South Africa vs India, 3rd T20I: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భవితవ్యం గురించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అక్షర్ పటేల్ రూపంలో జడ్డూకు ప్రమాదం పొంచి ఉందన్నాడు.
టీ20 జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలంటే జడ్డూ బ్యాట్ ఝులిపించాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. లేనిపక్షంలో ఏ క్షణమైనా సెలక్టర్లు జడేజాపై వేటు వేయడానికి వెనుకాడరని పేర్కొన్నాడు. ముఖ్యంగా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో వైస్ కెప్టెన్ అన్న ట్యాగ్ అతడిని కాపాడుతుందనుకుంటే పొరబడ్డేనని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
సమం చేసి పరువు నిలుపుకోవాలని
కాగా సౌతాఫ్రికా పర్యటనలో భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తుండగా.. రవీంద్ర జడేజా అతడికి డిప్యూటీగా వ్యవహరిస్తున్నాడు. ఇక మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటిది వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో టీమిండియా ఓటమిపాలైంది.
ఈ క్రమంలో సిరీస్ సమం చేసి పరువు కాపాడుకోవాలని పట్టుదలగా ఉన్న భారత్.. మూడో టీ20లో పలు మార్పులతో బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
అక్షర్ పటేల్ రూపంలో జడ్డూకు పోటీ
‘‘రింకూ సింగ్ మరోసారి మంచి స్కోరు సాధించాలని కోరుకుంటున్నా. జితేశ్ శర్మతో పాటు రవీంద్ర జడేజా కూడా తమ వంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జడ్డూ ఇంకాస్త మెరుగ్గా ఆడాలి.
ఎందుకంటే పొట్టి ఫార్మాట్లో అక్షర్ పటేల్ రూపంలో అతడికి గట్టి పోటీ ఉంది. కేవలం వైస్ కెప్టెన్ అయినంత మాత్రాన జడ్డూ తుదిజట్టులో ఉంటాడన్న నమ్మకం లేదు. నిజానికి ఇటీవలి కాలంలో టీమిండియా వైస్ కెప్టెన్ పదవికి పెద్దగా విలువేమీ ఉండటం లేదు.
అప్పుడు అజింక్య రహానే.. మొన్న అయ్యర్
ఆస్ట్రేలియాతో సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అంతకు ముందు టెస్టుల్లో అజింక్య రహానే కూడా టెస్టు జట్టు సారథికి డిప్యూటీగా వ్యవహరించాడు. ఈ మధ్య సెలక్టర్లు ఆటగాళ్లపై వేటు వేయడానికి ముందూ వెనుకా ఆలోచించడం లేదు.
అది వైస్ కెప్టెన్ అయినా.. ఇంకెవరైనా సరే! ఇలా ఎందుకు చేస్తున్నారో నాకైతే అంతుపట్టడం లేదు’’ అంటూ గురువారం నాటి మూడో టీ20 ఆరంభం నేపథ్యంలో ఆకాశ్ చోప్రా ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
ఇదిలా ఉంటే రెండో టీ20లో రింకూ సింగ్ 68 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ సూర్య 56 పరుగులు సాధించాడు. రవీంద్ర జడేజా 14 బంతుల్లో 19 పరుగులు చేశాడు. జితేశ్ శర్మ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇక సౌతాఫ్రికా- టీమిండియా మధ్య సిరీస్ విజేతను తేల్చే మూడో టీ20కి జొహన్నస్‌బర్గ్ వేదిక.
చదవండి: #AusVsPak: పాక్ బౌలర్లకు చుక్కలు.. టెస్టులో వార్నర్ టీ20 ఇన్నింగ్స్! ఆ తప్పిదం వల్ల నో వికెట్!
Comments
Please login to add a commentAdd a comment