టెస్ట్‌ల్లో కుమార సంగక్కర, మహేళ జయవర్దనే లాంటి దిగ్గజ బ్యాటర్లు రిటైరయ్యాక శ్రీలంక బ్యాటింగ్ లైనప్ చాలా బలహీనపడింది. కొందరు ఆటగాళ్లు అడపాదడపా ప్రదర్శనలు చేస్తున్నా అవంత చెప్పుకోదగ్గవేమీ కాదు. ఇటీవలికాలంలో ఆ జట్టులోకి కమిందు మెండిస్ అనే ఓ యువ ఆటగాడు వచ్చాడు.
ఇతను ఆడింది ఐదు టెస్ట్ మ్యాచ్‌లే అయినా దిగ్గజ బ్యాటర్లను మరిపిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో సెంచరీ, రెండు అర్ద సెంచరీలు చేసిన కమిందు.. తన 10 ఇన్నింగ్స్‌ల స్వల్ప కెరీర్‌లో ఏకంగా మూడు సెంచరీలు, నాలుగు అర్ద సెంచరీలు చేసి ఔరా అనిపించాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన తన అరంగేట్రం మ్యాచ్‌లోనే అర్ద సెంచరీతో ఆకట్టుకున్న కమిందు.. ఆతర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి లంక దిగ్గజం కుమార సంగక్కరను గుర్తు చేశాడు.
ఆ మరుసటి టెస్ట్‌లో తృటిలో సెంచరీ చేజార్చుకున్న ఇతను.. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో సెంచరీతో మెరిశాడు. మళ్లీ రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన కమిందు.. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఇలా కమిందు తన స్వల్ప కెరీర్‌లో ఆడిన ప్రతి టెస్ట్ మ్యాచ్‌లో అంచనాలకు మించి రాణించి శభాష్ అనిపించుకుంటున్నాడు. కమిందు టెస్ట్‌ల్లో చేసిన పరుగులు దాదాపుగా విదేశాల్లో చేసినవే కావడం విశేషం. అందులోనూ కమిందు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి చాలా కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు.
బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన కమిందు లోయర్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగుతాడు. కమిందు గణాంకాలు.. అతని ఆటతీరు చూసిన వారు శ్రీలంకకు మరో ఆణిముత్యం లభించిందని చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఇదివరకే (0-2) కోల్పోయిన శ్రీలంక.. మూడో టెస్ట్‌లో మాత్రం విజయం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు మరో 125 పరుగులు చేస్తే విజయం సొంతం చేసుకుంటుంది. ఆట మరో రెండు రోజులు మిగిలి ఉండటంతో పాటు శ్రీలంక చేతిలో ఇంకా తొమ్మిది వికెట్లు ఉన్నాయి. నిస్సంక (53), కుసాల్ మెండిస్ (30) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment