ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత రెజ్లర్ రితికా హుడాకు చేదు అనుభవం ఎదురైంది. అద్భుత ప్రదర్శనతో ప్రిక్వార్టర్స్‌లో విజయం సాధించిన ఆమె.. క్వార్టర్ ఫైనల్‌లో ఓటమిని మూటగట్టుకుంది. అయితే, కాంస్య పతక రేసు ఆశలు మాత్రం ఇంకా సజీవంగానే ఉన్నాయి.
కాగా హర్యానాకు చెందిన రితికా హుడా.. మహిళల 76 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్ తరఫున ప్యారిస్ బరిలో దిగింది. హంగేరీ రెజ్లర్ బెర్నాడెట్ న్యాగీతో శనివారం మధ్యాహ్నం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో 12-2తో రితికా పైచేయి సాధించింది.
తద్వారా ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో రితికా హుడా విజేతగా నిలిచింది. ఫలితంగా క్వార్టర్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. అయితే, అక్కడ మాత్రం రితికకు కఠినసవాలు ఎదురైంది.
కిర్గిస్తాన్‌కు చెందిన టాప్ సీడ్ ఐపెరి మెడిట్ కిజీతో రితికా క్వార్టర్స్‌లో తలపడింది. అయినప్పటికీ తన శక్తినంతటినీ ధారపోసి.. కిజీని నిలువరించేందుకు రితికా ప్రయత్నించింది. ఆఖరి వరకు పట్టుదలగా పోరాడి 1-1తో స్కోరు సమం చేసింది. అయితే, కౌంట్‌బ్యాక్ రూల్ ప్రకారం.. కిజీ చివరి పాయింట్ గెలిచింది.
దీంతో ఐపెరి మెడిట్ కిజీని రిఫరీ విజేతగా ప్రకటించారు. అయితే, కిజీ గనుక ఫైనల్ చేరితే రితికాకు రెపిచెజ్‌లో పోటీపడే అవకాశం ఉంటుంది. ఇందులో గెలిస్తే రితికాకు కాంస్యమైనా ఖాయమవుతుంది.
కౌంట్‌బ్యాక్ రూల్ అంటే ఏమిటి?
యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(UWW) నిబంధనల ప్రకారం.. బౌట్ ముగిసేసరికి ఇద్దరు రెజ్లర్లు సమానంగా పాయింట్లు సాధిస్తే.. ‘టై’ బ్రేక్ చేయడానికి కౌంట్‌బ్యాక్ రూల్‌ను వాడతారు. ఈ క్రమంలో తమకు ఇచ్చిన మూడు అవకాశాల్లో ఎవరైతే.. ప్రత్యర్థిని ఎక్కువ సేపు హోల్డ్ చేసి.. తక్కువ తప్పులు చేస్తారో.. అదే విధంగా చివరగా ఎవరు టెక్నికల్ పాయింట్ సాధిస్తారో వారినే విజేతగా ప్రకటిస్తారు.
రితికా- కిజీ మ్యాచ్‌లో.. కిజీ తప్పు కారణంగా రితికకు తొలి పాయింట్ వచ్చింది. అయితే, తర్వాతి బౌట్‌లో కిజీ పాయింట్ స్కోరు చేసి పైచేయి సాధించింది. ఫలితంగా రిఫరీ ఆమెను విజేతగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment