చెన్నై: భారత చెస్ క్రీడాకారిణి వైశాలి రమేశ్‌బాబు తన కెరీర్‌లో కీలక మైలురాయిని అందుకుంది. తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల వైశాలి శుక్రవారం ‘గ్రాండ్‌మాస్టర్’ హోదాను అందుకుంది. స్పెయిన్‌లో జరుగుతున్న ఎలోబ్రిగాట్ ఓపెన్ సందర్భంగా జీఎం గుర్తింపును దక్కించుకుంది. టోర్నీ తొలి రెండు రౌండ్‌లలో విజయం సాధించిన వైశాలి ఈ క్రమంలో 2500 ఎలో రేటింగ్‌ను దాటడంతో గ్రాండ్‌మాస్టర్ ఖాయమైంది.
భారత్ తరఫున ఈ ఘనతను సాధించిన 84వ ప్లేయర్‌గా వైశాలి గుర్తింపు పొందగా...భారత్‌నుంచి జీఎంగా మారిన మూడో మహిళా ప్లేయర్ మాత్రమే కావడం విశేషం. ఇప్పటికే చెస్ ప్రపంచంలో సంచలన విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జీఎం ప్రజ్ఞానందకు వైశాలి స్వయంగా అక్క కావడం విశేషం.
వైశాలికంటే నాలుగేళ్లు చిన్నవాడైన ప్రజ్ఞానంద 2018లోనే గ్రాండ్‌మాస్టర్ హోదా అందుకోగా... ఐదేళ్ల తర్వాతి వైశాలి ఈ జాబితాలో చేరింది. తద్వారా ప్రపంచ చెస్‌లో గ్రాండ్‌మాస్టర్లుగా నిలిచిన తొలి సోదర, సోదరి ద్వయంగా వీరిద్దరు నిలవడం చెప్పుకోదగ్గ మరో విశేషం.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో...
చదరంగంపై ఆసక్తితోనే చిన్న వయసులోనే ఎత్తుకు పైఎత్తులు వేయడం ప్రారంభించిన వైశాలిని తల్లిదండ్రులు రమేశ్‌బాబు, నాగలక్ష్మి ప్రోత్సహించి ప్రొఫెషనల్ చెస్ వైపు మళ్లించారు. ఆ తర్వాత వరుస విజయాలతో ఆమె దూసుకుపోయింది. వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్‌లో వైశాలి అండర్–12, అండర్–14 విభాగాల్లో విజేతగా నిలిచింది. 2020 చెస్ ఒలింపియాడ్‌లో తొలిసారి స్వర్ణపతకం గెలిచిన భారత జట్టులో వైశాలి సభ్యురాలిగా ఉంది.
2018లో ఆమె ఉమన్ గ్రాండ్‌మాస్టర్ హోదాను అందుకుంది. ఆ తర్వాత 2019 ఎక్స్‌ట్రాకాన్ ఓపెన్‌లో తొలి జీఎం నార్మ్, 2022లో ఫిషర్ మెమోరియల్ టోరీ్నలో రెండో జీఎం నార్మ్ సాధించిన వైశాలి ఈ ఏడాది ఖతర్ మాస్టర్స్‌లో మూడో జీఎం నార్మ్‌ను సొంతం చేసుకుంది. వరల్డ్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు క్వాలిఫయింగ్‌గా పరిగణించే క్యాండిడేట్స్ టోర్నీకి వైశాలి అర్హత సాధించింది. పురుషుల విభాగంలో ఇదే టోర్నీకి ప్రజ్ఞానంద కూడా క్వాలిఫై అయ్యాడు.
దాంతో ‘క్యాండిడేట్స్’ బరిలో నిలిచిన తొలి సోదర, సోదరి జోడీగా కూడా వీరు గుర్తింపు దక్కించుకున్నారు. భారత్‌నుంచి గ్రాండ్‌మాస్టర్ హోదా అందుకున్న తొలి మహిళగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోనేరు హంపి (2002లో) గుర్తింపు పొందగా...2011లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన ద్రోణవల్లి హారిక కూడా ఈ హోదాను సాధించింది. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఈ సందర్భంగా వైశాలికి అభినందనలు తెలియజేశాడు.
Comments
Please login to add a commentAdd a comment