Cheteshwar Pujara Gets Huge Praise: టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారాపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. బీసీసీఐ సెలక్టర్లు ఏం ఆలోచిస్తున్నారన్న అంశంతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్న తీరు అమోఘమని కొనియాడాడు. ఆట పట్ల అతడి నిబద్ధత యువ ఆటగాళ్లకు ఓ స్పూర్తిదాయ పాఠంగా నిలుస్తుందని కైఫ్ పేర్కొన్నాడు.
కాగా టెస్టు స్పెష్టలిస్టు పుజారా టీమిండియా ‘నయా వాల్’గా ప్రఖ్యాతి గాంచాడు. స్వదేశీ, విదేశీ గడ్డలపై భారత జట్టు సాధించిన పలు చిరస్మరణీయ విజయాల్లో అతడిది కీలక పాత్ర. శరీరానికి గాయం చేసే డెలివరీలతో బౌలర్లు ఇబ్బంది పెడుతున్నా వికెట్ పడకుండా గంటల కొద్దీ క్రీజులో నిలబడి జట్టుకు ప్రయోజనం చేకూర్చగల అంకితభావం అతడి సొంతం.
ఇక తన కెరీర్‌లో వందకు పైగా టెస్టులాడిన పుజారా 7195 పరుగులు సాధించాడు. ఇందులో 19 శతకాలు, 3 డబుల్ సెంచరీలు, 35 అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే, ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్లో వైఫల్యం తర్వాత అతడికి టీమిండియాలో చోటు కరువైంది.
వెస్టిండీస్, దక్షిణాఫ్రికా పర్యటనలకు అతన్ని తప్పించగానే ఈ వెటరన్ పనైపోయిందని అందరూ భావించారు. అయితే రంజీ ట్రోఫీ కొత్త సీజన్‌లో ఈ సౌరాష్ట్ర స్టార్ బ్యాటర్ అజేయ డబుల్ సెంచరీతో తాను ఫామ్‌లోకి వచ్చానని చాటుకున్నాడు. తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 17వ డబుల్ సెంచరీతో రికార్డులు సృష్టించాడు.
డబుల్ సెంచరీల వీరుడు.. అరుదైన రికార్డులు
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో పుజారా ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా; 37), వ్యాలీ హామండ్ (ఇంగ్లండ్; 36), ప్యాట్సీ హెండ్రన్ (ఇంగ్లండ్; 22) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. హెర్బర్ట్ సట్‌క్లిఫ్ (ఇంగ్లండ్; 17), మార్క్ రాంప్రకాశ్ (ఇంగ్లండ్; 17)లతో కలిసి పుజారా (17) ఉమ్మడిగా నాలుగో స్థానంలో ఉన్నాడు.
అంతేకాదు.. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా పుజారా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో తొమ్మిది డబుల్ సెంచరీలతో పారస్ డోగ్రా (హిమాచల్‌ప్రదేశ్) అగ్రస్థానంలో ఉండగా... అజయ్ శర్మ (ఢిల్లీ–7) మూడో స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలో పుజారా అద్భుత ప్రదర్శనపై స్పందిస్తూ మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఎక్స్ వేదికగా అతడిని ప్రశంసించాడు.
పరుగుల వరద పారించడమే పని
‘‘జాతీయ జట్టు సెలక్టర్లు ఏం ఆలోచిస్తున్నారో అతడికి అనవసరం. కేవలం పరుగుల వరద పారించడం మాత్రమే అతడికి తెలుసు. క్రికెట్ పట్ల అతడి నిబద్ధత యువ ఆటగాళ్లకు కచ్చితంగా ఓ పాఠంగా నిలుస్తుంది’’ అని పుజారాను ఉద్దేశించి కైఫ్ పేర్కొన్నాడు.
Regardless of what the national selectors think of him, Pujara keeps scoring runs. His commitment should be a lesson for all youngsters playing the game. #pujara pic.twitter.com/Py3cFlJJs5
— Mohammad Kaif (@MohammadKaif) January 8, 2024
కాగా జనవరి 25 నుంచి స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్టు సిరీస్ ఆడనునున్న నేపథ్యంలో ఛతేశ్వర్ పుజారాకు సెలక్టర్లు పిలుపునిస్తారా? లేదంటే మళ్లీ పక్కనే పెడతారా అన్న అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
చదవండి: Ind Vs Afg: అఫ్గన్‌తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
Comments
Please login to add a commentAdd a comment