తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్‌.. | West Indies dominant 201-run victory over Bangladesh in first Test | Sakshi
Sakshi News home page

WI vs BAN: తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్‌..

Published Tue, Nov 26 2024 9:46 PM | Last Updated on Tue, Nov 26 2024 9:46 PM

West Indies dominant 201-run victory over Bangladesh in first Test

ఆంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 201 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ ఘనవిజయం సాధించింది. 334 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 9 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఆఖరి వికెట్ షోర్‌ఫుల్ ఇస్లాం రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరగడంతో బం‍గ్లా ఇన్నింగ్స్ ముగిసింది.

వెస్టిండీస్ బౌలర్లలో పేసర్లు కీమర్ రోచ్‌, జైడన్ సీల్స్ తలా మూడు వికెట్లు పడగొట్టి బంగ్లాను దెబ్బ తీశారు. వీరిద్దరితో పాటు అల్జారీ జోషఫ్ రెండు, షమీర్ జోషఫ్ ఒక్క వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ మెహద హసన్ మిరాజ్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్ 450/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

విండీస్ బ్యాటర్లలో జస్టిన్‌ గ్రీవ్స్‌ (115) అజేయ శతకంతో మెరవగా.. మికైల్‌ లూయిస్‌ (97), అలిక్‌ అథనాజ్‌ (90) తృటిలో సెంచరీలు చేజార్చుకున్నారు. బంగ్లా బౌలర్లలో హసన్‌ మహమూద్ మూడు, తస్కిన్‌ అహ్మద్‌, మెహది హసన్‌ తలో 2, తైజుల్‌ ఇస్లాం ఓ వికెట్‌ పడగొట్టారు.

అనంతరం బంగ్లాదేశ్ తమ మొదటి ఇన్నింగ్స్‌ను 269-9తో ముగించింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం జోడించి వెస్టిండీస్‌ బంగ్లాదేశ్‌ ముందు 334 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆ లక్ష్యాన్ని చేధించడంలో బంగ్లా చతికలపడింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు డిసెంబర్ 8న సెయింట్ కిట్స్ వేదికగా ప్రారంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement