ఐడెన్ మార్క్రమ్ (PC: SRH X)
SRH- IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మార్పు నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐడెన్ మార్క్రమ్‌నే సారథిగా కొనసాగించాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఇందుకు గల కారణాన్ని కూడా అశూ వెల్లడించాడు.
గత మూడు సీజన్లుగా చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానం కోసం పోటీ పడుతోంది సన్‌రైజర్స్. డేవిడ్ వార్నర్ తర్వాత ఎంత మంది కెప్టెన్లను మార్చినా జట్టు తలరాతను మాత్రం మార్చుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024 వేలంలో వ్యూహాత్మకంగా పావులు కదిపింది.
రూ. 20. 50 కోట్ల భారీ ధరకు ఆస్ట్రేలియా కెప్టెన్, వన్డే వరల్డ్‌కప్-2023 విజేత ప్యాట్ కమిన్స్‌ను కొనుగోలు చేసింది. గత ఎడిషన్‌లో రైజర్స్ జట్టును ముందుకు నడిపించిన ఐడెన్ మార్క్రమ్ స్థానంలో సారథిగా నియమించింది.
ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణయం సరైంది కాదేమోనని అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ అరంగేట్ర, తాజా సీజన్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రర్న్‌కేప్‌ను చాంపియన్‌గా నిలబెట్టిన మార్క్రమ్‌పై వేటు వేయకుండా ఉండాల్సిందని పేర్కొన్నాడు.
ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ.. ‘‘సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ వరుసగా రెండు టైటిళ్లు గెలిచింది. అత్యద్బుతమైన జట్టుతో ట్రోఫీలు అందుకుంది. కానీ ఇక్కడ మార్క్రమ్‌ను కాదని వాళ్లు ప్యాట్ కమిన్స్‌ను కెప్టెన్ చేశారు.
నిజంగా ఇది షాకింగ్‌గా అనిపించింది. మార్క్రమ్‌నే సారథిగా కొనసాగిస్తారని ఊహించాను. సౌతాఫ్రికాలో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా అత్యద్బుత ప్రదర్శన కనబరిచాడు. కానీ ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు.
కమిన్స్‌ను కెప్టెన్‌గా ప్రకటించినందు వల్ల తుదిజట్టు కూర్పులో రైజర్స్ కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ట్రవిస్ హెడ్‌ను బ్యాకప్‌గా ఉపయోగించుకున్నా.. మార్క్రమ్, హెన్రిచ్‌క్లాసెన్, వనిందు హసరంగలను ప్రధాన ప్లేయర్లుగా ఆడించాల్సి ఉంటుంది.
ఒకవేళ హసరంగ లేకుంటే కొన్ని వేదికల్లో ఫజల్హక్ ఫారూకీ లేదంటే మార్కోజాన్సెన్‌లను ఆడించే అవకాశం ఉంది. ఏదేమైనా విదేశీ ప్లేయర్లను ఆడించే విషయంలో రైజర్స్‌కు ఇబ్బందులు తప్పవు’’ అని రాజస్తాన్ రాయల్స్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. కాగా మార్చి 23న కేకేఆర్‌తో సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
చదవండి: పేరు మార్చుకున్న ఆర్సీబీ... కన్నడలో మాట్లాడిన కోహ్లి.. వీడియో
Comments
Please login to add a commentAdd a comment