Asia Cup 2023 India Vs Pakistan- Rohit Sharma- Virat Kohli: ఆసియా కప్-2023 ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పూర్తిగా నిరాశపరిచారు. దాయాది పాకిస్తాన్‌తో పోరులో చెలరేగుతారనుకుంటే ఊహించని రీతిలో బౌల్డ్ అయ్యారు. పాక్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిదికే ఇద్దరూ వికెట్లు సమర్పించుకున్నారు.
ఆఫ్రిది చెలరేగడంతో
5 ఓవర్ మొదటి బంతికే రోహిత్‌ను బౌల్డ్ చేసిన ఆఫ్రిది.. మరుసటి ఓవర్ ఐదో బంతికే కోహ్లిని పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొన్న ‘హిట్‌మ్యాన్’ 11 పరుగులు చేయగా.. ‘రన్‌మెషీన్’ 7 బంతుల్లో 4 పరుగులతో సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు.
‘విరాహిత్’పై ఫ్యాన్స్ ఫైర్
ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు ఉసూరుమంటున్నారు. పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే విశ్వరూపం చూపిస్తారనుకుంటే.. ఇలా చతికిలపడిపోయారంటూ మండిపడుతున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ చేస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. అసలే వర్షం చిరాకు తెప్పిస్తుంటే.. పసలేని బ్యాటింగ్‌తో మీరు కూడా ఆగ్రహం తెప్పిస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు.
నిర్లక్ష్యం ప్రదర్శిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాను అవుటైన తీరును జీర్ణించుకోలేకపోయిన రోహిత్ శర్మ.. తల విదిలిస్తూ అసహనంతో పెవిలియన్ చేరాడు. ఇక హిట్‌మ్యాన్ అవుట్ కాగానే.. ప్యాడ్స్‌తో డగౌట్‌లో రెడీగా ఉన్న కోహ్లి.. ‘‘అయ్యో ఏంటిది అన్నట్లు’’ ఓ వింత ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇద్దరూ ఇద్దరే.. కొంపముంచారు
కాగా పిచ్ స్వభావాన్ని బట్టి టాస్ గెలిచిన కెప్టెన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంటాడనుకుంటే రోహిత్ శర్మ అందుకు భిన్నంగా తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఇక టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కు వేదికైన శ్రీలంకలోని పల్లెకెలెలో వికెట్ పేసర్లకు అనుకూలిస్తోంది.
15 ఓవర్లు ముగిసే సరికి పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్ రెండేసి వికెట్లు తీయడం.. నసీం షా కూడా మెరుగైన ఎకానమితో బౌలింగ్ చేయడం ఇందుకు నిదర్శనం. రోహిత్ శర్మ, కోహ్లి వికెట్లు ఆఫ్రిది పడగొట్టగా.. గిల్(10), శ్రేయస్ అయ్యర్(14) వికెట్లను రవూఫ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
చదవండి: Ind Vs Pak: షమీకి నో ఛాన్స్.. అందుకే ముందు బ్యాటింగ్: రోహిత్ శర్మ
Rohit wikt
— Waqar wahla (@Waqarwahla19171) September 2, 2023
Kholi Reaction#INDvsPAK #PAKvIND pic.twitter.com/c0zo2OFAn1
Comments
Please login to add a commentAdd a comment