విధ్వంసం సృష్టించిన తెలుగు కుర్రాడు.. ఎవరీ నితీష్‌ రెడ్డి? | Who is Nitish Reddy? 20-year-old hits maiden fifty in Mullanpur | Sakshi
Sakshi News home page

IPL 2024: విధ్వంసం సృష్టించిన తెలుగు కుర్రాడు.. ఎవరీ నితీష్‌ రెడ్డి?

Published Tue, Apr 9 2024 11:43 PM | Last Updated on Tue, Apr 9 2024 11:47 PM

Who is Nitish Reddy? 20-year-old hits maiden fifty in Mullanpur - Sakshi

PC:IPL.com

ఐపీఎల్‌లో ఛాన్నళ్ల తర్వాత ఓ తెలుగు కుర్రాడు తన సత్తా ఏంటో చూపించాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు, ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీష్‌ కుమార్‌ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్లాసెన్‌, మార్‌క్రమ్‌ వంటి వరల్డ్‌ క్లాస్‌ ఆటగాళ్లు విఫలమైన చోట ఈ ఆంధ్ర ఆటగాడు సత్తాచాటాడు.

28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన నితీష్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తొలుత ఆచితూచి ఆడిన నితీష్‌.. క్రీజులో కాస్త సెట్‌ అయ్యాక భీబత్సం సృష్టించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికి నితీష్‌ మాత్రం భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 37 బంతులు ఎదుర్కొన్న నితీష్‌.. 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. అద్బుత ఇన్నింగ్స్‌తో జట్టుకు 182 పరుగుల భారీ స్కోర్‌ను అందించాడు. కాగా నితీష్‌ కుమార్‌కు తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఇదే తొలి హాఫ్‌ సెంచరీ కావడం గమనార్హం.  అదే విధంగా బౌలింగ్‌లో కూడా నితీష్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.

ఎవరీ నితీష్‌ కుమార్‌ రెడ్డి..?
20 ఏళ్ల కాకి నితీష్‌ కు​మార్‌ రెడ్డి 2003, మే 26న విశాఖపట్నంలో జన్మించాడు. నితీశ్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి, హిందుస్తాన్ జింక్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు. నితీష్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. నితీష్‌కు 14 ఏళ్ల వయస్సులో విజయ్ మర్చంట్ ట్రోఫీ(2017-18)లో ఆంద్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.

తనకు వచ్చిన అవకాశాన్ని నితీష్‌ సద్వినియోగ పరుచుకున్నాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో 176.41 యావరేజ్‌తో 1237 పరుగులు, బౌలింగ్‌లో 26 వికెట్లు తీశాడు. బీసీసీఐ నుంచి 2017-18 ఏడాదికి గాను ‘బెస్ట్ క్రికెటర్ ఇన్ ది అండర్16’ జగన్మోహియా దాల్మియా అవార్డు గెలుచుకున్నాడు.

ఆ తర్వాత 2020 రంజీ ట్రోఫీ సీజన్‌లో ఆంధ్ర  జట్టు తరపున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అనంతరం 2021లో లిస్ట్‌-ఏ క్రికెట్‌ అరంగేట్రం చేశాడు. అదే ఏడాది టీ20ల్లో కూడా నితీష్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటివరకు 17 మ్యాచ్‌లు ఆడిన రెడ్డి.. 566 పరుగులతో పాటు 52 వికెట్లు పడగొట్టాడు.

అదే విధంగా లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 403 పరుగులతో పాటు 14 వికెట్లు సాధించారు. కాగా టీ20ల విషయానికి వస్తే.. ఆంధ్రా జట్టు తరపున 8 మ్యాచ్‌లు ఆడిన నితీష్‌ 106 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో దేశీవాళీ క్రికెట్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో నితీశ్ రెడ్డిని ఐపీఎల్‌ 2023 వేలంలో రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కి  సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.

గతేడాది సీజన్‌లో ఆర్సీబీతో మ్యాచ్‌లో నితీష్‌ ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. కాగా ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ నాలుగో ఆంధ్రా క్రికెటర్‌గా నితీశ్ రెడ్డి నిలిచాడు. ఇంతకుముందు వేణుగోపాల రావు, అంబటి రాయుడు, శ్రీకర్ భరత్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement