విరాట్ కోహ్లి- రోహిత్ శర్మ PC: BCCI
గత దశాబ్దకాలంగా టీమిండియా ఐసీసీ టోర్నీల్లో నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తున్నా ఒక్క ట్రోఫీ కూడా గెలవలేకపోయింది. ప్రపంచకప్-2015లో లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత జట్టు.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి ఇంటిబాట పట్టింది.
ఇక 2019లో లీగ్ దశలో ఒకే మ్యాచ్ ఓడిపోయి సెమీస్ చేరిన టీమిండియాకు అక్కడ.. న్యూజిలాండ్ చేతిలో పరాభవం తప్పలేదు. అయితే, ఈసారి సొంతగడ్డపై పొరపాట్లకు తావివ్వకుండా కచ్చితంగా మరోసారి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడుతుందని అంతా భావించారు.
అందుకు తగ్గట్లే రోహిత్ సేన ఫైనల్ వరకు అజేయంగా దూసుకువచ్చింది. టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచిన భారత జట్టు గెలుపు లాంఛనమే అని అభిమానులు సంబరపడుతున్న వేళ.. ఫైనల్లో ఆస్ట్రేలియా గట్టి షాకిచ్చింది. దీంతో మరోసారి టీమిండియాకు భంగపాటు తప్పలేదు.
ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కన్నీటి పర్యంతం కాగా ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశమంతా భారత జట్టుకు అండగా నిలిచారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లోనైనా సత్తా చాటాలని కోరుకుంటున్నారు.
ఈ పరిణామాలపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ తనదైన శైలిలో స్పందించాడు. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే మరోసారి చేదు అనుభవం ఎదుర్కోక తప్పదని హెచ్చరించాడు. జట్టుకు అండగా నిలవడం మంచిదే అని.. అయితే, ప్రతిసారి ఏదో ఒక కారణం చూపి క్షమించేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.
టీమిండియా 2007 తర్వాత ఇప్పటి వరకు ఒక్క టీ20 ప్రపంచకప్ కూడా గెలవకలేకపోవడాన్ని ప్రస్తావించిన గావస్కర్... "టీమిండియా వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందనడంలో సందేహం లేదు. అయితే, ఇప్పుడది గతం.
ఆ ఓటమి బాధ నుంచి త్వరగా తేరుకోవాలి. గత నాలుగు వరల్డ్ కప్ ఈవెంట్లలో రెండుసార్లు ఫైనల్ వరకు రాగలిగినా ఆఖరి మెట్టుపై బోల్తా పడింది టీమిండియా. మిగతా జట్లతో పోలిస్తే ఈసారి మరింత గొప్పగా రాణించినా ఫలితం లేకుండా పోయింది.
అయితే.. ఇప్పటికైనా టీమిండియా తమ తప్పులను తెలుసుకుని విశ్లేషించుకోవాలి. ట్రోఫీ ఎందుకు గెలవలేకపోయారో ఆలోచించుకోవాలి. పొరపాట్లను అంగీకరించే గుణం అలవరచుకోవాలి. అప్పుడే పురోగతి కనిపిస్తుంది.
రానున్న వారం రోజుల్లో సెలక్షన్ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. 2007 తర్వాత మనం టీ20 ప్రపంచకప్ గెలవనేలేదు. ఐపీఎల్ రూపంలో ఇంత మంది యువ, ప్రతిభావంతులైన ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నా ఇలా జరగడం విచారకరం" అని మిడ్ డేకు రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు.
అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉండాలని భావిస్తున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి స్టార్ల నిర్ణయాలు గౌరవించి.. వరల్డ్ కప్-2024 నాటికి యువ జట్టును సన్నద్ధం చేయాలని పరోక్షంగా సూచించాడు గావస్కర్. కాగా వచ్చే ఏడాది జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది.
చదవండి: అదే అతడి బలం.. టీమిండియా కెప్టెన్ కాగలడు: అంబటి రాయుడు
Comments
Please login to add a commentAdd a comment