Sri Lanka Failed To Qualify ICC ODI WC 2023 Directly: 1996 వరల్డ్‌కప్ ఛాంపియన్స్.. 2007, 2011 ప్రపంచకప్ రన్నరప్.. ఇవీ వన్డే క్రికెట్‌లో శ్రీలంక సాధించిన అద్బుతాలు. అయితే ఇదంతా గతం. కట్‌చేస్తే .. 2023 వన్డే వరల్డ్‌కప్‌నకు నేరుగా అర్హత సాధించని జట్టుగా లంక అప్రతిష్టను మూటగట్టుకుంది.
అర్జున రణతుంగ, అరవింద డిసిల్వా, సనత్ జయసూర్య, మహేళ జయవర్దనే, కుమార సంగక్కర, చమిందా వాస్ సహా ఎందరో హేమాహేమీలను అందించిన శ్రీలంక క్రికెట్ ఇప్పుడు కనీసం వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించడంలో విఫలమవ్వడం అందరిని విస్మయపరిచింది.
44 ఏళ్ల తర్వాత లంక మళ్లీ వన్డే వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టడం కోసం క్వాలిఫయర్స్ ఆడాల్సిన దుస్థితి ఏర్పడింది. వరుస ఓటములు లంక అవకాశాలను దెబ్బకొట్టాయి. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు శ్రీలంక న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది.
అప్పుడలా.. ఇప్పుడిలా అడ్డుకున్న కివీస్
ఇందులో భాగంగా రెండు టెస్టుల్లో పోరాడి ఓడిన లంక జట్టు.. టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఫలితం నేపథ్యంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే అవకాశాలను కోల్పోయింది. తొలి మ్యాచ్‌లో కేవలం రెండు వికెట్లతో ఓటమి పాలైన కరుణ రత్నె బృందం.. రెండో టెస్టులో ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఇక శ్రీలంక డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలపై నీళ్లు చల్లిన కివీస్.. తాజాగా వన్డే ప్రపంచకప్‌లో నేరుగా అడుగుపెట్టే అవకాశం లేకుండా చేసింది. తొలి వన్డేలో 198 పరుగులతో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్.. శుక్రవారం నాటి మూడో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది.
షనక బృందం అవుట్
కాగా రెండో వన్డే వర్షం కారణంగా రద్దు కావడంతో సిరీస్ 2-0తో సొంతం చేసుకుంది. దీంతో వన్డే సిరీస్ కోల్పోయిన దసున్ షనక బృందం ప్రపంచకప్-2023 టోర్నీకి నేరుగా అర్హత సాధించే అవకాశం కూడా చేజార్చుకుంది. ఈ క్రమంలో జింబాబ్వేలో జూన్‌లో జరుగనున్న ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ ఆడాల్సి ఉంటుంది.
కాగా కివీస్‌తో మూడో వన్డేలో ఓటమితో ఐసీసీ వన్డే సూపర్‌లీగ్ పాయింట్ల పట్టికలో శ్రీలంక తొమ్మిదోస్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. ఎనిమిదో స్థానంలో ఉన్న వెస్టిండీస్‌కు సౌతాఫ్రికా నుంచి ప్రమాదం పొంచి ఉంది. నెదర్లాండ్స్‌తో సిరీస్‌లో సత్తా చాటితే ప్రొటిస్ విండీస్‌ను వెనక్కినెట్టి రేసులో మరో ముందడుగు వేస్తుంది. కాగా భారత్ వేదికగా అక్టోబరులో వన్డే వరల్డ్‌కప్-2023 ఈవెంట్ ఆరంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment