Wasim Jaffer picks his Indian squad for World Cup 2023: వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుష్కరకాలం తర్వాత భారత గడ్డపై ఈ మెగా ఈవెంట్ జరుగుతున్న తరుణంలో అభిమానులను ఆశ్చర్యపరిచే విధంగా తన జట్టును ఎంపిక చేసుకున్నాడు. తన టీమ్‌లో 15 మందికి చోటిచ్చిన ఈ మాజీ బ్యాటర్.. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు తగిన ప్రాధాన్యం ఉండాలని నొక్కి వక్కాణించాడు.
‘‘రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, శిఖర్ ధావన్.. ఈ ముగ్గురే నా ఓపెనర్లు. తుది జట్టులో ధావన్‌కు చోటు దక్కనప్పటికీ బ్యాకప్ ఓపెనర్‌గా అతడు ఎంతో కీలకం. మిడిలార్డర్‌లో.. మూడో స్థానంలో విరాట్ కోహ్లి.. ఆ తర్వాతి స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఉండాలి.
సంజూ కూడా..
ఇక బౌలర్ల విభాగంలో ముగ్గురు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ నా ప్లేయింగ్ 11లో ఉంటారు.పేస్ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఉంటారు. అయితే, వీరితో పాటు హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ చేయడం ముఖ్యం. ఇక బ్యాకప్ ప్లేయర్లుగా శార్దూల్ ఠాకూర్(పేసర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్)కు చోటిస్తాను’’ అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.
యువకులు పాతుకుపోతున్నారు
కాగా శిఖర్ ధావన్ గతేడాది డిసెంబరులో ఆఖరిసారిగా టీమిండియాకు ఆడాడు. అప్పటి నుంచి జాతీయ జట్టులో అతడికి చోటే కరువైంది. కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా యువ ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్(రెగ్యులర్), ఇషాన్ కిషన్ పాతుకుపోతున్నారు. టెస్టుల్లో ఘనమైన ఎంట్రీ ఇచ్చిన యశస్వి జైశ్వాల్ కూడా పోటీకి వస్తున్నాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ సైతం రేసులో ఉండనే ఉన్నాడు.
ద్వితీయ శ్రేణి జట్టులోనూ దక్కని చోటు
ఈ నేపథ్యంలో ధావన్ మళ్లీ టీమిండియాలో పునరాగమనం చేయడం దాదాపు అసాధ్యం. అంతేకాదు ఇటీవల ఆసియా క్రీడలు-2023కి ఎంపిక చేసిన ద్వితీయ శ్రేణి జట్టుకు ధావన్ సారథ్యం వహించనున్నాడనే వార్తలు వట్టి పుకార్లేనని సెలక్షన్ కమిటీ నిర్ణయంతో తేలిపోయింది.
ఏకంగా వరల్డ్‌కప్‌లో?
రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో యువ జట్టును చైనాకు పంపనున్నారు. అలాంటిది వసీం జాఫర్ మాత్రం సీనియారిటీకి పెద్దపీట వేస్తూ ధావన్‌ను ఏకంగా వరల్డ్‌కప్-2023లో ఆడించాలనే సూచన చేయడం విశేషం. ఈ నేపథ్యంలో.. ‘‘పాపం ధావన్.. ద్వితీయ శ్రేణి టీమ్‌లోనే దిక్కులేదు.. మరి వరల్డ్‌కప్‌లో ఆడిస్తారా’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: తేలిపోయిన వెంకటేశ్ అయ్యర్.. రెచ్చిపోయిన రింకూ సింగ్
Comments
Please login to add a commentAdd a comment