WC 2022: ఇక అశ్విన్‌ అవసరం లేదు! రోహిత్‌ శర్మ చెప్పిందిదే! | WC 2023, Ind Vs Ban: Ashwin Turns Mentor As Rohit Sharma Bowls In Nets | Sakshi
Sakshi News home page

WC 2023: ఇక అశ్విన్‌ అవసరం లేదు! బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేసిన రోహిత్‌ శర్మ

Published Tue, Oct 17 2023 9:28 PM | Last Updated on Wed, Oct 18 2023 8:56 AM

WC 2023 Ind Vs Ban: Ashwin Turns Mentor As Rohit Sharma Bowls Nets - Sakshi

నెట్స్‌లో రోహిత్‌ శర్మ (PC: X)

ICC WC 2023- Ind Vs Ban: వన్డే వరల్డ్‌కప్‌-2023లో హ్యాట్రిక్‌ విజయాలతో జోరు మీదున్న టీమిండియా తదుపరి మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. పుణె వేదికగా గురువారం(అక్టోబరు 19) బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ నేపథ్యంలో ఇప్పటికే ప్రాక్టీస్‌ మొదలుపెట్టేసింది.

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, ప్రధాన పేసర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తదితరులు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఈ క్రమంలో రన్‌మెషీన్‌ కోహ్లి ల్యాప్‌, స్వీప్‌ షాట్లు ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయగా.. రోహిత్‌ శర్మ బంతితో రంగంలోకి దిగాడు. ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగమైన టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మార్గదర్శనంలో బౌలింగ్‌ చేశాడు.

అలాంటి అవసరం లేకుండా
కాగా బంగ్లాదేశ్‌ నలుగురు ఎడమచేతి వాటం గల బ్యాటర్లతో ఆడుతున్న తరుణంలో.. అదనపు స్పిన్నర్‌ అవసరం లేకుండా టీమిండియా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆఫ్‌ స్పిన్నర్‌ అశూకు బంగ్లాతో మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కనట్లయితే.. తాను బౌలింగ్‌ చేసేందుకు రోహిత్‌ సంసిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. 

రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌
పార్ట్‌ టైమ్‌ బౌలర్‌ అయిన రోహిత్‌.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఏకంగా హ్యాట్రిక్‌ నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, భుజానికి గాయమైనప్పటి నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇప్పటిదాకా బౌలింగ్‌ చేసిన దాఖలాలు లేవు.

చివరిగా పెర్త్‌లో ఆస్ట్రేలియాతో 2016 నాటి వన్డే సందర్భంగా రోహిత్‌ శర్మ బాల్‌తో మైదానంలో దిగాడు. అయితే, 2021లో ఇంగ్లండ్‌తో టెస్టు సందర్భంగా ఈ రైట్‌ఆర్మ్‌ ఆఫ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌ రెండు ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. ఇక టీ20లలో ఆఖరిగా 2012లో బంతితో యాక్షన్‌లో దిగాడు.

ఇక అశ్విన్‌ అవసరం లేదు
ఇదిలా ఉంటే.. ఇటీవల ముగిసిన ఆసియా వన్డే కప్‌-2023లో టీమిండియా అనూహ్య రీతిలో బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా, జస్‌ప్రీత్‌ బుమ్రా, సిరాజ్‌ తదితరులు లేకుండా బరిలోకి దిగిన రోహిత్‌ సేన.. 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైంది.

ఈ నేపథ్యంలో గురువారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా రోహిత్‌ శర్మ నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో. . ‘‘ఇక అశ్విన్‌ అవసరం లేదు! హిట్‌మ్యాన్‌ స్వయంగా రంగంలోకి దిగాడు’’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: సరికొత్త చరిత్ర.. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 11 బంతుల్లోనే.. యువీ రికార్డు బద్దలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement