Indonesia Open: Satwik-Chirag Victory Over World No. 1 Rank Pair - Sakshi
Sakshi News home page

సాత్విక్‌–చిరాగ్‌ సంచలనం

Published Sat, Jun 17 2023 3:13 AM | Last Updated on Sat, Jun 17 2023 11:01 AM

Victory over the world number one ranked pair - Sakshi

జకార్తా: ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న భారత పురుషుల డబుల్స్‌ బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి మరో సంచలన ప్రదర్శన చేసింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఏడో సీడ్‌ సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం 21–13, 21–13తో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ జోడీ, టాప్‌ సీడ్‌ ఫజర్‌ అల్ఫీయాన్‌–మొహమ్మద్‌ రియాన్‌ అర్దియాంతో (ఇండోనేసియా)లను బోల్తా కొట్టించింది.

41 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లోనూ ఆరంభ దశలో రెండు జోడీలు పాయింట్ల కోసం హోరాహోరీగా పోరాడాయి. అయితే మ్యాచ్‌ కొనసాగుతున్నకొద్దీ సాత్విక్‌–చిరాగ్‌ జోడీ పైచేయి సాధించింది. చివరిసారి 2019లో ఫజర్‌–అర్దియాంతోలతో తలపడిన సాత్విక్‌–చిరాగ్‌ నాడు వరుస గేముల్లో నెగ్గగా...ఈసారీ రెండు గేముల్లోనే గెలిచారు.

నేడు జరిగే సెమీఫైనల్లో కాంగ్‌ మిన్‌ హిక్‌–సియో సెంగ్‌ జె (దక్షిణ కొరియా)లతో సాత్విక్‌–చిరాగ్‌ తలపడతారు. ఈ సీజన్‌లో సాత్విక్‌–చిరాగ్‌ స్విస్‌ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించగా... మలేసియా ఓపెన్‌లో సెమీఫైనల్‌ చేరారు.  

వరుసగా రెండో ఏడాది... 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత స్టార్‌ షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత నంబర్‌వన్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ వరుసగా రెండో ఏడాది ఈ టోరీ్నలో సెమీఫైనల్‌ చేరుకోగా... కిడాంబి శ్రీకాంత్‌ పోరాటం ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ ప్రణయ్‌ 21–18, 21–16తో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ కొడాయ్‌ నరోకా (జపాన్‌)పై గెలుపొందాడు.

గతంలో నరోకాతో ఆడిన నాలుగుసార్లూ ఓడిపోయిన ప్రణయ్‌ ఐదో ప్రయత్నంలో ఈ జపాన్‌ ప్లేయర్‌పై నెగ్గడం విశేషం. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌)తో ప్రణయ్‌ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ప్రణయ్‌ 2–5తో వెనుకంజలో ఉన్నాడు. మరో క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 69 నిమిషాల్లో 14–21, 21–14, 12–21తో ప్రపంచ పదో ర్యాంకర్‌ లీ షి ఫెంగ్‌ (చైనా) చేతిలో ఓడిపోయాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement