విజయం వేటలో ఇంగ్లండ్‌ | West Indies Target 399 To Win Against England In Test Series | Sakshi
Sakshi News home page

విజయం వేటలో ఇంగ్లండ్‌

Published Mon, Jul 27 2020 2:30 AM | Last Updated on Mon, Jul 27 2020 4:34 AM

West Indies Target 399 To Win Against England In Test Series - Sakshi

‘విజ్డన్‌ ట్రోఫీ’ని గెలుచుకోవడానికి ఇంగ్లండ్‌ మరింత చేరువైంది. వెస్టిండీస్‌తో చివరి టెస్టులో ఆరంభం నుంచి దక్కిన ఆధిక్యాన్ని వరుసగా మూడో రోజు కూడా నిలబెట్టుకున్న రూట్‌ సేన ప్రత్యర్థికి సవాల్‌ విసిరింది. పదునైన బౌలింగ్‌తో విండీస్‌ ఆట ముగించి, ఆపై తగిన ప్రణాళికతో బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ జట్టు విండీస్‌ ముందు 399 భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. వెస్టిండీస్‌ బలహీన బ్యాటింగ్‌కు ఇది దాదాపు అసాధ్యమైన లక్ష్యంగా కనిపించగా.... ఇప్పటికే 2 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఇక ఆశలు వదిలేసుకున్నట్లే. వాతావరణం అంతరాయం కలిగించినా రెండు రోజులపాటు విండీస్‌ నిలబడటం అసాధ్యమే.

మాంచెస్టర్‌: వెస్టిండీస్‌ చేతిలో తొలి టెస్టులో ఓడిన అనంతరం కోలుకొని విజయం సాధించిన ఇంగ్లండ్‌ ఇప్పుడు సిరీస్‌నూ గెలుచుకునేందుకు సమాయత్తమవుతోంది. చివరిదైన మూడో టెస్టులో విజయం కోసం 399 పరుగులు చేయాల్సిన విండీస్‌ మూడో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో 2 వికెట్లకు 10 పరుగులు చేసి ఎదురీదుతోంది. బ్రాత్‌వైట్‌ (2 బ్యాటింగ్‌), హోప్‌ (4 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌ను 2 వికెట్లకు 226 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. రోరీ బర్న్స్‌ (90; 10 ఫోర్లు), జో రూట్‌ (68 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌), డామ్‌ సిబ్లీ (56; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఓవర్‌నైట్‌ స్కోరు 137/6తో ఆట కొన సాగించిన విండీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 172 పరుగుల ఆధిక్యం లభించింది. బ్రాడ్‌ 6 వికెట్లతో చెలరేగాడు.   

అంతా బ్రాడ్‌మయం... 
17.5 ఓవర్లు... 60 పరుగులు ... 4 వికెట్లు ... ఆదివారం వెస్టిండీస్‌ ఆట ఇది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ హోల్డర్, డౌరిచ్‌ ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఆట కొనసాగించారు. అయితే ఒక్కసారి ఈ జోడీ విడిపోయిన తర్వాత జట్టు ఆలౌట్‌ అయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. విండీస్‌ తమ చివరి 4 వికెట్లను 19 పరుగుల వ్యవధిలో చేజార్చుకుంది.  ఈ నాలుగూ బ్రాడ్‌ ఖాతాలోకి వెళ్లాయి. 

సెంచరీ భాగస్వామ్యం...
ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ను బర్న్స్, సిబ్లీ జాగ్రత్తగా ప్రారంభించారు. ముందుగా సిబ్లీ 121 బంతుల్లో, బర్న్స్‌ 111 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. ఎట్టకేలకు 114 పరుగుల శతక భాగస్వామ్యం తర్వాత సిబ్లీని అవుట్‌ చేసి హోల్డర్‌ ఈ జోడిని విడగొట్టాడు. మూడో స్థానంలో వచ్చిన కెప్టెన్‌ రూట్‌ దూకుడు ఆడి 49 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. మరోవైపు శతకానికి చేరువైన బర్న్స్‌... ఛేజ్‌ బౌలింగ్‌లో స్లాగ్‌స్వీప్‌కు ప్రయత్నించి వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఆ వెంటనే ఇంగ్లండ్‌ డిక్లేర్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement