WC 2023: శ్రీలంక చేతిలో ఇంగ్లండ్‌కు మరో ఘోర ఓటమి.. సెమీస్‌ రేసు నుంచి అవుట్‌? | WC 2023: Sri Lanka Defeat England By 8 Wickets How Semis Chances | Sakshi
Sakshi News home page

WC 2023: శ్రీలంక చేతిలో ఇంగ్లండ్‌కు మరో ఘోర ఓటమి.. సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించినట్లేనా?

Published Thu, Oct 26 2023 7:17 PM | Last Updated on Thu, Oct 26 2023 8:18 PM

WC 2023: Sri Lanka Defeat England By 8 Wickets How Semis Chances - Sakshi

ICC WC 2023- England vs Sri Lanka: వన్డే వరల్డ్‌కప్‌-2023లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌కు మరో ఘోర పరాభవం! గత మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో 229 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన బట్లర్‌ బృందాన్ని.. గురువారం నాటి మ్యాచ్‌లో శ్రీలంక మట్టికరిపించింది. వరల్డ్‌కప్‌లో ఇం‍గ్లండ్‌పై ఆధిపత్యం కొనసాగిస్తూ ఐదో విజయం నమోదు చేసింది.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఈ క్రమంలో లంక పేసర్లు లాహిరు కుమార, కసున​ రజిత, ఏంజెలో మాథ్యూస్‌ ఆకాశమే హద్దుగా చెలరేగారు.

అదరగొట్టిన లంక పేసర్లు
ఓపెనర్‌ డేవిడ్‌ మలన్‌(28)తో పాటు మొయిన్‌ అలీ వికెట్‌ను ఏంజెలో మాథ్యూస్‌ పడగొట్టగా.. బెన్‌ స్టోక్స్(43), కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌(8), లియామ్‌ లివింగ్‌స్టోన్‌(1) రూపంలో కుమార మూడు కీలక వికెట్లు దక్కించుకున్నాడు.

ఇక కసున్‌ రజిత.. మరో ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో(30)తో పాటు క్రిస్‌ వోక్స్‌(0)ను అవుట్‌ చేశాడు. స్పిన్నర్‌ మహీశ్‌ తీక్షణ మార్క్‌ వుడ్‌ను పెవిలియన్‌కు పంపి తానూ ఓ వికెట్‌ తీశాడు. ఈ క్రమంలో 33.2 ఓవర్లలో 156 పరుగులు చేసిన ఇంగ్లండ్‌ ఆలౌట్‌ అయింది.

నిసాంక సూపర్‌ ఇన్నింగ్స్‌.. సమర విక్రమ హిట్టింగ్‌
ఇక శ్రీలంక లక్ష్య ఛేదనలో డేవిడ్‌ విల్లే ఆరంభంలోనే ఓపెనర్‌ కుశాల్‌ పెరీరా(4) వికెట్‌ తీశాడు. అదే విధంగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌ను కూడా 11 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. అయితే, ఓపెనర్‌ పాతుమ్​ నిసాంక(77- నాటౌట్‌), నాలుగో నంబర్‌ బ్యాటర్‌ సదీర సమరవిక్రమ(65- నాటౌట్‌) చక్కటి సమన్వయంతో మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడుతూ ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు.

సిక్సర్‌తో గెలుపు ఖరారు చేసిన నిసాంక
ఆఖరి వరకు అజేయంగా నిలిచి అద్బుత అర్ధ శతకాలతో శ్రీలంకను గెలుపుతీరాలకు చేర్చారు. 25.4 ఓవర్లలోనే మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు. పాతుమ్‌ ఆఖరి సిక్సర్‌తో లంక ఖాతాలో రెండో విజయం నమోదు కాగా..ఇంగ్లండ్‌కు వరుసగా మరోసారి ఓటమే ఎదురైంది. లాహిరు కుమార్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

ఇంగ్లండ్‌ సెమీస్‌ చేరుతుందా?
అంతేకాదు.. శ్రీలంకతో మ్యాచ్‌లో పరాజయం నేపథ్యంలో ఇంగ్లండ్‌ సెమీస్‌ చేరే అవకాశాలు కూడా సంక్లిష్టంగా మారాయి. గత ఎడిషన్‌లో సొంతగడ్డపై ట్రోఫీ గెలిచిన ఇంగ్లండ్‌ ఈసారి కనీసం టాప్‌-4లో కూడా చేరకుండా నిష్క్రమించే దుస్థితికి చేరువైంది.

కాగా ఇప్పటి వరకు ఈ ఎడిషన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌ నాలుగు ఓడిపోయింది. ప్రస్తుతం రెండు పాయింట్లతో పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఒకవేళ మిగిలిన మ్యాచ్‌లలో గెలిచినా. .ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.

చదవండి: WC 2023: స్నేహాలు, పర్సనల్‌ రిలేషన్‌షిప్స్‌.. అందుకే జట్టుకు ఈ దుస్థితి!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement