ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌తో పకోవ్‌స్కీ(ఫొటో కర్టెసీ: క్రికెట్ ఆస్ట్రేలియా)
ఆడటం, ఆటలో తలకు దెబ్బ తగిలించుకోవడం, ఆపై విరామం, మళ్లీ రావడం, మళ్లీ తలకు దెబ్బ... వింతగా అనిపించినా ఇదంతా విల్ పకోవ్‌స్కీకి రొటీన్ వ్యవహారం! అత్యంత ప్రతిభావంతుడు... అన్ని రకాల షాట్లూ ఆడగల నైపుణ్యం... 23 ఏళ్ల పకోవ్‌స్కీ గురించి ఆస్ట్రేలియా క్రికెట్‌లో వినిపించే మాట. అంచనాలకు అనుగుణంగా అతని దేశవాళీ రికార్డు కూడా అద్భుతంగా ఉంది. 23 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 54.50 సగటుతో అతను 1,744 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు కూడా ఉన్నాయి.
ఇదే అతడికి ఆస్ట్రేలియా తరఫున టెస్టు క్రికెట్ ఆడే అవకాశం కల్పించింది. అయితే ఇంత దూరం ప్రయాణించడానికి ముందు అతని జీవితంలో పలు ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ‘కన్‌కషన్’ సమస్యకు పకోవ్‌స్కీ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. ఈ సమస్య మాత్రం ఇప్పటికీ అతడిని వెంటాడుతూనే ఉంది. పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు సిడ్నీ టెస్టుకు ముందు అతను ప్రత్యేకంగా న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాల్సి వచ్చింది. అవిభాజ్య చెకోస్లొవేకియా మూలాలు ఉన్న అతని తండ్రి జాన్ తన చిన్నప్పుడే ముందుగా సెర్బియాకు, ఆపై ఆస్ట్రేలియాకు వలస వెళ్లిపోయాడు. ఈ నేపథ్యమే అతని పకోవ్‌స్కీ పేరుకు కారణం. (చదవండి: ‘ఏంటిది పంత్.. ఎందుకిలా చేశావు’)
దెబ్బలే దెబ్బలు...
పకోవ్‌స్కీ స్కూల్‌లో ఉన్నప్పుడు ఫుట్‌బాల్ ఆడుతుంటే ప్రత్యర్థి ఆటగాడి మోకాలు అతని తలకు బలంగా తాకింది. దాంతో ఆటతో పాటు స్కూల్ నుంచి కూడా ఆరు నెలలు అవుట్. క్రికెట్‌లోకి వచ్చాక కూడా ఆ దెబ్బ లక్షణాలు కనిపించాయి. కొన్నాళ్లకే ఒక బౌన్సర్‌తో తలకు గాయమైంది. కోలుకున్న కొద్ది రోజులకే ఇంట్లో జారి పడి తల తలుపును బలంగా ఢీకొంది. ఇది ఇంతటితో ముగియలేదు. నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా పక్క నెట్‌లో సాధన చేస్తున్న బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి ఊహించని విధంగా ఇతని వైపు వచ్చి తలకు తగిలింది. తన 17వ పుట్టిన రోజున తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడేందుకు సన్నద్ధమవుతున్న సంతోష సమయంలో ఆటతో సంబంధం లేని ఎవరో బయటి నుంచి విసిరిన బంతి నేరుగా వచ్చి పకోవ్‌స్కీ తల వద్దకే చేరుకుంది.
అంతే... సీజన్ మొత్తం పోయింది. కొద్ది రోజుల తర్వాత కన్‌కషన్ లక్షణాలు కనిపించాయి. అదే ఏడాది చివర్లో దేశవాళీ వన్డే మ్యాచ్‌లో బెన్ కటింగ్ బౌన్సర్ తలకు తగలడంతో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. నెల రోజుల తర్వాత ఫ్యూచర్స్ లీగ్ మ్యాచ్‌లో కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. 2018 మార్చిలో ప్రతిష్టాత్మక షెఫీల్డ్ షీల్డ్‌లో సెంచరీతో అందరి దృష్టిలో పడిన తరుణంలో సీన్ అబాట్ షార్ట్ బాల్ మళ్లీ తలకు తగిలింది... అంతే సీజన్ మొత్తం ఆడలేకపోయాడు! సరిగ్గా ఏడాది క్రితం పాకిస్తాన్‌తో టెస్టు అరంగేట్రం ఖాయమైన సమయంలో మానసిక సమస్యలు పెరిగిపోయి మూడు నెలలు క్రికెట్‌కే విరామం ఇచ్చేశాడు. ఈ ఏడాది ఆరంభంలో తన 22వ పుట్టిన రోజున ఇంగ్లండ్ యువ జట్టుతో మ్యాచ్‌లో సింగిల్ తీసే సమయంలో బ్యాట్ మైదానంలో ఇరుక్కుపోవడంతో బొక్కబోర్లా పడగా తలకు దెబ్బ తగిలి కన్‌కషన్‌కు లోనయ్యాడు.
ఎట్టకేలకు అరంగేట్రం...
తాజాగా షెఫీల్డ్ షీల్డ్‌లో వరుసగా రెండు డబుల్ సెంచరీలతో సత్తా చాటి భారత్‌తో సిరీస్ ఆడేందుకు సిద్ధమైన తరుణంలో ప్రాక్టీస్ మ్యాచ్‌లో కార్తీక్ త్యాగి బౌన్సర్ తలకు తగలడంతో కన్‌కషన్ కారణంగా రెండు టెస్టులు పోయాయి. వందలాది షార్ట్ పిచ్ బంతులను అద్భుతమైన పుల్ షాట్లతో బౌండరీలకు తరలించే నైపుణ్యం ఒకవైపు... ఇలా అనూహ్యంగా తప్పించుకునే ప్రయత్నంలో తలకు దెబ్బలు మరో వైపు ఆసీస్ మేనేజ్‌మెంట్‌ను కూడా అయోమయంలో పడేస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుంటే మన బౌలర్లు అలాంటి బంతులతో అతడిని ఇబ్బంది పెట్టడం కూడా ఒక వ్యూహంలా మారిపోయింది.
అయితే తొలి రోజు పకోవ్‌స్కీకి మరీ అలాంటి సమస్య ఏమీ ఎదురు కాలేదు. ఎట్టకేలకు తనపై ఉంచిన నమ్మకానికి న్యాయం చేస్తూ అతను అర్ధ సెంచరీ సాధించాడు. చక్కటి షాట్లతో ఆకట్టుకొని తనకు మంచి భవిష్యత్తు ఉందని దిగ్గజాల అభినందనలు చూరగొన్నాడు. ఇక ఈ యువ ఆటగాడి ఆటకు ఫిదా అయిన ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.. ‘‘ఈరోజు పకోవ్‌స్కీ ఇన్నింగ్స్‌తో ఇంప్రెస్ అయ్యాను. ఎన్నో అవాంతరాలు దాటిన తర్వాత తన జీవితంలో గొప్ప మలుపు. టెస్టుల్లో అరంగేట్రంలోనే మంచి ప్రదర్శన’’ అంటూ ప్రశంసలు కురిపించాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా అరంగేట్ర బౌలర్ నవదీప్ సైనీకి పకోవ్‌స్కీ వికెట్ సమర్పించుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment