజ్‌ ఇస్తున్న ఫొటో తాజాగా సోషల్ మీడియాలో మరోసారి వైరలయ్యింది. ఆ ఫొటోలో కోహ్లి వైభవ్ భుజంపై చేయి వేసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు. వాళ్లిద్దరు ఏం మాట్లాడుకున్నారనేది కూడా వైభవ్ వెల్లడించాడు.  

‘మ్యాచ్ జరుగుతున్నంత సేపు ప్రత్యర్థి  ఏం మాట్లాడుతున్నా పట్టించుకోవద్దు. ఆటపైనే మన దృష్టి ఉండాలి. కెరీర్ ఎదుగుదలలో ఓపిక చాలా అవసరం. అది ఉన్నప్పుడే మనకు క్రికెట్‌లో లాంగ్ కెరీర్‌కు ఆస్కారం ఉంటుంది’ అని కోహ్లి తనతో చెప్పినట్లు వైభవ్ పేర్కొన్నాడు. అయితే తాజాగా లంకతో మ్యాచ్‌లో వైభవ్ అగ్రెసివ్ ప్రవర్తన చూస్తుంటే కోహ్లీ చెప్పిన మాటలు ఏవీ అతడు చెవికె క్కించుకోలేదనిపిస్తోంది. 

కోహ్లి ఇచ్చిన సూచనలు, సలహాలు తూ.చా. తప్పకుండా పాటించి ఉంటే ఇవాళ వైభవ్ ప్రవర్తన ఇలా ఉండేది కాదని పలువురు సీనియర్లు పేర్కొంటున్నారు. అయితే వైభవ్ సూర్యవంశీ అగ్రెసివ్‌గా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. 2025లో అండర్‌-19 ఆసియా కప్ ఫైనల్ సందర్భంలోనూ వైభవ్ ఇదే దూకుడు ప్రదర్శించాడు. 

ఆనాడు పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ పేసర్ అలీ రెజా వైభవ్‌ను ఔట్ చేశాడు. ఈ సమయంలో పాక్ బౌలర్ వైభవ్‌ను కించపరిచే విధంగా మాట్లాడాడు. అయితే ఉడుకురక్తంతో ఉన్న వైభవ్ కూడా అంతే ఘాటుగా స్పందించాడు. అలీ రెజావైపు చూస్తూ చేతి వేలితో సైగ చేస్తూ, దూషిస్తూ పెవిలియన్ బాట పట్టాడు. అప్పట్లో ఈ వీడియో బాగా వైరలయ్యింది.

టీమిండియా స్టార్ ప్లేయర్‌ విరాట్ కోహ్లి అంటేనే  దూకుడుకు పెట్టింది పేరు. తన అగ్రెసివ్ ప్రవర్తనతో విమర్శలు కూడా మూటగట్టుకున్నాడు. అయితే కోహ్లి మైదానంలో ఉన్నంతసేపు మాత్రం హుందాగానే ప్రవర్తిస్తాడు. ప్రత్యర్థిపై ఎంత కోపం ఉన్నా మైదానంలో ఎక్కువశాతం ఫన్నీమోడ్‌లోనే ఉండడానికే ప్రయత్నం చేస్తుంటాడు.  

మంచి విష‌యం ఆల‌స్యంగా.. కానీ ఒక చెడ్డ విష‌యం వేగంగా వ్యాప్తి చెందుతున్న మాట వైభవ్ విషయంలో నిజమైంది. ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శనతో అందరి చేత శెభాష్ అనిపించుకున్న వైభవ్ ఇప్పుడు తన ప్రవర్తనతో అందరి దృష్టిలో బ్యాడ్‌గా మారిపోతున్నాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న వైభవ్ సూర్యవంశీ ఇప్పటికైనా తన అగ్రెసివ్ ప్రవర్తనను తగ్గించుకొని ఆడితే క్రికెట్‌లో ఎక్కువకాలం కొనసాగేందుకు ఆస్కారం ఉంటుంది.

చదవండి: ఓట‌మితో లెక్కలు తారుమారు.. ఇండియా-ఏ ఫైన‌ల్ చేర‌డం క‌ష్ట‌మే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement