న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మను పక్కన పెట్టడంపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు వరకు రోహిత్ శర్మ జట్టులో ఉంటాడని అందరూ భావించినప్పటికీ.. కెప్టెన్ కోహ్లి అనూహ్య నిర్ణయంతో అభిమానులందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా రోహిత్ శర్మకు తొలి రెండు టీ20లకు విశ్రాంతినిస్తున్నట్లు టాస్ సమయంలో కోహ్లి ప్రకటించడంతో అంతా అవాక్కయ్యారు.
ఊహించని హఠాత్పరిణామంతో షాక్‌కు గురైన వీరేంద్ర సెహ్వాగ్.. ఆఖరి నిమిషంలో కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిస్తున్నట్లు ప్రకటించడం ఎంత వరకు సమంజసమని కోహ్లిని ప్రశ్నించాడు. విశ్రాంతి పేరుతో జట్టులో నుంచి తప్పించే రూల్ నీకు కూడా వర్తిస్తుందా అంటూ కోహ్లిపై ధ్వజమెత్తాడు. కెప్టెన్ విశ్రాంతి తీసుకోకుండా ఇతర ఆటగాళ్లకు ఎందుకు విశ్రాంతినిస్తున్నాడంటూ కోహ్లిపై మండిపడ్డాడు. రోహిత్ లాంటి ఆటగాడు మ్యాచ్‌లో లేకపోతే నా టీవీ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుందని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా రోహిత్‌ను పక్కనపెట్టడం వల్లనే భారత్ ఓటమి పాలైందని టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కూడా సెహ్వాగ్‌తో గొంతుకలిపాడు.
కాగా, రోహిత్ గైర్హాజరీతో బరిలోకి దిగిన భారత జట్టు తగిన మూల్యమే చెల్లించుకుంది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్(1), విరాట్ కోహ్లి(0), శిఖర్ ధావన్(4) దారుణంగా విఫలం కావడంతో భారత్ స్వల్ప స్కోర్‌కే పరిమితమై 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. అయ్యర్(67) రాణించకపోయుంటే భారత్ (నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు) మూడంకెల స్కోర్ సాధించడం కూడా కష్టమే అయ్యుండేది.
Comments
Please login to add a commentAdd a comment