Ajinkya Rahane To Ishant Sharma: Comeback Kings Of IPL 2023 - Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2023లో అతి పెద్ద సర్‌ప్రైజ్‌ ఎవరు..?

Published Sun, May 28 2023 8:33 AM | Last Updated on Sun, May 28 2023 10:25 AM

Veteran Players Who Gave Big Surprise In IPL 2023 - Sakshi

ఐపీఎల్‌ 2023 సీజన్‌లో కొందరు వెటరన్లు అనూహ్యంగా సత్తా చాటారు. వీరిలో చాలా మంది తమ గతానికి భిన్నంగా రాణించి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. కొందరు తమ సహజ శైలికి భిన్నంగా రెచ్చిపోతే.. మరికొందరు తమ యుక్త వయసులో కూడా ప్రదర్శించని దూకుడును ప్రదర్శించి తమ జట్ల విజయాల్లో ప్రధాన పాత్ర పోషించారు. లేటు వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా అద్భుత ప్రదర్శనలు చేసిన ఆ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం. 

ఈ జాబితాలో ముందుంగా చెప్పుకోవాల్సింది గుజరాత్‌ పేసర్‌ మోహిత్‌ శర్మ పేరు. సరైన అవకాశాలు రాక, చాలాకాలంగా టీమిండియాతో పాటు ఐపీఎల్‌కు కూడా దూరంగా ఉండిన 34 ఏళ్ల మోహిత్‌ను ఈ ఏడాది వేలంలో గుజరాత్‌ టైటాన్స్‌ నామమాత్రపు 50 లక్షల ధరకు సొంతం చేసుకుంది. ఈ రైట్‌ ఆర్మ్‌ పేసర్‌ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, ఈ సీజన్‌లో ఊహించిన దానికి మించి రాణిస్తున్నాడు. 13 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ముంబైతో జరిగిన క్వాలిఫయర్‌-2లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగి కెరీర్‌ అత్యుత్తమ గణాంకాలు (5/10) నమోదు చేశాడు. ఈ సీజన్‌కు ఇతనే అతి పెద్ద సర్‌ప్రైజ్‌ అని చెప్పవచ్చు.

ఆ తర్వాత అజింక్య రహానే.. 35 ఏళ్ల ఈ వెటరన్‌ బ్యాటర్‌ను సీఎస్‌కే ఈ ఏడాది వేలంలో కనీస ధర 50 లక్షలకు సొంతం చేసుకుంది. రహానే.. తనకు సరైన అవకాశాలు రావడం లేదన్న కసితో ఆడాడో ఏమో కానీ, అతని శైలికి భిన్నంగా రెచ్చిపోయి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి చెన్నై విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. రహానే ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడి 169.89 స్ట్రయిక్‌ రేట్‌తో 2 అర్ధసెంచరీల సాయంతో 299 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన కారణంగా అతను టీమిండియాలో కూడా చోటు దక్కించుకున్నాడు.

పియుశ్‌ చావ్లా.. 35 ఏళ్ల ఈ వెటరన్‌ స్పిన్నర్‌ను ఈ ఏడాది వేలంలో ముంబై ఇండియన్స్‌ 50 లక్షలకు సొంతం చేసుకుంది. అంతా అయిపోయిందనుకున్న  దశలో ఐపీఎల్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పియుశ్‌.. అంచనాలకు మించి రాణించి, తన 15 ఏళ్ల ఐపీఎల్‌ కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా 16 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టి, ముంబై క్వాలిఫయర్‌-2 దశ వరకు చేరడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతను ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు (179) సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు.  

వీరి తర్వాత చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేసిన వెటరన్లలో ఇషాంత్‌ శర్మ ఉన్నాడు. 35 ఏళ్ల ఈ వెటరన్‌ పేసర్‌ను ఈ ఏడాది వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 50 లక్షలకు సొంతం చేసుకుంది. గత కొంతకాలంగా క్రికెట్‌కు పూర్తిగా దూరంగా ఉంటున్న ఇషాంత్‌.. ఈ సీజన్‌లో అనూహ్యంగా సత్తా చాటాడు. 8 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టి, ఓ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు సైతం సొంతం చేసుకున్నాడు. ఇషాంత్‌ కూడా ఈ ఏడాది సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ప్లేయరే అని చెప్పాలి.

పై నలుగురు కాక ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సర్‌ప్రైజ్‌ ప్లేయర్స్‌ జాబితాలో మరో ముగ్గురు వెటరన్లు ఉన్నారు.  గుజరాత్‌.. విజయ్‌ శంకర్‌ (32 ఏళ్లు , 1.4 కోట్లు) (13 మ్యాచ్‌ల్లో 160.11 స్ట్రయిక్‌ రేట్‌తో 3 అర్ధ సెంచరీల సాయంతో 301 పరుగులు), రాజస్థాన్‌ రాయల్స్‌ సందీప్‌ శర్మ (12 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు), లక్నో అమిత్‌ మిశ్రా (41 ఏళ్లు, 50 లక్షలు) (7 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు). వీరు సైతం ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పై పేర్కొన్న ఆటగాళ్లలో దాదాపుగా అందరూ 50 లక్షల ధరకు, వివిధ జట్ల పంచన చేరిన వారే. మరి, మిమ్మల్ని  ఈ ఏడాది అధికంగా సర్‌ప్రైజ్‌ చేసిన వెటరన్‌ ఆటగాడెవరో కామెంట్‌ రూపంలో తెలియజేయండి. 

చదవండి: కీలక మ్యాచ్‌ల్లో రోహిత్‌ రాణించడం ఎప్పుడు చూడలేదు.. అతనో ఫెయిల్యూర్‌...!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement