'డికాక్‌ను మిస్‌ అవుతున్నా.. ఏం చేయలేని పరిస్థితి!' | Very Unfortunate That Quinton De-kock Has To Miss Out IPL 2023 | Sakshi
Sakshi News home page

#KLRahul: 'డికాక్‌ను మిస్‌ అవుతున్నా.. ఏం చేయలేని పరిస్థితి!'

Published Wed, Apr 19 2023 8:51 PM | Last Updated on Wed, Apr 19 2023 9:41 PM

Photo: IPL Twitter - Sakshi

లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆటగాడు క్వింటన్‌ డికాక్‌ను తాను చాలా మిస్సవుతున్నట్లు జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా బుధవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో లక్నో తలపడుతుంది. టాస్‌ సమయంలో కేఎల్‌ రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని సంతరించుకుంది.

గతేడాది ఐపీఎల్‌లో క్వింటన్‌ డికాక్‌ లక్నో సూపర్‌జెయింట్స్‌ తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగి మంచి ప్రదర్శన కనబరిచాడు. కేఎల్‌ రాహుల్‌తో కలిసి మంచి ఓపెనింగ్‌ భాగస్వామ్యాలు నిర్మించిన డికాక్‌  148.97 స్ట్రైక్‌రేట్‌తో 508 పరుగులు చేశాడు. గతేడాది లక్నో ప్లేఆఫ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.

అయితే ఈ ఏడాది ఐపీఎల్‌లో డికాక్‌ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. దానికి ఒక కారణం ఉంది. జట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లు ఉండాలనే నిబంధన ఒకటి అయితే.. మరొకటి డికాక్‌ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన కైల్‌ మేయర్స్‌ అంచనాలకు మించి రాణిస్తుండడమే. 

వన్డే మ్యాచ్‌ల కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు డికాక్‌ అందుబాటులో లేడు. దీంతో అతని స్థానంలో మేయర్స్‌ ఓపెనర్‌గా వచ్చి ఆకట్టుకున్నాడు. ఇప్పటికే ఈ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరపున కైల్‌ మేయర్స్‌ టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఆరు ఇన్నింగ్స్‌లు కలిపి 168 స్ట్రైక్‌రేట్‌తో 219 పరుగులు చేశాడు. అతని ఖాతాలో మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

ఓపెనింగ్‌ స్లాట్‌లో కాదని మిగతా స్థానాల్లో ఆడిద్దామంటే నికోలస్‌ పూరన్‌, మార్కస్‌ స్టోయినిస్‌లు ఉండనే ఉన్నారు. ఇక బౌలర్ల కోటాలో మార్క్‌వుడ్‌ లేదా రొమారియో షెపర్డ్‌లకు చోటు దక్కుతుంది. దీంతో 6.75 కోట్లకు రిటైన్‌ చేసుకున్న డికాక్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తోంది. ఓపెనర్‌గా రావాల్సినోడు డ్రింక్స్‌ మోస్తూ కనిపించడం ఆసక్తి కలిగించింది.

ఇదే విషయమై కేఎల్‌ రాహుల్‌ మాట్లాడుతూ.. ''డికాక్‌ను చాలా మిస్సవుతున్నా. కానీ ఏం చేయలేని పరిస్థితి. గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో నాతో కలిసి మంచి ఓపెనింగ్‌ భాగస్వామ్యాలు అందించి జట్టును ప్లేఆఫ్‌ వరకు తీసుకెళ్లాడు. కానీ ఈసారి అతను వచ్చేసరికే జట్టులో ఉన్న నలుగురు విదేశీ ప్లేయర్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఓపెనర్‌గా కైల్‌ మేయర్స్‌ అద్బుత ప్రదర్శన చేస్తుండడంతో అతన్ని పక్కనబెట్టలేని పరిస్థితి. డికాక్‌ అవకాశం కోసం మరికొంత సమయం వేచి చూడాల్సిందే తప్పదు.'' అంటూ చెప్పుకొచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement