
రాజ్‌కోట్: మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా మూడో శతకం బాదాడు. కేరళతో మ్యాచ్‌లో అతను సెంచరీ (124; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) సాధించాడు. రుతురాజ్ తొలి మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌పై (136)... రెండో మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌పై (154 నాటౌట్) సెంచరీలు చేశాడు. కేరళతో మ్యాచ్‌లో రుతురాజ్ ప్రదర్శన మహారాష్ట్ర గెలవడానికి సరిపోలేదు. ఈ మ్యాచ్‌లో కేరళ నాలుగు వికెట్లతో నెగ్గింది. తొలుత మహారాష్ట్ర 8 వికెట్లకు 291 పరుగులు చేయగా... కేరళ 48.5 ఓవర్లలో 6 వికెట్లకు 294 పరుగులు సాధించింది. విష్ణు వినోద్ (100 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కేరళను గెలిపించాడు.
మొహాలి: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీలో రెండు వరుస విజయాల తర్వాత హైదరాబాద్‌కు తొలి ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 49 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. టి.రవితేజ (86 బంతుల్లో 63; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. కొల్లా సుమంత్ (32) ఫర్వాలేదనిపించాడు. సౌరాష్ట్ర బౌలర్ ప్రేరక్ మన్కడ్ (4/54) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం సౌరాష్ట్ర 39 ఓవర్లలో 3 వికెట్లకు 225 పరుగులు సాధించింది. హార్విక్ దేశాయ్ (108 బంతుల్లో 101 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా, షెల్డన్ జాక్సన్ (64 బంతుల్లో 65; 10 ఫోర్లు, 1 సిక్స్), ప్రేరక్ మన్కడ్ (50 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అండగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment