రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి(PC: BCCI)
టీమిండియాతో పాటు ప్రపంచ క్రికెట్‌లోనూ తమదైన ముద్ర వేసిన.. ముద్ర వేస్తున్న ఆటగాళ్లలో ముందు వరుసలో ఉంటారు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి.. ప్రస్తుత సారథి రోహిత్ శర్మ. అయితే, ఇద్దరూ ఎవరికి వారే ప్రత్యేకం. ఒకరి సారథ్యంలో ఒకరు ఆడటానికి ఏమాత్రం ఇబ్బంది పడని ఈ ఇరువురు బ్యాటర్లు.. కష్టకాలంలో పరస్పరం ఒకరికొకరు అండగా ఉంటూ ముందుకు సాగుతున్న తీరు ఆదర్శనీయం.
ఎవరికి వారే సాటి! కానీ..
ఇక రికార్డులు సాధించడంలోనూ ఎవరికి వారే సాటి. అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు ‘కింగ్’ కోహ్లి. వన్డేల్లో 43, టెస్టుల్లో 27 శతకాలు తన పేరిట లిఖించుకున్నాడు. ఈ విషయంలో మాత్రం కోహ్లి దరిదాపుల్లోకి రాలేకపోయాడు హిట్‌మ్యాన్. ఓపెనర్‌గా బరిలోకి దిగే రోహిత్ శర్మ ఇప్పటి వరకు టీమిండియా తరఫున టెస్టుల్లో 8, వన్డేల్లో 29 సెంచరీలు బాదాడు.
అయితే, టీ20 ఫార్మాట్‌లో మాత్రం కోహ్లి కంటే మెరుగైన రికార్డు కలిగి ఉన్నాడు రోహిత్ శర్మ. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పొట్టి ఫార్మాట్‌లో విరాట్ ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. రోహిత్ మాత్రం టీ20ల్లో 4 శతకాలు నమోదు చేశాడు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లి తిరిగి ఫామ్‌లోకి వస్తే తప్ప రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డులు బద్దలు కొట్టడం అసాధ్యం. అవేంటో పరిశీలిద్దామా!?
హిట్‌మ్యాన్‌కే సాధ్యమైంది...
వన్డే ఫార్మాట్‌లో అంతర్జాతీయ స్థాయిలో రోహిత్ ఇప్పటి వరకు మూడు ద్విశతకాలు సాధించాడు. తొలుత ఆస్ట్రేలియాపై 2013లో 158 బంతుల్లో 16 సిక్సర్లు, 12 ఫోర్ల సాయంతో 209 పరుగులు చేశాడు.
ఆ మరుసటి ఏడాది శ్రీలంకపై రెండో డబుల్ సెంచరీ(173 బంతుల్లో 264 పరుగులు) సాధించాడు. అనంతరం 2017లో మళ్లీ అదే జట్టుపై 208 పరుగులు సాధించాడు. అయితే వీటన్నింటిలో శ్రీలంకపై రోహిత్ మొదట సాధించిన ద్విశతకం ఎంతో ప్రత్యేకమైనది.
ఈ మ్యాచ్‌లో 33 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో హిట్‌మ్యాన్ 264 పరుగులు చేశాడు. ఇందులో 186 పరుగులు బౌండరీల సాయంతో పొందినవే. ఇక కోహ్లి విషయానికొస్తే వన్డేల్లో అతడి అత్యధిక స్కోరు 183. ఆసియా కప్-2012లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మీద సాధించాడు. అయితే, తన కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు ఉన్నా వన్డేల్లో ఇంతవరకు 200 మార్కు మాత్రం అందుకోలేకపోయాడు కోహ్లి.
ఐపీఎల్‌లో కష్టమే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముంబై ఇండియన్స్‌ను ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత హిట్‌మ్యాన్‌కు ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక టైటిళ్లు గెలిచిన సారథిగా తన పేరును పదిలం చేసుకున్నాడు రోహిత్.
అయితే, బ్యాటర్‌గా ఐపీఎల్‌లో పలు అరుదైన రికార్డులు సాధించినప్పటికీ కోహ్లి.. కెప్టెన్‌గా మాత్రం అనుకున్న ఫలితాల్ని రాబట్టలేకపోయాడు. రాయల్ చాలెంజర్స్‌కు గత సీజన్ వరకు సారథ్యం వహించిన అతడు ఒక్క టైటిల్ కూడా గెలవకుండానే కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. 2009, 11,16లో ఫైనల్ వరకు జట్టును తీసుకురాగలిగా తుది మెట్టుపై ఆర్సీబీ బోల్తా పడటంతో కోహ్లికి నిరాశ తప్పలేదు. ఇక ఇప్పుడు కేవలం ఆర్సీబీ బ్యాటర్‌గా ఉన్న కోహ్లి.. కెప్టెన్‌గా రోహిత్ లాంటి రికార్డు అందుకోవడం కష్టమే!
సిక్సర్ల వీరుడు..
అంతర్జాతీయ వన్డేల్లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 250కి పైగానే సిక్సర్లు బాదాడు. ఈ ఘనత సాధించిన క్రికెటర్లలో షాహిద్ ఆఫ్రిది, క్రిస్ గేల్, సనత్ జయసూర్య తర్వాతి స్థానం ఆక్రమించాడు.
ఇక కోహ్లి నమోదు చేసిన గణాంకాలు పరిశీలిస్తే... వన్డే క్రికెట్‌లో 43 సెంచరీలతో సత్తా చాటినప్పటికీ సిక్సర్ల విషయంలో మాత్రం వెనుకబడ్డాడు. ఇప్పటి వరకు కోహ్లి 125 సిక్సర్లు బాదాడు. ఈ విషయంలో ఈ మాజీ కెప్టెన్.. హిట్‌మ్యాన్‌ను అధిగమించడం అంత సులువేమీ కాదు! ఇక వీరిద్దరూ ఇప్పుడు ఆసియా కప్-2022, టీ20 వరల్డ్‌కప్ టోర్నీలకు సన్నద్ధమయ్యే పనిలో ఉన్నారన్న విషయం తెలిసిందే.
చదవండి: Ashes Series:139 ఏళ్ల యాషెస్ చరిత్రకు తొలిసారి దెబ్బ పడనుందా!
Asia Cup 2022: టీమిండియా సెలక్టర్లు చేసిన అతి పెద్ద తప్పు అదే!
Comments
Please login to add a commentAdd a comment