టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి (Varun Chakravarthy) బంపరాఫర్ తగిలినట్లు తెలుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) కోసం ఎంపిక చేసిన భారత జట్టులో (Team India) వరుణ్‌కు చోటు కల్పించనున్నారని సమాచారం. మెగా టోర్నీ కోసం ముందుగా ప్రకటించిన జట్టులో వరుణ్‌కు చోటు దక్కలేదు.
అయితే ఇటీవల ఇంగ్లండ్ ముగిసిన టీ20 సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో వరుణ్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ బెర్త్ ఖరారైందని తెలుస్తుంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ముగిసినా వరుణ్ భారత వన్డే జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేయడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తుంది.
వరుణ్ ప్రస్తుతం భారత వన్డే జట్టుతో కలిసి నాగ్‌పూర్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో తొలి వన్డే సిరీస్ కోసం ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరంలో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.
Varun Chakaravarthy training with Indian ODI Team in Nagpur 🚨
- He's not officially part of the squad yet.
📸: Sandipan Banerjee#INDvENG #ChampionsTrophy #Nagpur pic.twitter.com/vqfyQJtdLe— OneCricket (@OneCricketApp) February 4, 2025
కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన జట్లలో మార్పులు చేర్పుల కోసం ఇంకా అవకాశం ఉంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో చెలరేగిన నేపథ్యంలో వరుణ్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేయాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటీవల రిటైరైన భారత లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం వరుణ్‌ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలని సిఫార్సు చేశాడు. ఒకవేళ వరుణ్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్‌కు యాడ్ చేస్తే ఎవరిని తప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే, ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ సిరీస్‌లో వరుణ్ 14 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌లో వరుణ్ భారత విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో వరుణ్‌ను ఎదుర్కొనేందుకు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్లు తెగ ఇబ్బంది పడిపోయారు.
వరుణ్ గతేడాది సౌతాఫ్రికా పర్యటనలోనూ (టీ20 సిరీస్‌లో) ఇరగదీశాడు. ఆ సిరీస్‌లో వరుణ్ 4 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఇంగ్లండ్, సౌతాఫ్రికా బ్యాటర్లపై వరుణ్ పూర్తి ఆధిపత్యం చలాయించిన నేపథ్యంలో అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేయాలని ప్రతి భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు కూడా భాగమన్న విషయం తెలిసిందే.
వన్డేల్లో ఇదే జోరు కొనసాగించగలడా..?
ప్రస్తుత పరిస్థితుల్లో వరుణ్ విషయంలో ఓ ఆసక్తికర ప్రశ్న తలెత్తుతుంది. టీ20 ఫార్మాట్‌లో చెలరేగిపోతున్న వరుణ్ వన్డేల్లో రాణించగలడా లేదా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. 33 ఏళ్ల వరుణ్ ఇప్పటివరకు భారత్ తరఫున వన్డే అరంగేట్రం చేయలేదు. వరుణ్ కేవలం టీ20లకు మాత్రమే పరిమితమయ్యాడు. వరుణ్ వైవిధ్యమైన స్పిన్ బౌలింగ్ వన్డేలకు సూట్ అవుతుందో లేదో వేచి చూడాలి.
వరుణ్ భారత్ తరఫున 18 టీ20ల్లో 2 ఐదు వికెట్ల ప్రదర్శనల సాయంతో 33 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ ఒక్క సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సిరీస్‌ల్లోనే 9 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు తీశాడు. వరుణ్‌కు ఐపీఎల్‌లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. వరుణ్ గతేడాది కేకేఆర్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment