ICC WC 2023- Pakistan Semis Chances Still Alive?: వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభానికి ముందు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా భావించిన పాకిస్తాన్.. ఇప్పుడు కనీసం సెమీస్ చేరుతుందా లేదా అన్న స్థాయికి పడిపోయింది. ప్రపంచకప్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయి.. విమర్శలు మూటగట్టుకుంటోంది.
ఉప్పల్‌లో వరుస విజయాలు
వన్డే ప్రపంచకప్ 13వ ఎడిషన్‌లో తొలుత పసికూన నెదర్లాండ్స్‌తో తలపడింది బాబర్ ఆజం బృందం. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో గెలుపొంది.. ఐసీసీ టోర్నీలో శుభారంభం చేసింది.
ఆ తర్వాత అదే వేదికపై శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించి సత్తా చాటింది. ఎప్పుడైతే దాయాది టీమిండియా చేతిలో పాక్ చిత్తైందో అప్పటి నుంచి జట్టు రాత మారిపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చరిత్రను పునరావృతం చేస్తూ భారత జట్టు పాకిస్తాన్‌ను 8వసారి మట్టికరిపించింది.
టీమిండియా దెబ్బ తర్వాత అన్నీ ఓటములే
సొంతగడ్డపై చిరకాల ప్రత్యర్థిని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి మరోసారి ఆధిపత్యం చాటుకుంది. ఇది మొదలు.. టీమిండియాతో మ్యాచ్ తర్వాత పాకిస్తాన్‌కు వరుసగా ఓటములే ఎదురయ్యాయి.
చెపాక్‌లో ఘోర పరాభవాలు.. ఎన్నడూ లేని విధంగా
బెంగళూరులో ఆస్ట్రేలియా చేతిలో 62 పరుగుల తేడాతో ఓడిన బాబర్ బృందం.. వన్డే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి అఫ్గనిస్తాన్ ముందు కూడా తలవంచింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మరీ దారుణంగా 8 వికెట్ల తేడాతో అఫ్గన్ భంగపాటుకు గురైంది.
ఈ క్రమంలో సెమీస్ రేసులో నిలవాలంటే సౌతాఫ్రికాతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ సీన్ రిపీట్ అయింది. చెపాక్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న మ్యాచ్‌లో అదృష్టం సౌతాఫ్రికాను వరించడంతో పాకిస్తాన్‌కు మరో ఓటమి తప్పలేదు. ఈ శతాబ్దంలో వరల్డ్‌కప్‌లో పాక్ తొలిసారి సఫారీల చేతిలో పరాజయం పాలైంది. దీంతో సెమీస్ ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి తలెత్తింది.
పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగానే!
అయితే, సాంకేతికంగా పాకిస్తాన్ ఇంకా రేసులో ఉన్నట్లే! ఎలా అంటే.. ఈ టోర్నీలో పాకిస్తాన్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ మేరకు బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌తో జరుగనున్న మ్యాచ్‌లలో పాక్ భారీ విజయాలు సాధించి రన్‌రేటును మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది.
తద్వారా పాకిస్తాన్ ఖాతాలో 10 పాయింట్లు చేరతాయి. అయినప్పటికీ నేరుగా సెమీస్ చేరే ఛాన్స్ ఉండదు. ఇందుకోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పటికే సౌతాఫ్రికా(భారీ రన్‌రేటు), టీమిండియా 10 పాయింట్లో పట్టికలో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఆ మ్యాచ్ ఫలితాలపై ఆధారపడిన పాక్ భవితవ్యం
న్యూజిలాండ్ 8, ఆస్ట్రేలియా 6 పాయింట్లతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మిగిలిన మ్యాచ్‌లన్నింటి(ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాక్, శ్రీలంక)లో ఓడిపోతే.. కేవలం ఎనిమిది పాయింట్లతో ఉంటుంది. అప్పుడు పాక్‌కు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.
అదే విధంగా.. ఆస్ట్రేలియా కూడా తమకు మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో మూడు ఓడిపోతే పాక్‌కు ఛాన్స్ ఉంటుంది. తమ తదుపరి మ్యాచ్‌లలో ఆసీస్ న్యూజిలాండ్, ఇంగ్లండ్ చేతిలో ఓడి.. బంగ్లాదేశ, అఫ్గనిస్తాన్‌లలో ఏదో ఒకదానిపై గెలిచినా 8 పాయింట్లకే పరిమితం అవుతుంది కాబట్టి ఈ అవకాశం పాక్‌కు దక్కుతుంది.
ఇంతదాకా తెచ్చుకోవడం ఎందుకు? చూద్దాం
అలా కాక కేవలం న్యూజిలాండ్, ఇంగ్లండ్ చేతిలో కంగారూలు ఓడి అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్‌లపై గెలుపొందితే.. పాకిస్తాన్‌తో పాటు రన్‌రేటుతో పోటీపడాల్సి ఉంటుంది. ఇదేమీ కాకుండా ఆసీస్ మూడూ గెలిచినా.. న్యూజిలాండ్ రెండు, సౌతాఫ్రికా, టీమిండియా తమకు మిగిలిన మ్యాచ్‌లలో కనీసం రెండు గెలుపొందినా పాక్ ఇంటిబాటపట్టాల్సిందే!
అదీ సంగతి.. గత నాలుగు మ్యాచ్‌లలో ఒక్కటి గెలిచినా పాకిస్తాన్‌కు ఈ పరిస్థితి దాపురించేది కాదు! కెప్టెన్ బాబర్ ఆజం అన్నట్లు ఏం జరుగుతుందోనంటూ పాక్ అభిమానులు వేచి చూడాల్సిందే.
చదవండి: అంతా తెలిసే చేశావంటే నిన్నేమనుకోవాలి? అతడి రాతే అంత.. ఎప్పుడూ ఇలాగే!
Comments
Please login to add a commentAdd a comment