WC 2023: అతడు లేని లోటు తీర్చేందుకు రంగంలోకి కోహ్లి! గిల్‌ కూడా.. | WC 2023 Ind vs Eng: Kohli Bowls To Gill In Nets, Fans Says Virat To Replace Pandya | Sakshi
Sakshi News home page

WC 2023: పాండ్యా లేని లోటు తీర్చేందుకు రంగంలోకి కోహ్లి.. వీడియో షేర్‌ చేసిన బీసీసీఐ

Published Fri, Oct 27 2023 5:54 PM | Last Updated on Fri, Oct 27 2023 6:12 PM

WC 2023 Ind vs Eng: Kohli Gill Bowl In Nets Fans Says Virat To Replace Pandya - Sakshi

బుమ్రా- విరాట్‌ - గిల్‌ (PC: BCCI)

ICC ODI WC 2023- Ind vs Eng: వన్డే వరల్డ్‌కప్‌-2023లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా డబుల్‌ హ్యాట్రిక్‌పై కన్నేసింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా (6 వికెట్ల తేడాతో), అఫ్గనిస్తాన్‌(8 వికెట్లు), పాకిస్తాన్‌(7 వికెట్లు), బంగ్లాదేశ్‌(7 వికెట్లు), న్యూజిలాండ్‌(4 వికెట్లు)లను ఓడించిన రోహిత్‌ సేన తదుపరి ఇంగ్లండ్‌ పని పట్టేందుకు సిద్ధమైంది.

సెమీస్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించే దశలో ఉన్న ఇంగ్లండ్‌ను ఓడించి వరుసగా ఆరో గెలుపు నమోదు చేయాలని భావిస్తోంది. తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు అజేయంగా ఉన్న తమ రికార్డును అలాగే కొనసాగించాలని చూస్తోంది.

ఇందుకోసం ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు వేదికైన లక్నోలో ప్రాక్టీస్‌ సెషన్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో గురువారం నాటి సెషన్‌కు సంబంధించిన ప్రాక్టీస్‌ వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

నెట్స్‌లో బౌలింగ్‌ చేసిన కోహ్లి, గిల్‌, సూర్య
ఇందులో స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, శుబ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ బౌలింగ్‌ చేయడం ఆసక్తి కలిగించింది. టీమిండియా పేసర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, సిరాజ్‌లతో పాటు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌లతో కలిసి వీళ్లూ బౌలింగ్‌ చేశారు.

రైట్‌ఆర్మ్‌ పేసర్‌ అయిన కోహ్లి.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు బౌలింగ్‌ చేశాడు. గిల్‌ సైతం తన స్పిన్‌ బౌలింగ్‌ నైపుణ్యాలు పరీక్షించుకున్నాడు. ఈ వీడియోకు.. ‘‘ప్రతి ఒక్కరు బౌలర్‌గా ఉండాలని కోరుకుంటున్నారు’’ అని బీసీసీఐ క్యాప్షన్‌ జత చేయడం విశేషం.

పాండ్యాలేని లోటు తీర్చేందుకు రంగంలోకి కోహ్లి
ఇక ఈ వీడియోలో కోహ్లి చేతులు వెనక్కి పెట్టి మరీ క్యాచ్‌ అందుకోవడం హైలైట్‌గా నిలిచింది. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘కోహ్లి బౌలింగ్‌లోనూ కింగే! గిల్‌ కూడా బౌల్‌ చేస్తున్నాడు. పాపం వీళ్లిద్దరితో పాటు శార్దూల్‌ ఠాకూర్‌ కూడా కఠినంగా శ్రమించాల్సి వస్తోంది’’ అని ట్రోల్‌ చేస్తున్నారు.

అదే విధంగా హార్దిక్‌ పాండ్యా స్థానంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అతడి ఓవర్‌ పూర్తి చేసిన కోహ్లి.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లోనూ బౌలర్‌గా పాండ్యా స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నాడని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు.

గాయం కారణంగా పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా జట్టుకు దూరం కాగా కోహ్లి ఆ లోటును తీరుస్తాడని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా బంగ్లాతో మ్యాచ్‌ మధ్యలోనే  పాండ్యా నిష్క్రమించడంతో కోహ్లి దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తొలిసారి బౌలింగ్‌ చేసిన విషయం తెలిసిందే.

చదవండి: WC 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు హార్దిక్‌ పాండ్యా లేడు.. ఒకవేళ బుమ్రా కూడా.. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement